కెటీఆర్ ఓ అపరిచితుడు
posted on Aug 5, 2024 @ 2:17PM
పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు దుర్మార్గునికి అందరూ తనలాగే చెడ్డవాళ్ళలా కనిపిస్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వంకుంట్ల తారకరామారావు వ్యవహారశైలి అదే అనిపిస్తోంది. గత అసెంబ్లీలో ఘోర పరాజయం తర్వాత ఈ బిఆర్ఎస్ నేత మాటలకు చేతలకు పొంతన లేకుండా మాట్లాడేస్తున్నారు. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో జాతీయస్థాయిలో చక్రం తిప్పాలనుకున్న బిఆర్ఎస్ స్వంత రాష్ట్రంలో జీరోకి పడిపోయింది. ఆతర్వాతే బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ ప్రయత్నాలను మమ్మురం చేశారు. ఈ చర్చను కాసేపు పక్కన పెడితే తాజాగా కెటీఆర్ ఇచ్చే స్టేట్ మెంట్ చూస్తే ఆత్మాభిమానం అనుకోవాలో అహంకారం అనుకోవాలో చెప్పలేని పరిస్థితి.
తెలంగాణలో ఉపఎన్నికలు తప్పవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదన్నారు. పార్టీ ఫిరాయింపులపై తమ పార్టీ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమైనట్లు తెలిపారు. త్వరలో సుప్రీంకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ వేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసిందని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలోని పలువురు ప్రముఖ న్యాయ కోవిదులతో తన ఆధ్వర్యంలో పార్టీ బృందం చర్చలు జరిపిందన్నారు. అటు రాజ్యాంగ నిపుణులతోనూ ఈ రోజు పార్టీ ప్రతినిధి బృందం సమావేశమైందని వెల్లడించారు.ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్‌కు సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు ఆర్యమా సుందరం తమ పార్టీ బృందానికి తెలిపారని వెల్లడించారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘ కాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరన్నారు. ఈ సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్‌తో పాటు, పార్టీ మారిన ఎమ్మెల్యేల పైనా స్పీకర్‌కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు.గతంలో బిఆర్ఎస్ మంచి మెజార్టీతో గెలిచినప్పటికీ ఫిరాయింపులను ప్రోత్సహించింది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదన్న దుగ్దతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించారు.తాను చేస్తే శృంగారం, ఇతరులు చేస్తే ... అన్నట్టు తయారైంది తెలంగాణ రాజకీయాలు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయకోవిదులు, రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయపోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ స్పష్టం చేస్తున్నారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఒకవైపు జాతీయస్థాయిలో పార్టీ ఫిరాయింపుల పైన సుద్దపూస ముచ్చట్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. త్వరలో కోర్టుల సహాయంతో కాంగ్రెస్‌కు సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.తాను అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు పట్టించుకోని కెటీఆర్ ఇపుడు చట్టాలే పరిష్కారమంటున్నారు. రెండు నాల్కల ధోరణితో కెటీఆర్ మాట్లాడుతున్నారు