బడ్జెట్ జగన్నాథం!
posted on Jul 19, 2024 @ 3:56PM
సొంత సొమ్ము సోమవారం ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు అన్నట్లుగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్లు అధికారం వెలగబెట్టిన జగన్ ఇటీవలి ఎన్నికలలో పరాజయం పాలై అధికారం కోల్పోయారు.
అయితే ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్లలో కొద్ది పాటి దూరం ప్రయాణానికి కూడా ప్రత్యేక విమానాలు, చాపర్లనే ఉపయోగించారు. రోడ్డు మార్గంలో ప్రయాణం అన్న మాటే లేకుండా విమానయానాలు చేశారు. విదేశాలకు వెళ్లాలన్నా, ఢిల్లీ వెళ్లాలన్నా ఆయన చార్టర్డ్ ఫ్లైట్స్ నే ఉపయోగించారు. మళ్లీ అలాంటిలాంటివి కాకు అత్యంత లగ్జూరియస్ విమానాలనే ఉపయోగించారు. అటువంటి జగన్ అధికారం కోల్పోయిన తరువాత బెంగళూరు నుంచి గన్నవరానికి సాధారణ విమానంలో సతీమణితో కలిసి వచ్చారు. సొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వచ్చే సరికి ఆయనకు పొదుపు గుర్తుకు వచ్చినట్లుందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు.
జగన్ హయాంలో రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వోద్యోగులకు వేతనాలు చెల్లించడానికీ, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు సొమ్ము బదలాయించడానికీ కూడా ప్రభుత్వం అప్పుల మీదే ఆధారపడింది. అప్పు చేయకుండా ప్రభుత్వానికి రోజు గడవని పరిస్థితి ఉంది. అంతటి ఆర్థిక సంక్షోభంలో కూడా జగన్ స్పెషల్ ఫ్లేట్లు ఆడంబరాలకు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడానికి ఇసుమంతైనా వెనుకాడలేదు. అంతెందుకు తన సొంత తాడేపల్లి ప్యాలెస్ ను క్యాంప్ ఆఫీసుగా మార్చేసుకుని ప్యాలస్ నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వ ఖజానాయే భరించేలా చూసుకున్నారు.
పోనీ జగన్ ఏమైనా సామాన్యుడా అంటే... దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా గుర్తింపు పొందిన వ్యక్తి. అటువంటి సంపన్న జగన్ సొంత సొమ్ము ఖర్చు చేయాలనే సరికి అహా నా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావులా పిసినారిగా మారిపోయారు. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ జగన్ ను నెటిజనులు ఓ ఆటాడేసుకుంటున్నారు. ముందు ముందు జగన్ సాధారణ విమనాలలో మరిన్ని పర్యటనలు చేస్తారని అంటున్నారు. ముందు ముందు ఆయన ప్రతి శుక్రవారం అక్రమాస్తుల కేసుల విచారణ కోసం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన హైదరాబాద్ లో ఉంటే ఫరవాలేదు కానీ, తాడేపల్లిలోనో, బెంగళూరులోనో ఉంటే మాత్రం కోర్టుకు హాజరయ్యేందుకు ఒక విమానం ఎక్కక తప్పదనీ, సొంత సొమ్ముతో చేయాల్సిన ప్రయాణాలు కనుక సాధారణ కమర్షియల్ ఫ్లైట్స్ నే ఆశ్రయిస్తారని చెబుతున్నారు. మొత్తం మీద సొంత సొమ్ము ఖర్చు చేయాలంటే జగన్ కు చేతులు రావడం లేదు.. అదే జనం సొమ్ముతో దర్జాగా ప్రత్యేక విమానాలలో విహారయాత్రలుగా అధికార పర్యటనలు సాగించారనీ విమర్శలు గుప్పిస్తున్నారు.