తెలంగాణలో రాజ్య సంక్రమణ సిద్దాంతం ... తేల్చేసిన కరడుగట్టిన కమ్యూనిస్ట్ నేత బివిరాఘవులు
posted on Jul 10, 2024 @ 4:39PM
రాజ్యసంక్రమణ సిద్ధాంతం. ఈస్టిండియా కంపెనీకి గవర్నర్ గా పని చేసిన డల్హౌసీ ఈ సిద్దాంతానికి కర్త, కర్మ, క్రియ అని వేరే చెప్పక్కర్లేదు. . ఆయన రూపొందించి అమలుపరచిన ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం నవీన భారతావనిలోనూ కొనసాగుతోంది. ఈ సిద్ధాంతాన్ని భారత ఉపఖండంలో ఈస్టిండియా కంపెనీ పరిచయం చేసినప్పటికీ ఇది 1858 సంవత్సరం వరకు కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెన పాలన తర్వాత బ్రిటిషు వలస పాలకులు మనదేశాన్ని ఏలారు. రాజ్య సంక్రమణ సిద్దాంతం ప్రకారం సామంత రాచరిక సంస్థానాలలో పాలకుడు అసమర్ధుడైనా లేదా పుత్రసంతానం లేకుండా మరణించినా, ఆ రాజ్యాలు అప్రమేయంగా ఈస్టిండియా కంపెనీ రాజ్యంలో కలిసిపోతాయి.తరతరాలుగా పుత్ర సంతానం లేని రాజులు వారసున్ని దత్తత తెచ్చుకోవటమనే సంప్రదాయాన్ని ప్రోత్సహించింది. అంతేకాక కాబోయే పాలకుడు సమర్ధుడా? కాడా? అన్న విషయాన్ని బ్రిటీషువారే నిర్ణయించేవారు. ఈ సిద్ధాంతాన్ని అప్పట్లో మన భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీని అమలు న్యాయబద్ధంకాదని వాదించారు. చాలామంది భారతీయులు, స్వాతంత్ర సమర యోధులు ఈ సిద్దాంతంపై పోరాడారు. కానీ కరడు గట్టిన కమ్యూనిస్ట్ యోధుడైన సిపిఎం జాతీయ నేత అయిన బివి రాఘవులు రాజ్య సంక్రమణ సిద్దాంతం పై నోరు విప్పారు. రాజ్య సంక్రమణ సిద్దాంతం ఇంకా కొనసాగుతుందని కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా? ఎప్పుడు గద్దెనెక్కుదామా? అని బీజేపీ కాచుకొని కూర్చుందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు లౌకిక శక్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలపై కేంద్రం మోపిన భారాన్ని మరిచిపోయి... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చదువుతున్నారని విమర్శించారు.హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ... తెలంగాణలో బీఆర్ఎస్‌కు మనుగడ ఉండాలంటే బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూచించారు. పార్లమెంట్‌లో ఇష్యూ టు ఇష్యూను బట్టి వ్యవహరిస్తామని కేటీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. అలా స్పందించడమంటే రాజకీయం కాదని... లొంగుబాటు అవుతుందన్నారు.దేశమంతా అభివృద్ధి జరిగితే ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు ఎందుకు తగ్గాయో ప్రధాని మోదీ చెప్పాలని నిలదీశారు. సీట్లు ఎందుకు తగ్గాయో ఆలోచన, ఆత్మవిమర్శ లేకుండా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ ఎన్నికలను డబ్బులతో ముంచేసిందని ఆరోపించారు.తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు 19 శాతం నుంచి 35 శాతానికి పెరగడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇక్కడ బీజేపీని నియంత్రించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. కేరళలోనూ బీజేపీ ఒక సీటు సాధించడం చింతించాల్సిన విషయమే అన్నారు. ప్రధాని మోదీ కార్పోరేట్ శక్తులకు సేవకుడిగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.ఇండియా కూటమి విచ్ఛిన్నం కాకుండా ముందుకు వెళ్లడంలో సీపీఎం చేసిన త్యాగం మరే పార్టీ చేయలేదన్నారు. ఓట్లు.. సీట్లు కాదని... దేశాన్ని రక్షించుకోవడమే సీపీఎం లక్ష్యమన్నారు. తెలంగాణలో మతోన్మాదాన్ని ప్రజల మనస్సులో నుంచి తొలగించే బాధ్యత సీపీఎంపై ఉందన్నారు.