ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. బొత్సకు రాజకీయ సమాధా?
posted on Aug 6, 2024 @ 3:01PM
సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిపోనుందా? వైసీపీ అధినేత జగన్ నిర్ణయమే బొత్స రాజకీయ జీవితానికి సమాధి కట్టేయనుందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. బొత్త సత్యనారాయణ ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు, తనకే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించుకున్న చరిత్ర ఆయనది. అయితే 2014 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత బొత్స సత్యనారాయ సైలెంటైపోయారు. పెద్దగా పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా ఓ విధంగా అజ్ణాత వాసం చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ చేయందుకోనున్నారన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది.
ఇటీవల రాష్ట్రంలో శాంతి భద్రతలపై జగన్ హస్తినలో ధర్నా కార్యక్రమం చేపట్టిన సందర్భంగా బొత్స కూడా జగన్ వెంట హస్తిన వెళ్లారు. అయితే జగన్ బొత్సను వెంట తీసుకురావడానికి కారణం ధర్నా కాదని పరిశీలకులు విశ్లేషిస్తారు. జగన్ కు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లేందుకు ఆ పార్టీతో తనకున్న పాత పరిచయాలను ఉపయోగించుకోవడం కోసమేనని వైసీపీ శ్రేణులే అప్పట్లో చెప్పారు. సరే అసలు విషయానికి వస్త... జగన్ ఇప్పుడు బొత్స సత్యనారాయణకు ఓ పెద్ద టాస్క్ ఇచ్చారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బొత్సను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు.
అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ బొత్సకు సుతరామూ ఇష్టం లేదు. ఇటీవలి ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత వైసీపీకి ఈ ఉప ఎన్నికలో విజయం సాధించే అవకాశాలు అంతంత మాత్రమే. ఉప ఎన్నికలో ఫలితం తేడాగా వస్తే అక్కడితో బొత్స పొలిటికల్ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడినట్లే అంటారు. ఇప్పటికే బొత్స తనతో సహా తన కుటుంబ సభ్యులు ఐదుగురికి ఫ్యామిలీ ప్యాకేజీ చందంగా ఇటీవలి ఎన్నికలలో వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. అయితే ఎన్నికలలో ఆయన సహా ఆయన కుటుంబ సభ్యులందరూ పరాజయం పాలయ్యారు. ఇటీవలి ఎన్నికలలో బొత్స కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేశారు. బొత్స స్వయంగా చీపురుపల్లి నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. బొత్స సతీమణి విశాఖ లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక బొత్స సోదరుడు అప్పలనరసయ్య గజపతి నగరం నుంచి, ఆయన తోడల్లుడు బి.అప్పలనాయుడు నెల్లిమర్ల నుంచి, బొత్స సత్యనారాయణ సమీప బంధువు బెల్లెన చంద్రశేఖర్ విజయనగరం లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఈ తరుణంలో ఆయనను జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో దింపారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీపై అనర్హత వేటు పడి ఆ స్థానం ఖాళీ అవ్వడమే కారణం. అదలా ఉంటే విశాఖ స్థానిక సంస్థల ఎన్నికలో మొత్తం841 మంది ఓటర్లు ఉంటే వారిలో 615 మంది వైసీపీకి చెందిన వారే. తెలుగుదేశం పార్టీకి కేవలం 215 ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2020లో జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఎన్నికను అప్పట్లో తెలుగుదేశం బహిష్కరించింది. అయితే పార్టీ నేతలు, అభిమానులు పోటీలో నిలిచి పలు స్థానాలలో విజయం సాధించారు. కాగా గణాంకాలను బట్టి చూస్తే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో ఏ విధంగా చూసినా బొత్స విజయం తథ్యం అని జగన్ చెబుతున్నారు. అయితే క్షేత్ర స్థాయిలో వాస్తవాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇటీవలి ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. విశాఖ జిల్లాలో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా విజయం సాధించలేదు. ఆ స్థాయి పరాజయం తరువాత వైసీపీ స్థానిక ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పార్టీని వీడి తెలుగుదేశంలో చేరారు. అంతే కాకుండా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం ఇక్కడ పార్టీ అభ్యర్థి విజయం బాధ్యతను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు అప్పగించింది. ఎలక్షన్ మేనేజ్ మెంట్ స్కిల్స్ అపారంగా ఉన్న సీఎం రమేష్ వెంటనే రంగంలోకి దిగారు. దీంతో పోటీ బొత్స వర్సెస్ సీఎం రమేష్ గా మారిపోయింది. వైసీపీకి చెందిన పలువురు స్థానిక సంస్ఖల ప్రతినిథులు తెలుగుదేశం గూటికి చేరారు. మరింత మంది అదే దారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలో బొత్స పరాజయం పాలైతే ఆయన రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.