పుంగనూరు పుడింగి ఆటకట్టు.. పెద్దిరెడ్డి భూదందాలపై ప్రజాదర్బార్
posted on Aug 6, 2024 @ 10:05AM
అధికారం అండతో మంచి , చెడు, ఉచ్ఛం, నీచం అని లేకుండా తెగించి అక్రమాలకు పాల్పడిన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి ఇప్పుడు అన్ని దిక్కుల నుంచీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. పెద్దిరెడ్డి పాపాల పుట్టలు అన్నీ పగులుతున్నాయి. వైసీపీ అధికారంలో కొనసాగిన ఐదేళ్ల కాలంలో మంత్రి హోదాలో పెద్దిరెడ్డి పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్పడినట్లు విమర్శలు ఉన్నాయి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్దిరెడ్డి దోపిడీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
పుంగనూరు పుడింగి అక్రమాల నిగ్గు తేల్చడానికి తెలుగుదేశం మాస్టర్ ప్లాన్ తో ముందుకు సాగుతోంది. పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి భూదందాల నిగ్గు తేల్చడానికి కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెడుతోంది. జగన్ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యాలు, దాడులే కాకుండా పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడ్డారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడంతో పెద్ది రెడ్డి భూదందాలపై జనం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు.
వాస్తవానికి చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా పెద్దిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ.. నియోజకవర్గంలో అడుగుపెట్టేందుకు వీలులేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. జనం ఆయనను ఛీ కొడుతున్నారు. పెద్ది రెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల అరాచకాలపై ప్రజాగ్రహం ప్రజ్వరిల్లుతోంది.
ఈ నేపథ్యంలోనే మదనపల్లిలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంలో భూముల రికార్డులు దగ్ధమయ్యాయి. అయితే మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో జరిగింది అగ్ని ప్రమాదం కాదనీ, ఉద్దేశ పూర్వ కంగా రికార్డులను దగ్ధం చేశారన్న ఆరోపణలతో తెలుగుదేశం కూటమి సర్కార్ విచారణకు ఆదేశిం చింది. ఆ విచారణలో మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో ఫైళ్లను ఉద్దేశపూర్వకంగానే దగ్ధం చేశారని తేలింది. ఇలా ఉండగా పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల భూ దందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఆ ఫిర్యాదులపై విచారణకు తెలుగుదేశం ప్రభుత్వం సమాయత్తమౌతోంది.
పెద్ది రెడ్డి భూదందాల అంశంపై పుంగనూరులో ప్రజాదర్బార్ నిర్వహించాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఈ ప్రజాదర్బార్రా ద్వారా పెద్దిరెడ్డి అక్రమాలను వెలుగులోనికి తీసుకువస్తున్నారు. ఈ ప్రజాదర్బార్ లో పెద్దిరెడ్డి అక్రమాలు, భూ కబ్జాలు, దందాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పుంగనూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి, ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొంటున్నారు.
మరో వైపు మదనపల్లె సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా సాగుతోంది. తన భూదందాలు, కబ్జాలు, అక్రమాలు బయటపడకుండా ఉండేందుకు పెద్దిరెడ్డే ఈ అగ్ని ప్రమాదం నాటకానికి తెరలేపారనీ, ఫైళ్ల దగ్ధంలో పెద్దిరెడ్డి హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా దీనిపై విచారణాధికారిగా ఉన్నారు. ఆయన ఇప్పటికే మదనపల్లె డివిజన్ లోని 11 మండలాల తహశీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ విచారణకు అదనంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాదర్భార్ ద్వారా పెద్దిరెడ్డి కుటుంబ అవినీతిని బహిర్గతం చేయాలని నిర్ణయించింది. దీంతో పుంగనూరు పుడింగి అటకట్టైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఎందుకంటే రికార్డుల దగ్దం కేసులో అన్నివేళ్లూ పెద్దిరెడ్డి వైపే చూపుతుండటంతో పెద్దిరెడ్డికి ఉచ్చుబిగుసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మరో వైపు హైకోర్టులో ఎన్నికల అఫిడవిట్ పై విచారణ సాగుతోంది. ఇంకో వైపు ప్రజాదర్బార్ లలో పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదుల వెల్లువ. మొత్తం మీద పెద్దిరెడ్డి ఆటకట్టినట్లేననీ ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.