అసలు మీరేం అధికారులు? ఇవేం లెక్కలు?.. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఫైర్!!
posted on Nov 7, 2019 @ 2:21PM
ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఎటూ తేలకుండానే విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్టీసీ ఇంచార్జి ఎండీ సునీల్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణరావు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు సమర్పించిన నివేదికలపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐఏఎస్ స్థాయి అధికారులు ఇంత దారుణంగా నివేదిక ఇవ్వడం తన సర్వీస్‌లోనే చూడలేదని చీఫ్ జస్టిస్ అసహనం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల జడ్జి చరిత్రలో ఇంతగా అబద్ధాలు చెప్పే అధికారులను ఎక్కడా చూడలేదని చీఫ్ జస్టిస్ విరుచుకుపడ్డారు.
ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని.. తాము వేటిని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు.. పదాలు వాడారని హైకోర్టు పేర్కొంది. మంత్రికి సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని... ఆయనకు తప్పుడు లెక్కలు ఇస్తే ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని హైకోర్టు పేర్కొంది. కేబినెట్‌కి సైతం అధికారులు తప్పుడు లెక్కలు ఇచ్చారని.. సీఎంకి సైతం తప్పుడు లెక్కలతో స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమను తప్పుదోవ పట్టించిన ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీని మంత్రి ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదంటూ మండిపడింది.
జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ఆర్థిక శాఖలు... ఒక్కొక్కరు ఒక్కో పాట పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చెబుతున్నారని.. హైకోర్టుతో వ్యవహరించే తీరు ఇదేనా అని అధికారులను హైకోర్టు తీవ్ర స్థాయిలో మందలించింది. తాము సమస్యను పరిష్కరించాలని చూస్తుంటే.. ప్రభుత్వం, ఆర్టీసీ మాత్రం స్వచ్ఛందంగా ముందుకు రావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం పూర్తిగా లోపించిందని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. 5 నిమిషాలు తన స్ధానంలో ఉండి చూడాలని.. మీ నివిదేకలు, మీరు చెప్పే మాటలు అసలు నమ్మే విధంగా ఉన్నాయా? అంటూ అధికారులపై చీఫ్ జస్టిస్ మండిపడ్డారు. ప్రభుత్వం, కార్మికసంఘాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమస్య తాత్కాలిక పరిష్కారం కోసం ప్రభుత్వం 47 కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించింది. రూ.47 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం ఎందుకు ఇబ్బంది పెడుతోందని హైకోర్టు ప్రశ్నించింది.
అధికారుల తప్పుడు నివేదికల కారణంగా విచారణ మళ్లీ వాయిదా పడింది. మరి అధికారులు ఇకనైన సరైన నివేదికలు ఇస్తారో.. లేక ఇలానే తప్పుడు లెక్కలు చూపించి హైకోర్టు చేత చివాట్లు తింటారో చూడాలి. ఏది ఏమైనా.. ప్రజలు ఇంతలా ఇబ్బంది పడుతుంటే.. ఐఏఎస్ స్థాయి అధికారులు తప్పుడు లెక్కలు చూపిస్తూ కాలయాపన చేయడం దురదృష్టకరం. మరి హైకోర్టు ఈ సమస్యకు 11 వ తేదీన అయినా పరిష్కారం చూపుతుందేమో చూడాలి.