బొత్సను జగన్ నిండా ముంచేశారు!
posted on Aug 6, 2024 6:30AM
ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న నేతల్లో మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఒకరు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనలో బొత్సకు కూడా భాగస్వామ్యం ఉంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా ఆయన్ను ఎవరూ ఊహించని విధంగా గట్టి దెబ్బకొట్టారు. ఓడించి ఇంటికి పంపారు. ఏపీ రాజధాని అమరావతిని శ్మశాన వాటిక అంటూ అవహేళన చేసిన బొత్సకు మళ్లీ అమరావతి గురించి నోరెత్తకుండా చేశారు. ఓటమి తరువాత బొత్స పెద్దగా మీడియా ముందుకు కూడా రావటం లేదు. వచ్చినా నామ మాత్రంగా ప్రెస్ మీట్ పెట్టేసి ముగించేస్తున్నాడు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో ఉన్న బొత్స సత్యనారాయణకు మరో బిగ్ షాక్ తగలబోతుంది. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆయన్ను వదిలిపెట్టేలా లేరు. ఉమ్మడి విశాఖపట్టణం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స పేరును ప్రకటించారు. పోటీచేసేందుకు ఆయన సిద్ధంగా లేకపోయినా జగన్ తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి ఒప్పించినట్లు వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో విశాఖ ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. వాస్తవానికి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 841 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీకి 615 ఓట్లు, అధికార కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల ముందు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉమ్మడి జిల్లాకు చెందిన చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. వీరంతా స్థానిక సంస్థల శాసనమండలి ఓటర్లే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సను పోటీలోకి దింపితే పెద్ద సంఖ్యలో వైసీపీని వీడుతున్న ప్రజా ప్రతినిధులను కట్టడి చేయొచ్చన్నది జగన్ ఉద్దేశం. కానీ, ఉమ్మడి జిల్లాలోని చాలా మంది వైసీపీ ప్రజా ప్రతినిధులు బొత్స అభ్యర్థిత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ బొత్స, ఆయన కుటుంబం అనేక పదవులు అనుభవించారనీ, ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పినా మళ్లీ బొత్సకు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడం ఏమిటని అధికశాతం వైసీపీ ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తురు. దీంతో ఇప్పటికే వందమందికిపైగా స్థానిక సంస్థలకు చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులు ఆ పార్టీని వీడి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరిపోయారు. మరో 200 మంది తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమైనట్లు వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు బొత్స సత్యనారాయణ కూడా తొలుత అంగీకరించలేదు. అయితే, బొత్స కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుండటంతో ఎలాగైనా బొత్సను ఎమ్మెల్సీ బరిలో నిలిపి పార్టీ మారకుండా కళ్లెం వేయాలన్నది జగన్ ప్లాన్ గా వైసీపీ నేతలు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ ఇప్పటికే కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాహుల్ గాంధీకి దగ్గర వ్యక్తులుగా ఉన్న కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి షర్మిల ఆధ్వర్యంలో పని చేయాలని బొత్సకు సూచించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ కోలుకునే పరిస్థితి లేదని భావించిన బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సాను కూలంగా ఉన్నారని అంటున్నారు.
ఈ విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రెడ్డి, బొత్సను బలవంతంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఒప్పించారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డితో పాటు బొత్స సత్యనారాయణకు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అభ్యర్థే గెలుస్తాడని తెలుసు. అయినా అన్నీ నేను చూసుకుంటానని బొత్సను జగన్ బరిలోకి దింపారు. జగన్ మాట తీసేయలేక అయిష్టంగానే బొత్స పోటీకి సరే అన్నారని విశాఖ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో టాక్ నడుస్తోంది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో బొత్సను ఒడించేందుకు తెలుగుదేశం వ్యూహాలు రచిస్తోంది. సోమవారం సాయంత్రం పల్లా శ్రీనివాస్ నివాసంలో అయ్యన్న పాత్రుడు, సీఎం రమేష్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అరకు, పాడేరుకు చెందిన వైసీపీ ఎంపీటీసీ లు, జెడ్పీటీసీ లపై వారు ఫోకస్ పెట్టారు. ఈ సమావేశానికి ఏజెన్సీకి చెందిన 60 మంది వైసీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు హాజరయ్యారు. వారిని నేరుగా అమరావతిలో క్యాంపుకు తరలించినట్లు తెలిసింది. కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీలా గోవింద్ పేరును సీఎం చంద్రబాబు నాయుడు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. బొత్స అభ్యర్థిత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు వైసీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇప్పటికే కూటమి పార్టీలో చేరిపోయారు. దీంతో.. ప్రస్తుతం కూటమి అభ్యర్థికి అనుకూలంగా ఉన్నస్థానిక ప్రజాప్రతినిధుల సంఖ్య 500కు చేరినట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో బొత్స సత్యనారాయణ ఓటమి దాదాపు ఖాయమైనట్లు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.