మనసున్న కుటుంబానికి సెల్యూట్!
posted on Jul 19, 2024 @ 12:16PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన నివాసం నుంచి సెక్రటేరియట్‌కి తన కాన్వాయ్‌లో బయల్దేరారు. కాన్వాయ్ కదిలింది. కొంతదూరం వెళ్ళింది. కొంతమంది వ్యక్తులు రోడ్డు పక్కన నిల్చుని వున్నారు. యథాలాపంగా వాళ్ళవైపు చూసిన చంద్రబాబుకు, వాళ్ళలో తన కుమారుడితో దీనంగా నిల్చుని వున్న ఒక మహిళ కనిపించింది. చంద్రబాబు ఆ మహిళను గుర్తుపట్టారు. వెంటనే కాన్వాయ్ ఆపారు. కారులోంచి దిగి ఆ మహిళ దగ్గరకి వెళ్ళారు. ‘ఎలా వున్నావమ్మా’ అని పలకరించారు. చంద్రబాబు కారు దిగి తనను పలకరించడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేవు. ఆ మహిళ మరెవరో కాదు.. గతంలో మావోయిస్టుల కాల్పుల్లో మరణించిన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ భార్య. ఆమె చంద్రబాబుకు తన పరిస్థితిని వివరించింది. తన కుమారుడి చదువు గురించి చెప్పింది. చంద్రబాబు ఆమె కుమారుడి చదువు బాధ్యత తాను తీసుకుంటానని, ఉన్నత చదువులకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. అప్పుడు ఆ తల్లీ కొడుకుల కళ్ళలో ఆనందాన్ని చూడటానికి వెయ్యికళ్ళు కావాలి.
ఐఐటీ, ఎన్ఐటీలలో 25 మంది దివ్యాంగులు ర్యాంకులు సంపాదించుకున్నారు. కానీ, ఆ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరడానికి సబ్జెక్టులకు సంబంధించిన తిరకాసు ఒకటి ఏర్పడింది. ఆయా సంస్థల్లో చేరడానికి సదరు దివ్యాంగులకు ఒక సబ్జెక్టు తగ్గింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో పద్ధతులు వేరు. కేంద్ర విద్యాసంస్థల రూల్స్ వేరు. దాంతో ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగులకు సీట్లు వచ్చినట్లే వచ్చి చేజారిపోయే పరిస్థితి ఏర్పడింది. రెండ్రోజుల్లో పని జరగాలి. లేకపోతే సీటు మీద ఆశలు వదిలేసుకోవడమే. అలాంటి సమయంలో ఒక విద్యార్థికి నారా లోకేష్‌కి వాట్సప్ మెసేజ్ పెట్టాలని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ఆ మెసేజ్ అందుకున్న నారా లోకేష్ పరిస్థితి తీవ్రతను, ఆ సమస్యను వేగంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని అర్థం చేసుకున్నారు. చకచకా పావులు కదిపారు. రాష్ట్రానికి చెందిన దివ్యాంగులు కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు పొందడానికి అడ్డంకిగి నిలిచిన అంశాన్ని సవరిస్తూ వెంటనే జీవో జారీ చేయించారు. కేంద్ర విద్యాసంస్థలతో కూడా సమన్వయం చేసుకున్నారు. ఒక మంచి పని ఫలితాన్ని ఇచ్చింది. పాతికమంది ప్రతిభావంతులైన దివ్యాంగులకు కేంద్ర విద్యా సంస్థల్లో సీట్లు వచ్చాయి. ఆ పిల్లలందరూ తమ ఆనందాన్ని పంచుకోవడానికి లోకేష్ దగ్గరకి వచ్చినప్పుడు, వారికి లాప్‌టాప్‌లు బహుమతిగా అందించి లోకేష్ కూడా తన ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆ పిల్లలు, వారి తల్లిందండ్రులు కృతజ్ఞతలు తెలుపుతూ మాట్లాడిన మాటలు వింటే.... కఠిన హృదయాలైనా సరే కరిగిపోయి, కళ్ళలో కనిపిస్తాయి.
