ఏపీకి కేంద్రం సహకారంపై అప్పుడే అనుమానాలు? మోడీ ఏం చేయబోతున్నారు!
posted on Jul 19, 2024 @ 10:49AM
ప్రధాని నరేంద్రమోడీ ఏపీ విషయంలో సానుకూలంగా ఉంటారా? అన్న విషయంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 2014లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో పర్యటించిన సందర్భంగా మోడీ రాష్ట్రానికి పలు వాగ్దానాలు చేశారు. అయితే ఆ తరువాత వాటిపై సీతకన్నేశారు. ఏ హామీనీ పూర్తిగా అమలు చేయలేదు. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, విశాఖ రైల్వే జోన్ ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా.. ఏపీకి సహకారం అందించే విషయంలో అప్పటి మోడీ సర్కార్ ముందుకు రాలేదు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని చెబుతూ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని తెరపైకి తీసుకువచ్చింది. దానికీ పలు కొర్రీలు వేసింది.
అప్పట్లో మోడీ సర్కార్ తీరు వల్లే తెలుగుదేశం ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిందనడంలో సందే హం లేదు. ఆ విషయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు అప్పట్లోనే పలు మార్లు స్పష్టత ఇచ్చారు. మోడీ సర్కార్ విధానాలతో కాదు, ఏపీ ప్రయోజనాల పట్ల ఆ ప్రభుత్వ తీరుతోనే తమ పేచీ అని పలు సందర్భాలలో చెప్పారు. సరే 2019 నుంచి 2024 వరకూ అంటే ఏపీలో జగన్ సర్కార్ అధికారంలో ఉన్న కాలంలో కేంద్ర ప్రభుత్వానికి అసలు ఏపీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు ఏపీ అభివృద్ధి పట్ల ఎలాంటి పట్టింపూ లేకపోవడమే. ఎంత సేపూ నిబంధనలతో పని లేకుండా అప్పులకు అనుమతి, ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులు విచారణ వేగం పుంజుకోకుండా ఉండేలా కేంద్రం సహకారం అందితే చాలన్నట్లుగానే జగన్ ఐదేళ్ల పాలన సాగింది.
సరే 2024 ఎన్నికలలో జగన్ సర్కార్ గద్దెదిగింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు పరిస్థితి మళ్లీ 2014లగే మారింది. అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే తేడా. అప్పట్లో కేంద్రంలో బీజేపీకి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మద్దతుతో సంబంధం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం ఉంది. ఇప్పుడది లేదు. అంతే కాకుండా బీజేపీ తరువాత ఎన్డీయే కూటమిలో సంఖ్యాబలం ఎక్కువ ఉన్న పార్టీ తెలుగుదేశం. దీంతో చంద్రబాబు మాటకు మోడీ అనివార్యంగా విలువనివ్వాల్సిన పరిస్థితి ఉంది. అయితే మోడీ నైజం తెలిసిన వారెవరూ ఆయన ఆ కారణంతో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తారని విశ్వసించడం లేదు. గతంలో చెప్పిన సాకులతోనే ఈ సారి కూడా రాష్ట్రానికి మొండి చేయి చూపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
ఎన్డీఏలో ఏపీలోని కూటమి ప్రభుత్వం కూడా భాగస్వాపక్షమే అయినా ఏపీ అభివృద్ధికి సహకారం విష యంలో మోడీ ఏమంత చొరవగా వ్యవహరించరన్న భావనే రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నది. అమరావతి,పోలవరం పూర్తి చేయాలని చంద్రబాబు కల. కాని ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం వాటిని పూర్తి చేయడానికి కావలసిన నిధులు ఇస్తుందా అనేది అనుమానమే. ఇప్పటికే చంద్రబాబు రెండుసార్లు ఢిల్లీ వెళ్లి పీఎం, మంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని కూలంకషంగా వివరించారు.ఆర్ధిక సాయం అందించాలని, బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక వరాలు కల్పించాలని ఆర్ధిక మంత్రికి విన్నవించారు. రెండోసారి ఢిల్లీ వెళ్లినప్పుడు బాబు అమిత్ షా ను మాత్రమే కలసివచ్చారు.ఆయనతో ఆర్ధిక విషయాలను చర్చిం చారని వార్తలు వచ్చాయి. బీహార్లో ప్రతిపక్షం ఆర్జేడీ హోదాపై ఒత్తిడి చేస్తున్నది. ఏపీలో జగన్ ఒకసారి ప్రస్తావించారు గాని పెద్దగా ఒత్తిడిలేదు.వామపక్షాలు,కాంగ్రెస్ ఒత్తిడి ఉందిగాని వారికి బలం లేదు కావున పట్టించుకోవడం లేదు.నీతిఅయోగ్ హోదా ఇవ్వవద్దని సిఫార్స్ చేసిందని గతంలో బీజేపీ నాయకులు చెప్పారు. ఏదిఏమైనా అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలనే సామెత ప్రకారం హోదా లేదా భారీగా నిధులు ఇస్తారా లేదా అనే విషయం కేంద్రంతో తేల్చుకోవడమే బెటరని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బీజేపీతో,మోడీతో సత్సంబంధాలు ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిధులు రాబట్టడానికి తన వంతు కృషి చేయాల్సి ఉంది.
బాబు ఎంపీలతో పార్లమెంట్లో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్ర పరిస్థితి ప్రస్తావిస్తూ నిధులు వచ్చేలా చూడాలని సూచించారు. మొత్తం మీద ఏపీ విషయంలో బీజేపీ కర్రా విరగొద్దు.. పామూ చావొద్దన్న చందంగా వ్యవహరిస్తున్నదని అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. బీజేపీ నాయకులు చేస్తున్న ప్రకటనలు, వ్యాఖ్యలూ చూస్తుంటే ఏపీ సహకారం విషయంలో కేంద్రం నుంచి పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి అవకాశం లేదన్న చందంగా ఉంటున్నాయి. ఇప్పటికే ఓ కేంద్ర మంత్రి ఏపీకి ప్రత్యేక హోదా అంశం అసలు కేంద్రం పరిశీలనలోనే లేదని చెప్పారు. తెలుగుదేశం గ్యారంటీలతో కేంద్రానికి కానీ బీజేపీకి కానీ సంబంధం లేదని బీజేపీ ఏపీ నాయకులు అంటున్నారు. దీంతో కేంద్రం నుంచి ఏపీకి సహకారం విషయంలో అప్పడే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.