పైన పటారం లోన లొటారంలా మారిన తెలంగాణ పరిషత్ ల పరిస్థితి...
posted on Nov 7, 2019 @ 4:31PM
పైన పటారం లోన లొటారంలా వుంది తెలంగాణాలో కొత్త జిల్లాల పరిస్థితి పరిపాలనా సౌలభ్యం పేరిట ఇబ్బడిముబ్బడిగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఉన్న పది జిల్లాలను ముప్పై మూడు జిల్లాలుగా విభజించింది. పలు జిల్లాల్లో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం కొనసాగుతోంది కొన్ని చోట్ల కూడా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రసుతానికైతే అరకొర భవనాలతో చాలీ చాలని వసతులతో ఆయా జిల్లాల కార్యాలయాలు పని చేస్తున్నాయి. ఇదంతా ఒకెత్తయితే కొత్తగా ఏర్పాటైన జిల్లా పరిషత్, మండల పరిషత్ ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కార్యాలయాల భవనాలు, ఫర్నీచర్, సిబ్బంది సర్దుబాటు వంటి అంశాల్లో గందరగోళం కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు కనీసం చాయ్ నీళ్ళకు పైసా లేని దుస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగి మూడేళ్ళు పూర్తయింది. కొత్త జిల్లా పరిషత్ లు కొత్త మండల పరిషత్తులు ఏర్పాటు జరిగి నెలలు దాటింది, నాలుగు నెలల క్రితం ఆయా జడ్పిలు మండలాల పరిధిలో ఎన్నికలు జరిగాయి. గెలిచిన ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతలు చేపట్టారు కానీ, గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించే మండల జిల్లా పరిషత్ లకు మాత్రం ఇంత వరకూ నిధుల కేటాయింపు జరగలేదు. కొత్తగా ఏర్పాటైన జడ్పీలు నిధులు లేక విలవిలలాడుతుంటే కొత్త మండలాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని అక్కడి నేతలు వాపోతున్నారు. పరిషత్ ల విభజన సమయంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం పాత జడ్పీ నుంచి కొత్త జిల్లా పరిషత్ లకు ఉద్యోగులను, ఫర్నీచర్ ను సిబ్బందిని కేటాయించారు. కొత్త మండలాల ఏర్పాటు సందర్భంగా కూడా ఇదే విధానం పాటించారు. అయితే కొన్ని మండలాల్లో సిబ్బంది మినహా ఇంకేమీ సర్దుబాటు చేయలేదట, కొత్త పరిషత్తులు ఏర్పాటు సమయంలో పాత జడ్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తించిన ఉద్యోగులను ప్రభుత్వం ఆయా జిల్లాలకు బదిలీ చేసింది.
బదిలీపై వెళ్లిన ఉద్యోగులకు ఇప్పటికీ పాత జడ్పీల నుంచే నెల నెలా జీతాలు చెల్లిస్తున్నారు. ఇక డైరెక్ట్ గా నియామకమైన అధికారులకు, సిబ్బందికి జీతాలకు కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడిందట. మండలాల పరిస్థితి కూడా ఇదే మాదిరిగా ఉందని స్థానికుల కథనం. ఉదాహరణకు ఆదిలాబాద్ జడ్పీ ఖాతాలో ప్రస్తుతం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధులు మండలాల ప్రాతిపదికన కొత్తగా ఏర్పాటైన నిర్మల్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కేటాయించాల్సి ఉంది. ఏ జిల్లాలో మండలాల సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ జిల్లాకు అధిక నిధులు కేటాయించాలి. ఈ లెక్కన ఒక్కో జిల్లాకు ఎనభై ఏడు లక్షల నుంచి తొంభై లక్షల రూపాయల వరకు వస్తాయి.
ప్రస్తుతమున్న నిధులు ఆయా జిల్లాలకు పంచాలంటే అందుకు చెక్ పవర్ ను ఉపయోగించాలి. డ్రా చేసిన నిధులను ఇతర జిల్లాలకు అప్పగించాలి కాని, ఆ పని ఇప్పటికీ జరగడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప పైసా కేటాయించలేని దుస్థితి నెలకొన్నది. దీంతో కొత్త జిల్లా పరిషత్తులు ఉత్సవ విగ్రహాల తీరుగా మారుతున్నాయి, నిధుల విషయమై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కార్యాలయాల నిర్వహణకే పైసలు లేనప్పుడు ఇక తాము అభివృద్ధి పనులెలా చేపట్టగలమని వారు ప్రశ్నిస్తున్నారు.
కొన్నాళ్ల క్రితం జరిగిన జిల్లా పరిషత్ ల సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రూపాయ్ లేని కొత్త జిల్లా పరిషత్ లు మండల పరిషత్తులు ఎందుకు అని ప్రతి రోజూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వేరే గత్యంతరం లేక కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు సొంత వనరులతో ఫర్నీచర్ సమకూర్చుకున్నారు. మరికొన్నిచోట్ల ప్రజా ప్రతినిధుల ఒత్తిడితో అధికారులు అప్పులు చేసి ఫర్నీచర్ కొన్నారు. ఇక రోజువారీ నిర్వహణ భారంగా మారడంతో కార్యాలయాలకు వెళ్లాలంటేనే ప్రజాప్రతినిధులు అధికారులు జంకుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించాలనే ఆయా నేతలు, అధికారులు కోరుతున్నారు, గులాబీ పార్టీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.