కేసీఆర్, హరీష్ రావులకు కోర్టు నోటీసులు
posted on Aug 6, 2024 @ 2:40PM
గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి కాలం ఏ మాత్రం సానుకూలంగా లేదు. పార్టీ కష్టాలు, మరీ ముఖ్యంగా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ కష్టాలూ రోజు రోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభోట్టు అన్నట్లుగా తయారౌతోంది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడి హస్తం గూటికి చేరారు. మరి కొందరు కూడా అదే దారిలో ఉన్నారని పరిశీలకులు సోదాహరణంగా విశ్లేషిస్తున్నారు.
ఈ కష్టాలు చాలవన్నట్లు తాజాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జరీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గు తేల్చాలంటూ దాఖలైన పిటిషన్ లో భాగంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ , మాజీ మంత్రి హరీష్ రావుతోపాటు మరికొంతమందికి భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ భూపాలపల్లి జిల్లాకు చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి జిల్లా కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై కేసీఆర్ , హరీష్ రావుతోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ అధినేత మేఘాకృష్ణారెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ , సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ , ఇరిగేషన్ ఇంజినీర్ – ఇన్ – చీఫ్ హరిరాం, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్ లను ప్రతివాదులుగా చేర్చింది.
ఈ కేసులో కోర్టు కేసీఆర్ , హరీష్ రావుతోపాటు మరో ఆరుగురికి నోటీసులు ఇచ్చింది. వచ్చే నెల ఐదున కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ కుంగడంతో రాజలింగమూర్తి అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, అప్పట్లో బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈ విషయమై కేసు నమోదు చేయాలని ఎస్పీ, డీజీపీతో సహా ఎవరికి ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో జిల్లా కోర్టును ఆశ్రయించాడు. సరైన ఆధారాలు లేవని జిల్లా కోర్ట్ ఈ పిటిషన్ ను కొట్టివేయగా.. తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు సూచనల మేరకు మళ్లీ జిల్లా కోర్టులో అన్ని ఆధారాలతో పిటిషన్ దాఖలు చేశారు రాజలింగమూర్తి. దీంతో జిల్లా కోర్టు సెప్టెంబర్ 5న ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కేసీఆర్, హరీష్ తదితరులను వచ్చే నెల 5న కోర్టుకు హాజరు కాలాల్సిందిగా ఆదేశించింది. అసెంబ్లీకే డుమ్మా కొడుతున్న కేసీఆర్ విచారణకు హాజరౌతారా? లేదా అన్న చర్చ తెలుగ రాష్ట్రాలలో విస్తృతంగాజరుగుతోంది,