చింతపర్తి గ్రామానికి చెందిన శివది రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబం. ఇంటికి దీపం లాంటి ఇల్లాలు, బంగారు బొమ్మల్లాంటి ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళని చూసుకుంటూ, తన పేదరికాన్ని కూడా మరచిపోతూ వుండేవాడు శివ. అయితే పెరుగుతున్న పిల్లలను చూసి శివ మనసులో తన బాధ్యత గుర్తొచ్చింది. తాను ఇలాగే పేదరికంలో కొనసాగితే తన పిల్లలు కూడా పేదవాళ్ళుగానే మిగిలిపోతారు. అందుకే, గల్ఫ్ దేశాలకు వెళ్ళి కష్టపడి పనిచేయాలి. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి... తాను కొవ్వొత్తిలా కరిగిపోయినా పర్లేదు.. తన కుటుంబం ఆ వెలుగులో సంతోషంగా వుండాలి. ఇదే ఆలోచనతో శివ కువైట్ బాటపట్టాడు. అయితే, ఇక్కడి ఏజెంట్ శివకి చెప్పిందొకటి, కువైట్‌కి వెళ్ళిన తర్వాత శివకి ఎదురైన పరిస్థితి మరొకటి. కువైట్ ఎడారిలో కోళ్ళు, గొర్రెలు, పావురాలు, బాతుల్ని మేపే పనిలో శివ చేరాల్సి వచ్చింది. చుట్టూ నరమానవుడు కనిపించని ఎడారిలో జీవించాల్సి వచ్చింది. యజమానులు పట్టించుకోకపోవడం, కనీసం ఆహారం కూడా అందించకపోవడంతో శివ మానసికంగా క్రుంగిపోయాడు. ఇక్కడే ఇంకో రెండ్రోజులు వుంటే తాను చనిపోవడం ఖాయమని శివకి అర్థమైపోయింది. తన భార్యాపిల్లలు కళ్ళముందు కదిలారు. తాను లేకపోతే తన కుటుంబం ఏమైపోతుందో కూడా కళ్ళముందు కదిలింది. అంతే, తన చివరి ప్రయత్నంగా ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ దారుణమైన ఎడారిలో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నానని, ఏజెంట్ తనకు చెప్పిన పని ఒకటి, ఇక్కడ చేస్తోంది ఒకటి అని, ఎండ తీవ్రతకు ఆరోగ్యం దెబ్బతిందని, ఇంకో రెండ్రోజులు ఇక్కడుంటే చనిపోతానని, తనను రక్షించాలని శివ కన్నీటిపర్యంతం అవుతూ చెబుతూ వీడియో చేసి ఆన్‌లైన్‌లో పెట్టాడు.
శివ చేసిన ఆ వీడియో వైరల్ అయింది. నారా లోకేష్ దగ్గరకి చేరింది. దాంతో శివను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులు, టీడీపీ ఎన్నారై విభాగాన్నిలోకేష్ ఆదేశించారు. నారా లోకేష్ ఆదేశాల మేరకు ఎన్నారై టీడీపీ ప్రతినిధులు శివ కోసం కువైట్‌లో తీవ్రంగా గాలించారు. అయితే సదరు వీడియోలో ఎడారి ప్రదేశం మాత్రమే కనిపిస్తోంది. తాను ఎక్కడున్నాననేది శివ అందులో వెల్లడించలేదు. దీంతో అతని ఆచూకీ కనుక్కోవడం చాలా కష్టమైంది. అయినప్పటికీ రెండు రోజుల పాటు కువైట్‌లో గాలించి ఎట్టకేలకు శివ ఆచూకీని కనుగొన్నారు. శివ కువైట్ నుంచి భారతదేశానికి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో శివ మొన్న బుధవారం ఉదయం కువైట్ నుంచి తన స్వగ్రామం చింతపర్తికి చేరుకున్నాడు ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ, లోకేష్ చొరవతోనే తాను బతికి బయటపడ్డానని ఆనందాన్ని వ్యక్తం చేశాడు తాను స్వగ్రామానికి రావడానికి లోకేష్ చేసిన కృషి మరవలేనిదని, తమ కుటుంబం జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటుందని శివ ఆనందబాష్పాలతో చెప్పాడు.
హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో ప్రయాణిస్తున్న శశిధర్ అనే వ్యక్తికి ఆకస్మాత్తుగా అనారోగ్య సమస్య తలెత్తింది. శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బందిపడుతున్నాడు. విమానం తిరుపతికి వెళ్ళాలి. వెంటనే వైద్య సహాయం అందాలి.. అది ఎంతవరకు సాధ్యం అనే ఆలోచన విమానంలో వున్నవారిలో ఏర్పడింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న నారా భువనేశ్వరి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటనే ఆమె ఈ విషయాన్నిఏపీ సీఎంఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది విమానాశ్రయ అధికారులను అప్రమత్తం చేశారు. దాంతో తిరుపతి ఎయిర్ పోర్టులో విమానం వద్దకే డాక్టర్లను, అంబులెన్స్‌ను తీసుకొచ్చారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో ప్రయాణికుడు శశిధర్ ఊపిరి నిలిచింది.
సేవాభావం అనేది ఎవరో చెబితే వచ్చేది కాదు. మనసులోంచి పుట్టాలి. మనసు నిండా సేవ నిండిన మనుషులు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్. అధికారానికి అతీతమైన సేవాభావం వీరి మనసులలో వుంది కాబట్టే, ఆ మనసుల పరిమళం నిరంతరం అవసరం వున్నవారికి చేరుతూనే వుంది. బంగారానికి తావి అబ్బినట్టుగా, మంచి మనసులకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీస్సులు కూడా లభించాయి. ఈ మనసులు మరింత పరిమళించాలి.. ఆ పరిమళం మరెన్నో మనసులకు స్ఫూర్తినివ్వాలి..!