ప్రాణభయంతో హడలిపోతున్న రెవెన్యూ ఉద్యోగులు....భూపరిపాలన నుంచి తప్పించాలని విజ్ఞప్తి
తహశీల్దార్ విజయారెడ్డి దారుణ హత్యతో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు ప్రాణభయంతో హడలిపోతున్నారు. ప్రతి చోటా భూవివాదాలు ఉండటంతో ముందుముందు ఇలాంటి ఘటనలు మరిన్ని పునరావృతం అవుతాయేమోనని భయపడుతున్నారు. విజయారెడ్డి హత్యపై ఒకపక్క ఆందోళనలు, నిరసనలు చేపడుతోన్న రెవెన్యూ యంత్రాంగం.... ఈ ఘటన నుంచి కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరముందంటూ అభిప్రాయపడింది. ముఖ్యంగా అత్యంత వివాదాస్పదంగాను, ప్రాణసంకటంగాను మారిన భూపరిపాలన విభాగం నుంచి తమను తప్పించాలని రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ జేఏసీ అయితే, ఇప్పట్నుంచే స్వచ్ఛందంగా భూపరిపాలన నుంచి తప్పుకుంటున్నామని, భూరికార్డులకు సంబంధించిన ఫైళ్లను తాము పరిశీలించబోమని ప్రకటించారు.
ఉద్యోగం కంటే తమకు ప్రాణమే ముఖ్యమంటోన్న రెవెన్యూ యంత్రాంగం... భూపరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే రైతుల కష్టాలు తీరవని.... అదే సమయంలో రెవెన్యూ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవనీ అభిప్రాయపడింది. భూ సమస్యలు పరిష్కారం కావాలంటే... ప్రధానంగా ఐదు అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించింది. సమగ్ర భూసర్వే.... భూచట్టాలపై సమీక్ష-సమగ్ర రెవెన్యూ కోడ్ రూపకల్పన.... టైటిల్ గ్యారంటీ చట్టం.... భూవివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రిబ్యునల్... భూరికార్డుల సవరణలో ప్రజల భాగస్వామ్యం... ఇలా ఐదు అంశాలతో చర్యలు చేపడితేనే... భూవివాదాలకు ఫుల్ స్టాప్ పడుతుందని రెవెన్యూ జేఏసీ అభిప్రాయపడింది.
రెవెన్యూశాఖకు ఒకప్పుడు రెవెన్యూ వసూలుతోపాటు భూపరిపాలనే కీలకంగా ఉండేదని, కానీ ఇప్పుడు భూపరిపాలన కంటే ...మిగతా పనులు ఎక్కువై-పోయాయని రెవెన్యూ యంత్రాంగం అంటోంది. ప్రోటోకాల్ నుంచి సంక్షేమ పథకాల వరకు అన్నీ రెవెన్యూ ఉద్యోగులే చేయాల్సి వస్తోందని, దాంతో కీలకమైన భూపరిపాలనకు సమయం కేటాయించలేని పరిస్థితి నెలకొందని, అందువల్లే సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు. లోభభూయిష్టమైన విధానాలు కూడా రెవెన్యూ ఉద్యోగులకు చెడ్డపేరు తీసుకొస్తున్నాయని అంటున్నారు. అసలు భూపరిపాలన నుంచి తమను తప్పిస్తే... ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.
అయితే, భూవివాదాలు పెరిగిపోవడానికి కారణాలను కూడా రెవెన్యూ జేఏసీ ప్రస్తావించింది.... భూమి హక్కుల నిరూపణకు రికార్డులే సాక్ష్యం కాకపోవడం... ఏ భూమి రికార్డునైనా, ఎప్పుడైనా సవరించే అవకాశం ఉండటం... భూరికార్డుల్లోని వివరాలకు భరోసా లేకపోవడం... భూమి హద్దులు తెలిపే చిత్రపటాలు లేకపోవడం... భూములకు సరిహద్దు రాళ్లు లేకపోవడం.... ఏ భూసమస్యను ఎంతకాలంలో పరిష్కరించాలో స్పష్టత లేకపోవడం.... చట్టాల్లో గందరగోళం... లెక్కకు మించిన నియమాలు, ఉత్తర్వులు... 40ఏళ్లకు ఒకసారి భూసర్వే జరగాల్సి ఉండగా, 80ఏళ్లయినా జరగని సర్వే.... అసంపూర్తిగా సీలింగ్, టెనెన్సీ, ఇనాం భూచట్టాల అమలు... వాస్తవ పరిస్థితిని అద్దంపట్టని భూరికార్డులు.... చట్టాలు, రూల్స్‌పై అవగాహన లేకపోవడం... జమాబందీ, ఆజమాయిషీ నిలిచిపోవడం.... ఇలా అనేక సమస్యలతో సివిల్ కోర్టుల్లో 66శాతం కేసులు భూతగాదాలే ఉంటున్నాయని రెవెన్యూ జేఏసీ అంటోంది. ప్రభుత్వం ఇప్పటికైనా భూపరిపాలనపై దృష్టిపెట్టకపోతే మున్ముందు మరిన్ని సమస్యలు తప్పవని రెవెన్యూ జేఏసీ హెచ్చరిస్తోంది.