ముసలాయన... ముద్దు పెట్టేసేవాడే!
posted on Jul 19, 2024 @ 4:53PM
అమెరికాలోని వైట్‌హౌస్ సందడి సందడిగా వుంది. ఆల్రెడీ అమెరికా ప్రెసిడెంట్‌గా చాలా ‘‘ఉత్సాహంగా’’ పరిపాలిస్తున్న జో బైడెన్ చుట్టూ చాలామంది లేడీసూ, జెంటిల్‌మన్సూ వున్నారు. వాళ్ళలో బ్లూ డ్రస్ వేసుకున్న ఒక లేడీ బైడెన్‌కి చాలా దగ్గరగా నిల్చుని మాట్లాడుతోంది. బైడెన్ కూడా ఆమెతో చాలా ఆసక్తిగా మాట్లాడుతున్నాడు. అలా ఆసక్తిగా మాట్లాడుతూ వుండగానే, బైడెన్ తలకాయ్, ఆమె తలకాయ్ కొంచెం దగ్గర అయ్యాయి. ఇద్దరి తలకాయల మధ్య దూరం ఒక జానెడు కూడా లేని పరిస్థితి. మన ముసలాయన బైడెనూ, ఆయన ఎదురుగా వున్న మహిళామణి ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు తదేకంగా చూసుకుంటున్నారు. చుట్టూ జనం హడావిడి వున్నప్పటికీ, వీళ్ళిద్దరూ ఏదో లోకంలో వున్నట్టుగా ఒకరి కళ్ళలోకి ఒకరు గుచ్చిగుచ్చి చూసుకుంటున్నారు. ఇంతలో బైడెన్ తన పెదాలను సున్నాలాగా చుట్టాడు. చాలా తమకంగా ఎక్స్.ప్రెషన్ ఇస్తూ తన మూతిని ఆమె మూతి వైపు క్రమంగా మళ్ళించాడు.. ఇంకో అరక్షణం లేటయినట్టయితే, ఎదురుగా వున్న మహిళామణి బైడెన్ నుంచి గోల్డ్ లాంటి ఓల్డు ముద్దు సొంతం చేసుకునేదే. కానీ, ఆ ప్రమాదం జరక్కుండా బైడెన్ భార్యామణి జిల్ బైడెన్ అడ్డుపడింది. ఎక్కడ నుంచి వచ్చిందోగానీ, గబగబా అక్కడకి వచ్చేసింది. బైడెన్‌కి, ఆ మహిళకి మధ్యలోకి దూరిపోయింది. ‘‘ఏంటీపని?’’ అన్నట్టుగా బైడెన్‌ని పక్కకి జరిపింది. బైడెన్ ఈ లోకంలోకి వచ్చినట్టుగా నాలుక కరుచుకుని పక్కకి తప్పుకున్నాడు. అప్పుడు బైడెన్ భద్రతా సిబ్బంది బైడెన్ ఇవ్వబోయిన కరెంట్ షాక్ లాంటి ముద్దు నుంచి తప్పించుకున్న సదరు మహిళామణిని అక్కడి నుంచి పక్కకి తప్పించారు. కొత్తదో, పాతదో తెలియదుగానీ, ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
సరే, ముద్దు సంగతి అలా వుంచితే, బైడెన్‌కి 81 సంవత్సరాలు వచ్చేశాయి. మనిషి ఎప్పుడు చూసినా అయోమయం జగన్నాథం మాదిరిగా పనులు చేస్తున్నాడు. లేటెస్ట్.గా బయటకి వచ్చిన ముద్దు సీను మాదిరిగానే, గతంలో ఇలాంటి అయోమయం పనులు చాలానే చేశాడు. ఇలాంటి ముసలాయన మళ్ళీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచాడు. ఈయనేమో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో వుంటే, ఈయన మీద పోటీ చేయబోతున్న 78 ఏళ్ళ డోనాల్డ్ ట్రంప్ మాత్రం చిచ్చరపిడుగులా చెలరేగిపోతున్నాడు. ఇటీవల ఒక బుల్లెట్ దూసుకొచ్చి ట్రంప్ చెవిని కొరికినప్పటికీ, ‘తగ్గేదేలా’ అన్నట్టుగా దూసుకెళ్తున్నాడు. అదే సమయానికి మన బైడెన్ మరోసారి కరోనా బారిన పడి, క్వారంటైన్‌లో వున్నాడు. అటుపక్క ట్రంప్ రెడ్‌బుల్‌లా వుంటే, ఇటుపక్క బైడెన్ బుల్‌డోజర్ మాదిరిగా తయారయ్యాడు. అందుకే డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు అమెరికా అధ్యక్ష బరిలో నుంచి తప్పుకోవాలంటూ బైడెన్‌ని డిమాండ్ చేస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ఇదే మాట అన్నాడు. కరోనా క్వారెంటైన్ పూర్తయిన తర్వాత బైడెన్ ఈ విషయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్న వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా, 81 ఏళ్ళు వచ్చేసిన బైడెన్ ఇప్పటికే చీకేసిన తాటికాయలాగా అయిపోయాడు. పొరపాటున ఈయనగనుక మళ్ళీ అధ్యక్షుడు అయితే ఇంకెన్ని అయోమయం పనులు చేస్తాడో ఏంటో! అందువల్ల, ఈ పెద్దాయన పద్ధతిగా తప్పుకుని, ట్రంప్‌ని ఎదుర్కొనే గట్టి పిండానికి అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.