మేడిగడ్డ కుంగుబాటుపై కెసీఆర్ విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు
posted on Aug 6, 2024 @ 2:23PM
లక్ష కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాళేశ్వరం ప్రాజెక్టు బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయే విధంగా చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు మేడిగడ్డ బ్యారేజి కుంగడంతో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ అధికారంలో వచ్చేలా చేసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు వ్యవహారంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఈ బ్యారేజీ కుంగుబాటుకు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వమే కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరపాలంటూ ఓ వ్యక్తి దాఖలు చేసిన ప్రైవేటు పిటిషన్‌పై విచారణలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు పంపించింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి సహా పలువురికి నోటీసులు పంపించింది. సెప్టెంబరు 5న విచారణకు రావాలని స్పష్టం చేసింది.కాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై పోలీసులతో సమగ్ర విచారణ చేయించాలంటూ 2023 నవంబరు 7న భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి ప్రధాన మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ తమ పరిధిలోకి రాదంటూ జనవరి 12న కోర్టు కొట్టివేయగా.. ఆయన ఇటీవలే భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిన ఘటనలో వాస్తవాలు ప్రజల ముందు పెడతామని అధికార కాంగ్రెస్ నాయకులు కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. గత సంవత్సరం డిసెంబర్ 29న మేడిగడ్డ బరాజ్ దగ్గర అధికారులతో ఈ ప్రాజెక్ట్ పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ శాఖ అధికారులు తమ ఇంజనీరింగ్ బాధ్యతలు విస్మరించి గత ప్రభుత్వానికి కీలుబొమ్మలుగా వ్యవహరించారని, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా మాట్లాడలేదని ఈ సందర్భంగా మంత్రుల బృందం తీవ్ర ఆరోపణలు చేసింది.ప్రాజెక్ట్ పనికిరాని స్థితిలో తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని, ప్రాజెక్ట్ డిజైన్లు, మన్నిక, నిధుల దుర్వినియోగం ఇలా అనేక అంశాలపై మంత్రుల బృందం పలు అనుమానాలు వ్యక్తం చేసింది.