విజయారెడ్డి హత్యతో పలుచోట్ల వెలుగులోకి వస్తున్న తహసీల్దార్ల నిర్లక్ష్యాలు...
posted on Nov 7, 2019 @ 1:26PM
విజయారెడ్డి హత్యోదంతం తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు హాట్ టాపిక్ గా మారిపోయాయి. రిజిస్ట్రేషన్లు పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారని బాధితులు వినూత్న నిరసనలకు దిగుతున్నారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యమంటూ రెవెన్యూ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతున్నారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలో కుర్వపల్లి కోట మండల రెవెన్యూ కార్యాలయంలో ఒక వ్యక్తి ధర్నాకు దిగారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. మట్లివారిపల్లె మాజీ సర్పంచ్ రైతు రుద్ర బాలకృష్ణారెడ్డి తన భూమిని రికార్డుల్లోకి ఎక్కించడం లేదంటూ ధర్నాకు దిగారు. ఆరు నెలల నుంచి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపించాడు. తహసీల్దార్ కార్యాలయంలో పడుకొని వినూత్న నిరసనకు దిగారు. తహసీల్దార్ తనకు ఉన్న భూమిని ఆన్ లైన్ లో తొలగించారని కనుక్కొని నమోదు చేయమంటే ఆరు నెలలుగా వేధిస్తున్నారని రైతు బాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సమస్య పరిష్కరించండి అంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని రైతు ఆరోపిస్తున్నాడు.
ఇటు చిత్తూరు జిల్లాలోని మరో బాధిత రైతు రెవెన్యూ ఆఫీస్ లోని వినూత్న నిరసనకు దిగాడు. కృష్ణానాయక్ అనే రైతు తాను కొన్న పొలానికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని మంజూరు చేయడంలో తహసీల్దార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని రైతు ఆరోపిస్తున్నాడు. కొన్న పొలంలో సాగు చేసుకుందామనుకున్న వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామంటూ మెడకు ఉరితాళ్లు వేసుకొని ఆందోళన నిర్వహించారు. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యనే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటు శ్రీకాకుళం జిల్లా నర్సంపేట రెవెన్యూ మండలం సత్యం రూళ్ల గ్రామం కూడా ఒక రైతు పెట్రోల్ బాటిల్ తో నిరసన వ్యక్తం చేశాడు. 2017 లో తాను కొంత భూమిని కొన్నానని దానికి పాస్ బుక్కు కూడా వచ్చిందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం పాస్ బుక్ లో ఉన్న వివరాలకు ఆన్ లైన్ లో ఉన్న వివరాలకు అసలు పొంతనే కుదరకపోవటంతో తనకు రైతు భరోసా అందట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సరిచేయమని తహసీల్దార్ ని అడిగితే అసలు తనకు భూమి లేదని చెప్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అందుకే విసుగు చెంది గ్రామంలో జరిగిన రైతు భరోసా సభలో పంచాయతీ కార్యదర్శి సుమలతపై పెట్రోల్ చల్లి నిరసన తెలిపానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనిపై ప్రభుత్వం ఇప్పటికైన తగిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర నష్టాన్ని ఎదురుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.