వంశీ బాటలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు... బాబు టార్గెట్ గా జగన్ నయా వ్యూహం
posted on Nov 7, 2019 @ 11:03AM
ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా... ప్రత్యర్ధులను బలహీనపర్చాలనుకోవడం... ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎంపీలను, బలమైన నేతలను లాక్కుని.... ఆ పార్టీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనుకోవడం... రాజకీయాల్లో కామన్. పైకి నీతి నిజాయితీ విలువలు అంటూ ప్రజలను మభ్యపెట్టాలని చూసినా, ఏదోరకంగా అదే దారి ఎంచుకోక తప్పదు. ఎందుకంటే, పార్టీ ఫిరాయింపులు పెద్దపెద్ద మాటలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి.... అటుతిరిగి ఇటుతిరిగి చివరికి అక్కడికే రావాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా... 23మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు లాక్కోవడంతో... పార్టీ ఫిరాయింపులపై అలుపెరగని పోరాటం చేశారు. పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేసేవరకు అసెంబ్లీకి రానంటూ శపథంచేసి... చివరికి ముఖ్యమంత్రి హోదాలోనే అడుగుపెట్టారు. అయితే, చంద్రబాబులాగా తాను పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించనని, ఒకవేళ ఎవరైనా పార్టీలోకి వస్తానంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని, అలా కాకుండా ఎవరైనా పార్టీ మారితే అనర్హత వేటేయాలని అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ కు సూచించారు. అలా, జగన్ చేసిన ప్రకటనే ఇప్పుడు గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అడ్డంకిగా మారాయి.
జగన్ స్టేట్ మెంట్ ప్రకారం వల్లభనేని వంశీ వైసీపీలో చేరాలంటే ముందుగా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. అయితే, ఇక్కడే వైసీపీ కొత్త గేమ్ ప్లాన్ ను అమలు చేయబోతోందనే మాట వినిపిస్తోంది. వల్లభనేని వంశీ టీడీపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చంద్రబాబుకి వాట్సప్ లేఖ రాసినా, స్పీకర్ కి మాత్రం రిజైన్ లెటర్ పంపలేదు. అయితే, త్వరలోనే వంశీ... తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో చంద్రబాబుకు పంపనున్నారని తెలుస్తోంది. అలా వంశీ రిజైన్ లెటర్ ను టీడీపీ ద్వారానే స్పీకర్ కు పంపేలా చేసి... ఆ నెపాన్ని చంద్రబాబుపైనే నెట్టాలన్నది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు.
ఇక, వంశీ కథ ఇలా సాగుతుండగానే, మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు గోడ దూకడానికి సిద్ధమయ్యారనే ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఒకరు(మాజీ మంత్రి).... కోస్తాంధ్ర నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార వైసీపీతో టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురూ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న సమాచారంతో చంద్రబాబు ఇప్పటికే పిలిపించుకుని మాట్లాడారని అంటున్నారు. అయితే, మొత్తం ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించడం ద్వారా చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్నదే వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది.