రంజాన్ మాసంలో ముస్లింలు సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలి 

* కంటికి కనిపించని శత్రువుతో అలుపెరగని యుద్ధం చేస్తున్న ప్రతీ భారతీయుడు ఒక సైనికుడే * మన్ కి బాత్ కార్యక్రమం లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.  పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజ్ఞప్తి చేశారు. 64 వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, మనం చేస్తున్న యుద్ధాన్ని ప్రపంచమంతా గమనిస్తోందన్నారు. భారత ప్రజల స్ఫూర్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.  కరోనా సృష్టించిన విలయాన్ని అధిగమించేందుకు అన్ని వర్గాలూ కొత్త మార్గాల గురించి అన్వేషిస్తున్నాయని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశంలోని ప్రతి ఒక్కళ్లూ లాక్‌డౌన్‌ను పాటిస్తున్నారని తెలిపారు.మన్ కీబాత్ కార్యక్రమంలో ప్రజలతో తన మనోభావాలను పంచుకున్నారు. విపత్తు సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ గారు అన్నారు.లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.ప్రజల సహకారం లేనిదే కరోనాను ఎదుర్కోవడంలో ఎవరూ విజయం సాధించలేరని అన్నారు. కరోనా మహమ్మారి కట్టడికి భారతీయులంతా కలిసి చేస్తున్న ఈ పోరాటాన్ని భావి తరాల ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ దేశాలన్నీ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నప్పటికీ.. భారత్ లో జరుగుతున్న విషయాలు చరిత్రలో నిలిచిపోతుందని, ప్రజలే సైనికులుగా మారి కరోనాపై యుద్ధం చేస్తున్న గొప్ప సందర్భం ఇక్కడ ఆవిష్కృతమైందని ప్రధాని అన్నారు. '' ప్రజలే ముందుండి నడిపిస్తున్న ఈ యుద్ధంలో.. పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం వాళ్లను అనుసరిస్తున్నారంతే..'' అని తెలిపారు. ''దేశం నుంచి పేదరికాన్ని తరిమేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలోనే కరోనా మహమ్మారి వచ్చిపడింది. వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మనకు.. లాక్ డౌన్ విధించడం తప్ప మనకు వేరే మార్గం లేనేలేదు. ఈ కష్టకాలంలో ప్రతి ఒక్కరూ సిపాయిలా మారి పోరాడుతున్నారు. ఈ 'పీపుల్ డ్రివెన్ వార్'పై ప్రపంచమంతటా చర్చ జరిగితీరుతుంది. గల్లీ నుంచి ఢిల్లీ ప్రజలు ఒక్కటయ్యారు. పేదలకు అన్నం పెట్టడం దగ్గర్నుంచి రేషన్ సరుకుల పంపకం దాకా అన్ని చోట్లా లాక్ డౌన్ పక్కాగా అమలవుతోంది. యావత్ దేశం ఒకే దశలో, ఒకే లక్ష్యంతో ముందుకు వెళుతున్న సందర్భమిది. చప్పట్లు, దీపకాంతులు మనకు స్ఫూర్తి, ప్రేరణ ఇస్తున్నాయని మోదీ గారు తెలిపారు. ప్రపంచ దేశాల పట్ల భారత్ మానవతా దృక్పథాన్ని ప్రదర్శించిందన్నారు.రోజువారీ ఆదాయంతో పూట గడిపే ఎంతో మంది పరిస్థితి దయనీయంగా మారిందన్న సంగతి తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకొంటామని చెప్పారు. కరోనా కట్టడి విషయంలో అన్ని రాష్ట్ర  ప్రభుత్వాలూ సమర్థవంతంగా పోరాడుతున్నాయని మోదీ కితాబిచ్చారు. పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా, సామాజిక దూరాన్ని పాటిస్తూ, ప్రార్థనలను ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు.స్వచ్ఛ భారత్‌, శౌచాలయాల నిర్మాణాల్లోనూ ప్రజలు సహకరించారని.. వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.కష్ట సమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కొంత మొత్తాన్ని త్యాగం చేశారని ప్రధాని మోదీ తెలిపారు.కరోనా వైరస్ విజృంభిస్తున్నప్పటికీ అన్నదాతలు పంటపొలాల్లో పనిచేస్తున్నారు.. దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో బాధపడొద్దనే గొప్ప మనసు మారిది. ఇంకొందరేమో కిరాయిలు మాఫీ చేస్తున్నారు, మరికొందరు తమ పెన్షన్ డబ్బుల్ని పీఎం కేర్స్ కు విరాళంగా ఇస్తున్నారు. కూరగాయల్ని పంచేవాళ్లు కోకొల్లలైతే.. మాస్కుల తయారు చేస్తున్నవాళ్లూ కోకొల్లలు ఉన్నారు.. ఓ స్కూల్ బిల్డింగ్ లో క్వారంటైన్ లో ఉన్న వలస కూలీలు.. ఆ బడికి రంగులు వేసి అద్భుతంగా తీర్చిదిద్దిన దృశ్యాన్ని మనందరం చూశాం. ఎలాగైనాసరే పొరుగువాళ్లకు సాయపడాలన్న మంచి తలంపు ఉందే.. కరోనాపై యుద్ధంలో ఇదే మన ఆయుధమని ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలిపారు.కష్ట సమయంలో ఎంతోమంది దాతలు పేదలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో కొంత మొత్తాన్ని త్యాగం చేశారని ప్రధాని మోదీ తెలిపారు.

తిరుమల లో ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని అనుకోలేదు

భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి నలభై ఐదు రోజులు అయిందనీ, ప్రతి నెలా వచ్చే ఆదాయం సుమారు రూ.150- రూ.175 కోట్లు కాగా, ప్రస్తుత పరిస్థితులతో ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని,  గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో రాలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  ‘కరోనా’, ‘లాక్ డౌన్’ నేపథ్యంలో భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి నలభై ఐదు రోజులు అయిందని అన్నారు. ప్రతి నెలా వచ్చే హుండీ ఆదాయం, సేవా కార్యక్రమాలు, కల్యాణోత్సవాలు, ప్రసాదాలు, రూమ్ రెంట్స్.. ఇలా వీటి ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.150 నుంచి రూ.175 కోట్ల వరకు ఉంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఆదాయ వనరులకు లోటు ఏర్పడిందని, రాబోయే కాలంలో ఎలా పూడ్చుకోవాలనే విషయమై ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయమై సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. రాబోయే కాలంలో టీటీడీ ఖర్చులు, వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగస్తులు, పాలక మండలి సభ్యులు సహకరిస్తారని ఆశించారు. పాలక మండలి సభ్యులు, చైర్మన్ గా తాను జీతాలు తీసుకోలేదని గుర్తుచేశారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం

* కోస్తాంధ్ర లో పిడుగులతో కూడిన వర్షాలు  ఆగ్నేయ బంగాళాఖాతంలో  మే మొదటివారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, కోస్తాంధ్ర లో పలుచోట్ల పిడుగులతో  కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-50 కీ.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలి. ప్రజలు అప్రమత్తంగా  ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. రాగల 48 గంటలు రాయలసీమలో 41°C -43°C అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉన్నందున పసిపిల్లలు, వృద్దులు జాగ్రత్తలు  తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు  సూచించారు.

కరోనా కేసులు దాచవద్దు: రాజీవ్ గౌబ 

కరోనా వైరస్ కేసులను దాచవద్దని, కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుండి కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. కట్టుదిట్టమైన చర్యలతో కరోనా నియంత్రణలో గణనీయమైన మార్పు కనపడుతోందని పేర్కొన్నారు. కరోనా వైరస్ కేసులను దాచవద్దని, కేసులు అధికంగా నమోదైనా ఆందోళన చెందవద్దని అన్నారు. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహించడం వంటి కారణాలు వల్ల ఎక్కువ కేసులు నమోదు అవుతాయని చెప్పారు. హాట్ స్పాట్ ప్రాంతాలు, కంటోన్మెంట్ జోన్ల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఇంతవరకూ కేసులు నమోదు కాకపోయినా ఇటీవల ఆయా జిల్లాల్లో కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఆయా జిల్లాల్లో కూడా లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సిఎస్ లను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు. ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,ఐజి వినీత్ బ్రిజ్లాల్,వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి వడగండ్ల వర్ష సూచన

విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడ మరియు ఇంటీరియర్  కర్ణాటక మీదుగా 0.9 km ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతున్న కారణంగా, తెలంగాణాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు  కురిసే అవకాశం ఉంది.ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి  అక్కడక్కడ ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో (గంటకు 30 నుండి 40 kmph) పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీ పెన్షనర్లకు హ్యాపీ న్యూస్ 

* పూర్తి పెన్షన్ చెల్లింపునకు ప్రభుత్వ నిర్ణయం  ఏప్రిల్ నెల జీతాల చెల్లింపుకు ఉత్తర్వులు జారీ చేస్తూ - ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ జి.ఓ. నెంబర్ 37 విడుదల చేసింది. పెన్షనర్లకు 100% పెన్షన్, మిగతా ఉద్యోగులకు గత నెల జారీ చేసిన ఉత్తర్వులు 26(50% & 90%) & 27 (100% అత్యవసర సేవలందిస్తున్న ఉద్యోగులకు) మేరకు జీతాలు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా వరుసగా రెండో నెల కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ స్థాయిలకు అనుగుణంగా జీతాల్లో కోతలు చేస్తూ నిర్ణయించింది. కరోనాపై పోరులో ఆర్థిక భారం ప్రభుత్వంపై పడటంతో ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించక తప్పడం లేదని ప్రభుత్వం అంటోంది.

సతీష్ చంద్రకే 'సౌత్ బ్లాక్' ఆశీస్సులు

* ఏపీ తదుపరి చీఫ్ సెక్రెటరీ దాదాపుగా ఆయనే  * నెలాఖరుకు రిటైర్ అవుతున్న ఎల్వీ సుబ్రహ్మణ్యం  * వచ్చే నెలాఖరుకు నీలం సాహ్నీ పదవీ విరమణ   ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ చంద్ర పేరు చీఫ్ సెక్రెటరీ పదవికి దాదాపుగా ఖరారైంది. ఉత్తరాదిలో సీనియర్ బ్యూరోక్రాట్లతో, ఢిల్లీ సౌత్ బ్లాక్ తో సన్నిహిత సంబంధాలున్న సతీష్ చంద్ర, అధికారం లో ఏ పార్టీ ఉన్నా సరే, చీఫ్ మినిష్టర్ కు దగ్గరగా ఉండడం గడిచిన పదేళ్లలో మనం చూస్తూ వస్తున్న విషయమే. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ‘నీలం సహానీ’ మే నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతుండడంతో, కొత్త సిఎస్‌గా  రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి అవకాశం ఇస్తుందనే దానిపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఐఎఎస్‌ అధికారుల్లో అందరికన్నా సీనియర్‌ ‘ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం’. ఆయన పదవీకాలం ఏప్రిల్ నెలాఖరుకు  ముగియనుంది. ‘నీలం సహానీ’ కన్నా ముందు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అయితే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డితో విభేదాలు రావడంతో ఆయనను పదవి నుంచి తప్పించి, బాపట్ల హెచ్ ఆర్ డీ కి డైరెక్టర్ జనరల్ గా నియమించారు. అప్పటి నుంచి ఆయన సెలవులో ఉన్నారు. ఆయన తరువాత సీనియర్లు అయిన ‘ప్రీతీసూడాన్‌,ఎ.పి.సహానీ, డాక్టర్‌ సమీర్‌శర్మ,ఆర్‌.సుబ్రహ్మణ్యం, అభయత్రిపాఠీలు కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. వీరిలో ఎవరూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిపై ఆసక్తి చూపిస్తున్నట్లు కనిపించడం లేదు. దీంతో తరువాత సీనియర్లుగా ఉన్న ‘సతీష్‌చంద్ర,జె.ఎస్సీ ప్రసాద్‌, నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, ఆదిత్యనాథ్‌దాస్‌’లు రేసులో ఉన్నారు. వీరిలో ఎవరికైనా ఈ పదవి దక్కుతుందా..? దక్కితే ఎవరికి దక్కుతుందనే దానిపై పలు రకాలైన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.  వీరందరిలోనూ  ‘సతీష్‌చంద్ర’ మాత్రమే  సీనియర్‌.  ఆయనకు, ఇంకా ఏడాది ఎనిమిది నెలల సర్వీసు ఉంది. ఆయనను కనుక ‘సిఎస్‌’గా నియమించుకుంటే దాదాపు రెండు సంవత్సరా పాటు ఆ పదవిలో కొనసాగుతారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఆయన ‘చంద్రబాబు’ కార్యాల‌యంలో పనిచేశారు. దానిని దృష్టిలో ఉంచుకునే ఇటీవల‌ వరకు ఆయనకు వైకాపా ప్రభుత్వం ఎటువంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. అయితే రెండు మాసాల‌ క్రితం ఆయనకు అత్యంత ప్రాధాన్యత కలిగిన విద్యాశాఖను అప్పగించి ప్రయారిటీ ఇచ్చింది. విద్యాశాఖను ప్రభుత్వం అప్పచెప్పిన తరువాత ‘సతీష్‌చంద్ర’ అధికారపార్టీ పెద్దల‌కు దగ్గరయ్యారని అంటున్నారు. గతంలో వారితో ఉన్న స్పర్థల‌ను ఆయన తొల‌గించుకున్నారని, దీంతో ఆయనను సిఎస్‌గా నియమిస్తారనే భావన అధికారవర్గాల్లో, మీడియా వర్గాల్లో నెల‌కొని ఉంది. ఎల్ వీ నిష్క్రమణ తర్వాత, ప్రభుత్వం లో తన ప్రాధాన్యాన్ని గణనీయంగా పెంచుకున్న సతీష్ చంద్ర, ఢిల్లీలోని సౌత్ బ్లాక్ లోని పెద్దల ద్వారా నడిపిస్తున్న బలమైన లాబీ కారణంగా ఆయన పేరే తదుపరి చీఫ్ సెక్రెటరీ గా ఖరారయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సచివాలయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

అనంతపురం లో ఏరో స్పేస్ డిఫెన్స్ పార్క్ 

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద మెస్సర్స్ ఏపీ ఏరో స్పేస్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ లిమిటెడ్ ఏర్పాటుకు 246 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీతో కలిసి ఏరో స్సేస్ , డిఫెన్స్ వాటర్ ఇన్నోవేషన్ ఎలక్ట్రానికి సిస్టమ్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల ప్రత్యేక వాహక సంస్థగా ఏపీ-ఏడీఈ ఏర్పాటు.కియామోటార్స్ ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో కాలుష్య కారక పరిశ్రమలను అనుమతించబోమన్న ప్రభుత్వ నిబంధనల నుంచి ఈ సంస్థకు కూడా మినహాయింపు  ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కియా మోటార్స్ ప్రాజెక్టు నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కియాకు చెందిన మరో అనుబంధ సంస్థ ఈ ప్రాజెక్టుకు అతి సమీపంలో ఉన్నందున ఈ మినహాయింపు ఇస్తూ ఆదేశాలు  జారీ చేసింది.

