తరగడానికే కాదు, కోనడానికి కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.....
posted on Nov 7, 2019 @ 3:11PM
కొనుగోలుదార్లకు అమ్మకందారులకు ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర రాక మార్కెట్ లో రైతు కన్నీరు పెట్టుకొంటున్నాడు. అటు కొనుగోలుదారులు మాత్రం కిలో ఉల్లికి యాభై నుంచి డెబ్బై రూపాయల పెట్టలేక అష్టకష్టాలూ పడుతున్నాడు. ఈ పరిస్థితి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రజల్నీ ఉలికిపాటుకు గురి చేస్తున్నాయి. రెండు నెలలుగా యాభై నుంచి డెబ్బై రూపాయల వరకు అమ్మిన కిలో ఉల్లి రెండు రోజులుగా కొన్ని చోట్ల 100 చేరింది.
సరుకు లభ్యత ఆగస్ట్ వరకు ఎక్కువగానే ఉన్నా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పడిపోవడంతో ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. దేశీయంగా ఉల్లి ఉత్పత్తి 30 నుంచి 40 శాతం మేర తగ్గడంతో ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ నెల చివరి వారానికి గానీ డిసెంబర్ మొదటి వారానికి గానీ పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం అవుతోంది. మెజారిటీ ఉల్లి పంట వాటా మహారాష్ట్ర నుంచి వస్తుంటే మిగిలిన సరుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తోంది. సాధారణంగా ప్రతి నెలా మార్కెట్ లోకి పది లక్షల నుంచి పదమూడు లక్షల టన్నుల వరకు సరుకు వస్తూంటుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో మాత్రం దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల టన్నుల వరకు పడిపోయింది. దీంతో ఉల్లి ధర కిలో యాభై నుంచి వంద రూపాయల వరకూ పెరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం జనవరిలో హోల్ సేల్ మార్కెట్ లో క్వింటాలుకి వెయ్యి, మూడు వందల డెబ్బై ఐదు పలికిన ఉల్లి ధర అక్టోబర్ నాటికి 3,433 కు చేరి నూట నలభై తొమ్మిది శాతం పెరిగిందని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. ఈ ధరలను అదుపు చేయడానికి ఈజిప్ట్, నెదర్లాండ్స్ దేశాల నుంచి 2,500 మెట్రిక్ టన్నుల సరుకు దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్టాక్ ని త్వరగా తీసుకురావాలన్న ఉద్దేశంతో కస్టమ్స్ అనుమతులు తనిఖీల్లో మినహాయింపు నిచ్చింది. మరో 3000 మెట్రిక్ టన్నుల ఉల్లిని తీసుకు వస్తూ 100 కంటెయినర్లూ సముద్ర మార్గంలో ఉన్నాయి.
ఆఫ్ఘనిస్థాన్, టర్కీ, ఇరాన్ ల నుంచి కూడా సరుకు వచ్చేలా ఆయా దేశాల రాయబారులను కోరింది. పాకిస్థాన్ కల్పించే అడ్డంకుల కారణంగా ఆఫ్ఘనిస్థాన్ నుంచి సరుకు రాకపోయినా మిగతా దేశాల నుంచి సాధ్యమైనంత త్వరగా వస్తుందని అంచనా వేస్తోంది. ప్రతి నెలా దాదాపు లక్షా యాభైవేల లక్షల టన్నుల మేర జరిగే ఉల్లి ఎగుమతుల్ని రెండు నెలలుగా నిషేధించినందున ఆ మేరకు సరుకు లభ్యత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తోంది ప్రభుత్వం.మరి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి సామాన్యుడికి ధరలు అందుబాటులో ఉంటాయో లేదో.