తిరుమలలో అరాచకాలకు చెల్లు చీటీ!
posted on Jul 19, 2024 @ 9:52AM
వైసీపీ హయాంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో జరిగిన అరాచకాలు, అపచారాలు అన్నీ ఇన్నీ కావు. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోజరిగిన అవినీతి అక్రమాలకు లెక్కే లేదు. హిందూ ధర్మానికి విరుద్ధంగా తిరుమల కొండపై అన్యమత ప్రచారం జరిగింది. అడ్డగోలు దొపిడీ అడ్డూ అదుపూ లేకుండా సాగింది. చివరికి స్వామి వారి ప్రసాదం లడ్డూ నాణ్యత, అన్నప్రసాదం, పరిశుభ్రత, భక్తుల సౌకర్యాలనూ జగన్ సర్కార్ పట్టించుకోలేదు. అనేక అంశాల్లో గడిచిన ఐదేళ్ల కాలంలో తిరుమలకు వెళ్లిన అనేక మంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలపై ప్రత్యేక దృష్టిసారించారు. సీఎం బాధ్యతలు చేపట్టిన తరువాత కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. తిరుమల వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేకాక వైసీపీ ప్రభుత్వంలో తిరుమల కొండపై జరిగిన అవినీతి, అక్రమాలపైన దృష్టిసారించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రక్షాళన తిరుమల నుంచే ప్రారంభిస్తానని చెప్పారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మారెడ్డి స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె. శ్యామలరావును ప్రభుత్వం నియమించింది. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి వరుస ఆకస్మిక తనిఖీలు చేస్తూ టీటీడీలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పలు విభాగాల్లో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. శ్రీవారి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదాలు అందేవిధంగా, శ్రీవారి లడ్డూ నాణ్యత ప్రమాణాలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోంది. వరుస తనిఖీల క్రమంలో గురువారం తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్‌ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్‌ఎస్‌డి) అధికారుల బృందంతో కలిసి ఈవో శ్యామలరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్‌ఎస్‌డీ డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్‌లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్, కొన్ని కిరాణా సామగ్రితో సహా కూరగాయలు కుళ్లి పోయినట్లు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలుకూడా నాసిరకంగా ఉన్నాయని గుర్తించారు. హోటల్‌లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించడమే కాకుండా లైసెన్స్ ఫీజు కూడా చెల్లించని బాలాజీ భవన్ హోటల్ లైసెన్సును రద్దు చేశారు. హోటల్ ను సీజ్ చేశారు.
మరోవైపు వైసీపీ ఐదేళ్ల పాలనలో టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన వై.వి. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డిలు అన్నీ తామై పాలన సాగించారు. పాలక మండలి నిర్ణయాలు, వాటిలోని స్వప్రయోజనాలు, అవినీతి అక్రమాలతోపాటు ధర్మారెడ్డి కార్యనిర్వహణాధికారిగా ఉన్న సమయంలో జరిగిన లోటుపాట్లపై విజలెన్స్ విభాగం ప్రత్యేకంగా తనిఖీలు చేస్తుంది. వీటితోపాటు టీటీడీలోని ఉద్యోగులు ఏ విభాగంలో ఎంతకాలంగా పనిచేస్తున్నారనే అంశంపైనా విజిలెన్స్ విభాగం దృష్టిసారించింది. మరో వైపు టీటీడీ చరిత్రలో ఏ అధికారీ చేయని రీతిలో ధర్మారెడ్డి అధికారం చెలాయించారనే విమర్శలున్నాయి. అప్పట్లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితుడనే కారణంగా అధికార పార్టీలోనూ అతికొద్ది మంది ముఖ్య నేతలను మినహా మిగిలిన వారిని ధర్మారెడ్డి ఖాతరు చేయలేదు. వైసీపీ ముఖ్యులకు, పాలకమండలి ముఖ్యులకు లబ్ధికలిగించేలా నిధులు కేటాయింపులు జరిపి ఆర్థికపరమైన తప్పిదాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ధర్మారెడ్డిపై ఉన్నాయి. తిరుమల కొండపై ఈవో హోదాలో ధర్మారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలతో సహా సేకరించే పనిలో విజిలెన్స్ విభాగం అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో ధర్మారెడ్డిపై క్రిమినల్ కేసులు నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
తిరుమలలో భక్తులకు నాణ్యమైన సేవలు అందించేలా తెలుగుదేశం ప్రభుత్వం కంకణం కట్టుకుని చర్యలు తీసుకుంటోంది. టీటీడీకీ ఈవోతోపాటు తిరుమలకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున ఇద్దరు జేఈవోలుంటారు. కానీ, గత వైసీపీ ప్రభుత్వం ఇద్దరు జేఈవోలనూ తిరుపతికే పరిమితం చేసి తిరుమలలో ఈవోగా ధర్మారెడ్డిని మాత్రమే కొనసాగించింది. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్దతిని అమల్లోకి తీసుకొచ్చింది. ఈవోతో పాటు తిరుమలకు జేఈవోను యధావిధిగా కొనసాగించేందుకు నిర్ణయించింది. ఈ క్రమంలోనే టీటీడీ జేఈవోగా సీహెచ్ వెంకయ్య చౌదరిని ప్రభుత్వం నియమించింది. సమర్థవంతమైన అధికారిగా పేరున్న వెంకయ్య చౌదరి నియామకంతో టీటీడీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీటీడీలో మార్పుల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. గత వైసీపీ హయాంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ప్రస్తుతం టీటీడీకీ మళ్లీ పూర్వవైభవం వచ్చిందని పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.