సోనియా పెళ్ళికి ముందు జీవితంమీద చర్చ అవసరమా!

ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు సోనియా గాంధీ పుట్టుకను జాతీయ సమస్యగా దేశం ముందుకు తెచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరించలేని చేతకానితనం నుండి ఇలాంటి సమస్యలు సృష్టించి, ప్రజల దృష్టిని మళ్ళించి పబ్బంగడిపేసుకుంటారు. ఆ ట్రాప్ లో పడితే వాళ్ళు విజయం సాధించినట్టే. అసలు సమస్య వదిలేసి కొసరు సమస్య జాతీయ సమస్య అవుతుంది. సోనియా ఎక్కడ పుట్టినా, ఆమెది ఏ మతం అయినా, ఏ పేరు అయినా, ఆమె ఈ దేశపు కోడలు. ఈ దేశ పౌరురాలు. ఇక్కడి ఆచారాల ప్రకారం పెళ్ళి తర్వాత అత్తవారింటికి రావడం, అవసరమైతే ఇంటిపేరుతో సహా మార్చుకోవడం మన సృప్రదాయం. అలా వచ్చిన కోడలిని ప్రశ్నించడం అంటే ఈదేశ ఆచారాల పట్ల, వివాహ వ్యవస్థ పట్ల వీళ్ళకు ఏమాత్రం గౌరవం ఉందో ఆలోచించాలి. కాసేపు సోనియా వ్యవహారం పక్కన పెట్టి మన ఇళ్ళల్లో పెళ్ళి తర్వాత అత్తవారింటికి వచ్చిన వారిని, మన ఇంట్లో నుండి పెళ్ళి తర్వాత అత్తవారింటికి వెళ్ళిన వారిని అడిగి చూడండి... ఇలాంటి ప్రస్థావనలు, ఆ ప్రస్థావనతో వివక్ష అంగీకరిస్తారేమో ! విధానపరంగా ప్రత్యర్ధిని ఎదుర్కోలేక, పాలనా పరంగా ప్రజల అవసరాలు తీర్చి వారిని సంతృప్తి పరచలేక మాత్రమే ఇలాంటి వివాదాలు సృష్టించి ప్రజల దృష్టిని మరలిస్తారు.సోనియా పెళ్ళికిముందు జీవితాన్ని తెరపైకి తెచ్చి వివాదం చేయడాన్ని-- పెళ్ళిపేరుతో మన ఇంటికి వచ్చిన అమ్మను, భార్యను, పెళ్ళిపేరుతో వేరే ఇంటికి వెళ్ళిన తోబుట్టువును అడగండి సమర్ధిస్తారేమో...

కోర్టు మెట్లు ఎక్కుతానంటున్న చెన్నై డాక్టర్ భార్య 

ఇటీవల చెన్నైలో సైమన్ హెర్క్యులస్ అనే డాక్టర్ కరోనాతో మృతి చెందడం తెలిసిందే. అతడి మృతదేహాన్ని అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య మరో డాక్టర్ ఖననం చేయాల్సి వచ్చింది. దీనిపై సైమన్ హెర్క్యులస్ అర్ధాంగి ఆనంది హెర్క్యులస్ తీవ్రస్థాయిలో స్పందించారు. అత్యుత్తమ సేవలు అందించిన తన భర్తకు ఆ స్థాయిలోనే అంతిమ సంస్కారాలు ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం ఎడప్పాడి పళనిస్వామికి విజ్ఞప్తి చేశారు. దీనిపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ స్పందించారు. కరోనాతో మృతి చెందిన డాక్టర్ అవశేషాలను ఇప్పుడు మళ్లీ వెలికితీయడం ఏమంత సురక్షితం కాదని స్పష్టం చేశారు. అయితే తాను ఈ విషయాన్ని వదిలిపెట్టనని, కోర్టుకైనా వెళతానని ఆనంది తెలిపారు. డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం మృతశరీరంలో వైరస్ జీవించేది మూడు గంటలేనని, దీని ప్రకారం  వేలంగాడు శ్మశానవాటికలో ఖననం చేసిన తన భర్త మృతదేహాన్ని వెలికి తీసి కీల్పాక్ శ్మశానవాటికలో గౌరవప్రదంగా ఖననం చేయాలని ఆనంది కోరారు.

కరోనా రక్షణ వ్యవస్థపై డబ్ల్యూహెచ్ఓ సందేహాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కరోనా వైరస్ వ్యాప్తిపై సభ్య దేశాలను హెచ్చరించింది. ఒకసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులకు మళ్లీ సోకదని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని, కరోనా తగ్గిన వ్యక్తుల్లో యాంటీబాడీలు పెంపొంది రెండో పర్యాయం ఇన్ఫెక్షన్ కు తగిన రక్షణ వ్యవస్థ ఏర్పడుతుందని చెప్పలేమని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు ఇమ్యూనిటీ పాస్ పోర్టులు, రిస్క్ ఫ్రీ సర్టిఫికెట్లు ఇవ్వడం వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారికి హెల్త్ పాస్ పోర్టులు ఇస్తున్నట్టు చిలీ పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ వ్యాఖ్యలు చేసింది. కరోనా నయమైన వ్యక్తుల్లో యాంటీబాడీలు ఏర్పడినా, అవి తాత్కాలికమేనని పలు అధ్యయనాలు కూడా పేర్కొన్నాయి. ఇలాంటి ఇమ్యూనిటీ నెలకు మించి ఉండదని, దాంతో మరోసారి వైరస్ బారిన పడేందుకు అవకాశాలు లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

ఆయనకి నెగిటివ్, కానీ ఆ ముగ్గురికీ మాత్రం పాజిటివ్

* శ్రీకాకుళం జిల్లాలో వింత ఘటన  *  ఒకే కుటుంబం లో 'కరోనా' వైచిత్రి ! ఇన్నాళ్లు ఒక్క కరోనా కేసు లేకుండా నెట్టుకొచ్చిన శ్రీకాకుళం జిల్లాలో ఒక్కసారే మూడు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఏపీలో నమోదైన 61 కొత్త కేసుల్లో మూడు శ్రీకాకుళం జిల్లాలోనివే. అయితే, ఈ మూడు కేసులు ఒకే ఇంట్లో నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన వ్యక్తి ఢిల్లీలో పనిచేసేవాడు. ఇటీవలే ఢిల్లీ నుంచి పాతపట్నం వచ్చాడు. జిల్లాలో అడుగుపెట్టిన సమయంలో పరీక్ష చేస్తే నెగెటివ్ రిపోర్టు వచ్చింది. తాజాగా పీసీఆర్ టెస్టు నిర్వహించగా, నెగిటివ్ గానే వచ్చింది కానీ, ఆశ్చర్యకరంగా అతడి కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ అని వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు.

కడప జిల్లాలో 55కు చేరిన కేసులు

* గుంటూరు జిల్లాలో ఎనిమిది మంది డిశ్చార్జ్  కడప జిల్లాలో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇవాళ మరో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నేడు నమోదైన నాలుగు కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 55కు చేరుకుంది. ఇవాళ్టి నాలుగు కేసుల్లో ప్రొద్దుటూరులో మూడు, ఎర్రగుంట్లలో ఒక కేసు నమోదైంది. కాగా ఇవాళ ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 4,820 శాంపిల్స్‌ను సేకరించి కరోనా టెస్ట్ చేయడం జరిగిందని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇదీ : రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 61 కేసులు పాజిటివ్గా నమోదయ్యాయి. రాష్ట్రంలోని నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1016. ఇప్పటి వరకూ 171 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 814 అని వైద్య ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో తెలిపింది. ఇదిలా ఉండగా, గుంటూరు జిల్లా ఎన్ ఆర్ ఐ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  వ్యక్తులకు  నిర్వహించిన పరీక్షలో  రెండు సార్లు  నెగిటివ్ రావడంతో ఆరుగురిని శనివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.  వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారు 3, మంగళగిరికి చెందిన ఒకరిని,  వేజండ్లకు చెందిన ఒకరిని, అచ్చంపేటకు చెందిన  ఒకరిని  ఎన్ ఆర్ ఐ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు.

సోషల్ మీడియా ని దుర్వినియోగం చేస్తే, దండన తప్పదు

లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌  కృతజ్ఞతలు తెలిపారు. శనివారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానిదే అని గౌతమ్‌సవాంగ్‌ కొనియాడారు. దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు పలికారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖలతో పోలీసుల వారు సమన్వయం చేసుకుంటున్నారని, పోలీసులకి పీపీఈ కిట్లకోసం 2.89 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. ఇక ఏపీకి విదేశాల నుంచి 28000 మంది, ఢిల్లీ జమాత్‌ నుంచి 1185 మంది వచ్చారని తెలిపారు. వారందరిని క్వారంటైన్‌లో ఉంచినట్లు చెప్పారు.

పాజిటివ్ ముస్లిం పేషెంట్లకు తెలంగాణ సర్కార్ స్పెషల్ మెనూ

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ నెల ప్రారంభమైంది. ఈ సందర్భంగా కరోనా పాజిటివ్ ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలకు వారి ఇళ్లలో తయారయ్యే వంటకాల మాదిరే ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ రోజు నుంచే ఈ మెనూ అమల్లోకి రానుంది. క్వారంటైన్లలో ఉండే ముస్లింలు తెల్లవారుజామున ఉపవాస దీక్షను ప్రారంభిస్తారు. ఈ సమయంలో షెహరిగా రొట్టెలు, దాల్, వెజ్ కర్రీ అందించనున్నారు. సాయంత్రం ఉపవాస దీక్ష అనంతరం ఇఫ్తార్ విందులో చికెన్ బిర్యానీ, వెజ్ బిర్యానీ, కిచిడీ, బగారా రైస్, దాల్చా అందిస్తారు. అల్పాహారంగా ఖర్జూరం పండ్లు, అరటి పండ్లు, ఇతర పండ్లను అందిస్తారు. రోజు విడిచి రోజు చికెన్ కర్రీ లేదా మటన్ కర్రీ అందిస్తారు. మరోవైపు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముస్లిమేతరులను మరొక గదిలోకి తరలించనున్నట్టు సమాచారం. ముస్లింలు నమాజ్ చేసుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఏపీ లో అత్యవసరమైతే పోలీస్‌ పాస్‌ తీసుకోండి

రాష్ట్ర ప్రజలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సూచన ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ–పాస్‌ల జారీకి చర్యలు జిల్లాల వారీగా పాస్‌ల కోసం వాట్సప్‌ నెంబర్లు, మెయిల్‌ ఐడీల వివరాలు విడుదల చేసిన డీజీపీ కార్యాలయం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలవుతున్న తరుణంలో ఎవరైనా అత్యవసర పనులపై ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేందుకు ఈ–పాస్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. తగిన కారణాలు, ఆధారాలు చూపించి ఈ–పాస్‌కు దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి డీజీపీ తెలిపిన వివరాలివీ. ► లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న దృష్ట్యా వైద్యం, స్వచ్ఛంద సేవ, ప్రభుత్వ విధులు, అత్యవసర సేవల కోసం వెళ్లే వారు ఇబ్బందులకు గురవుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. అలాంటి వారికి పోలీస్‌ శాఖ ద్వారా అత్యవసర రవాణా పాస్‌లను జారీ చేస్తాం. ► జిల్లా పరిధిలో వెళ్లాల్సి వస్తే.. ఆ జిల్లా ఎస్పీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలి. వేరే జిల్లాకు వెళ్లాల్సి వస్తే.. తమ జిల్లా ఎస్పీ ద్వారా ఆ వ్యక్తి వెళ్లాల్సిన జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ► వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి వస్తే.. సదరు వ్యక్తికి సంబంధించిన జిల్లా ఎస్పీ ద్వారా డీఐజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాలి. వివరాలన్నీ పరిశీలించి ఆయా రాష్ట్రాలను సంప్రదించిన అనంతరం డీఐజీ కార్యాలయం అనుమతి మంజూరు చేస్తుంది. ► పాస్‌ అవసరమైన వారు చిరునామా, ఆధార్, ప్రయాణించే వాహనం నంబర్, ప్రయాణికుల సంఖ్య, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారనే వివరాలు సమర్పించాలి. ► పాస్‌ కోసం జిల్లా ఎస్పీల వాట్సాప్, ఈ–మెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులను పరిశీలించాక వారి మొబైల్‌ నంబర్లకే పోలీసులు అనుమతులు పంపిస్తారు. ఈ–పాస్‌ తీసుకున్న వారు గుర్తింపు కార్డు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.  ALL UNIT OFFICERS WHATSAPP NUMBERS & Email id'S S.No Unit Name WHATSAPP  Mobile Number e-mail ID's 1 SRIKAKULAM   6309990933 dail100srikakulam@gmail.com 2 VIZIANAGARAM 9989207326 spofvzm@gmail.com 3 VISAKHAPATNAM RURAL 9440904229 vizagsp@gmail.com 4 VISAKHAPATNAM CITY 9493336633 cpvspc@gmail.com 5 EAST GODAVAI (KAKINADA) 9494933233 sp@eg.appolice.gov.in 6 RAJAHMUNDRY URBAN 9490760794 sp@rjyu.appolice.gov.in 7 WEST GODAVARI 8332959175 policecontrolroomeluruwg@gmail.com 8 KRISHNA (MACHILIPATNAM) 9182990135 sp@kri.appolice.gov.in 9 VIJAYAWADA CITY 7328909090 cp@vza.appolice.gov.in 10 GUNTUR RURAL 9440796184 Dail100gunturrural@gmail.com 11 GUNTUR URBAN 8688831568 guntururbansp@gmail.com 12 PRAKASHAM 9121102109 spongole@gmail.com 13 NELLORE 9440796383 nelloresp@gmail.com 14 CHITTOOR 9440900005 spchittoor@gmail.com 15 TIRUPATHI URBAN 9491074537 sptpturban@gmail.com 16 ANANTHAPURAM 9989819191 spatp1@gmail.com 17 KADAPA 9121100531 spkadapa2014@gmail.com 18 KURNOOL 7777877722 spkurnool.kur@gmail.com                                    అత్యవసర పనుల కోసం పాస్‌లు తీసుకోదలచినవారు తమ యొక్క వినతిపత్రాలను పైన ఇచ్చిన వాట్సప్‌ మొబైల్ నెంబర్లకు మరియు మెయిల్ ఐడీలకు మాత్రమే పంపగలరు. అంగీకరించిన అనుమతి పత్రాలు మీరిచ్చే మొబైల్ నెంబర్లకు/మెయిల్ కు అనుమతి పంపబడును. మీరు ప్రయాణించేటపుడు జిల్లాల యొక్క  వాట్సప్‌ నెంబర్ మరియు మెయిల్ ఐడీల నుంచి వచ్చిన అనుమతులు మాత్రమే అంగీకరించబడును. ఫార్వర్డ్‌ చేయబడిన అనుమతులు (పాసులు) అంగీకరించబడవు. మీరు ప్రయాణించేటప్పుడు మీతోపాటు మీయొక్క గుర్తింపు కార్డు (ఐడీ కార్డ్‌) తప్పనిసరిగా ఉంచుకోవాలని డీజీపీ కార్యాలయం పేర్కొంది.