హైకోర్టులో నిమ్మగడ్డ రిప్లై పిటీషన్ దాఖలు 

ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలన్నీ ఎన్నికల సంఘం సెక్రటరీకి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ సి ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.  ఈసీ కౌంటర్ రిప్లై పిటిషన్ లో నిమ్మగడ్డ తెలిపిన కీలకవిషయాలు వెల్లడించారు.  సెక్రటరీ విధులు కేవలం కమిషనర్ రోజు వారీ పనుల్లో సాయం చేయటానికి మాత్రమే పరిమితమని, ఎన్నికల వాయిదా నిర్ణయం అత్యంత గోప్యతగా తీసుకోవాల్సిన  నిర్ణయమని ఆయన వివరించారు. ఎన్నికల సంఘంలోని న్యాయ విభాగం ఎన్నికల వాయిదా నోటిఫికేషన్ డ్రాఫ్ట్ తయారు చేసిన తర్వాత నే తాను సంతకం చేసినట్టు చెప్పారు. ఎన్నికల వాయిదా నిర్ణయం ప్రకటిస్తూ నిర్వహించిన మీడియా సమావేశం ఒకరోజు ముందుగానే నిర్ణయించింది. ఎన్నికల కమిషనర్ కి తన విచక్షణ అధికరంతో వాయిదా వేసే అధికారం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలు అన్నింటినీ ఎన్నికల సంఘంలో ఉన్న ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదు, అనే మూడు అంశాలను రమేష్ కుమార్ రిప్లై పిటీషన్ లో పేర్కొన్నారు.

పొగ‌రాయుళ్ల‌కే 'పొగ' పెడుతున్న వ్యాపారులు

* ఆంధ్ర లో 150 శాతం పెరిగిన సిగరెట్ ఉత్పత్తుల ధరలు  * వాణిజ్య పన్నుల శాఖ ఉదాసీనతపై భగ్గుమంటున్న సిగరెట్ గిరీశాలు! ఓ పక్క కరోనా దెబ్బకి అన్ని వస్తువుల వినిమయం పెరుగుతుంటే, మరో పక్క విజయవాడ లో మాత్రం సిగరెట్ తాగే గిరీశాలకు స్థానిక వ్యాపారాలు మాత్రం చుక్కలు చూపెడుతున్నారు. పొగాకు ఉత్ప‌త్తులు నిత్యావ‌స‌ర వ‌స్తువులు కాక‌పోవ‌డంతో ప్ర‌భుత్వ అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం తో , పొగాకు ఉత్పత్తుల నిల్వలు భారీగా పెరిగిపోయాయి.  ఇత‌ర ప్రాంతాల నుంచి ర‌వాణా వాహ‌నాల నిషేదం కార‌ణాన్ని చూపుతు వ్యాపారుల బ్లాక్ మార్కెటింగ్‌ మొదలెట్టారు. 150 శాతానికిపైగా ధరలు పెంచేసి, దోచేసుకుంటున్నారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు పెంచితే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న అధికారులు ఈ విష‌యంలో మాత్రం వ్యాపారుల‌కు కొమ్ము కాస్తున్నార‌ని పొగబాబులు ఆక్షేపిస్తున్నారు.  క‌రోనా వ్యాపిస్తున్న నేప‌ధ్యంలో నిరోధించేందుకు అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్ ప‌రిస్థితుల్లో కొంద‌రు వ్యాపారుల పంట పండింది‌. ఈ లాభాల్లో ఎక్కువ భాగం ప్ర‌భుత్వ అధికారుల‌కే పోతోందని వ్యాపారులు బ‌హిరంగంగానే చెబుతుండ‌టం గ‌మ‌నార్హం.  పొగాకు ఉత్పత్తుల రవాణా ఆగిపోవడంతో గోడౌన్లలో ఉన్న సరుకు ధర అమాంతం పెరిగిపోయింది. సాధారణంగా ఉండే 2 శాతం మార్జిన్ 20 శాతానికి పెరిగింది. పొగాకు ఉత్పత్తులు నిత్యావసరాలు కాకపోవడంతో వాణిజ్య శాఖ అధికారులు వీరిపై ఎటువంటి దాడులు నిర్వహించరు. వాస్తవంగా ఈ బ్లాక్ మార్కెట్ ను నిరోధించేందుకు ఈ శాఖ అధికారులకు అవకాశం ఉంది. కానీ వ్యాపారులు ఇస్తున్న ముడుపుల కు ఈ అధికారులు లొంగి పోయారని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం కూడా వ్యాపారుల వ్యవహార శైలి కూడా ఓ ప్రధాన కారణం. ధరలు పెంచి అమ్ముతున్న పొగాకు ఉత్పత్తులపై వినియోగదారులు వ్యాపారులతో వాగ్వాదానికి దిగిన సమయంలో వారే ప్రభుత్వ అధికారులకు ముడుపులు ఇచ్చినట్లు చెప్పుకొస్తున్నారు. సాధారణంగా పొగతాగే అలవాటు ఉన్నవారు దానిని మానుకోలేరు. ఒకవేళ మానేందుకు ప్రయత్నిస్తే మానసిక రోగిగా తయారవుతారు. ఈ బలహీనత అడ్డం పెట్టుకొని వ్యాపారులు చేస్తున్న అక్రమాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని పొగాకు ఉత్పత్తుల వినియోగదారులు కోరుకుంటున్నారు.

నిరాడంబరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు!

  టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ జెండా ఎగురవేశారు. తెలంగాణ భవన్‌లో టీఆరెఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. తెలంగాణ తల్లి విగ్రహానికి పులా మాల వేసి, పార్టీ జెండాను ఆవిష్కరించారు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా నేపథ్యంలో కొద్ది మంది నేతలకు మాత్రమే తెలంగాణ భవన్‌లోకి అనుమతించారు. ఈ కార్యక్రమానికి కేకే, మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఈటెల రాజేందర్, మేయర్, డిప్యూటీ మేయర్, చిప్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, విప్ సుమన్, విప్ కర్నె ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. కరోనా వైరస్ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈసారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికివారు తమ ప్రాంతాల్లోనే అంత్యంత నిరాడంబరంగా పతాకావిష్కరణ చేయాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

ఏపీలో గద్వాల్ మోడల్ అమ‌లు చేస్తారా?

  కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా వ‌స్తునే వున్నాయి. మందు లేని కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే కఠినమైన విధానాల్ని అమలు చేయటానికి మినహా మరో మార్గం లేదు. తెలంగాణలో కరోనా వ్యాప్తిని అడ్డుకోవటం కోసం వినూత్న విధానాన్ని అమలు చేశారు. వైరస్ కు పుట్టిల్లు అయిన వూహాన్ లో అక్కడి అధికారులు అమలు చేసిన విధానాల్ని గద్వాల్ లోనూ చేపట్టారు. దీని కారణంగా వైరస్ వ్యాప్తి కంట్రోల్ కి వచ్చింది. ఇంతకీ ఈ విధానాన్ని ఎలా అమ‌లు చేస్తారు? గద్వాల్ పట్టణం లోని పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్లుగా ఏర్పాటు చేయటం.. రహదారుల్ని మూసి వేయటంతో పాటు.. ప్రతి ఇంటికి అధికారులు తాళాలు వేసేస్తారు.దీంతో.. ఇంట్లోని వారుఇంట్లోనే ఉండిపోవాలే తప్పించి..కనీసం బయటకు కూడా వచ్చే వీలుండదు. దీంతో.. ప్రమాదకర వైరస్ వ్యాప్తి ఎక్కడికక్కడ.. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోనే ఆగిపోతుంది. కరోనా ఆంక్షలు ఉన్నప్పటికి చాలాచోట్ల ఒక ఇంట్లో వారు మరో ఇంట్లోకి రాకపోకలు సాగించటం తెలిసిందే. ఇందుకు భిన్నంగా ఎవరింట్లో వారిని లాక్ చేసే పద్దతి గద్వాల్ లోని కంటైన్ మెంట్ ప్రాంతాల్లో విజయవంతంగా అమలు చేశారు. సరిగ్గా ఇదే విధానాన్ని ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో గద్వాల్ మోడల్ ను అమలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు అధికారులు. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు, క్రిష్ణా, నెల్లూరు జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కవ ఎక్కువగా వున్న నేప‌థ్యంలో ఆ ప్రాంతాల్ని పూర్తిగా మూసివేయటమే కాదు. ఇళ్లకు తాళాలు వేసేయాలి. అయితే.. ఇలా ఇళ్లకు తాళాలు వేసిన ప్రాంతాల ప్రజలకు అవసరమైన అన్ని రకాల నిత్యవసరాల్ని.. ఇతర వస్తువుల్ని అధికారులే ఇంటికి తెచ్చి ఇస్తున్నారు.

విలయతాండవం చేస్తున్న క‌రోనా వైర‌స్‌!

కరోనా వైరస్ విజృంభణ ఆగడం లేదు. కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. సోమవారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 27 వేల మార్క్‌ని దాటేసింది. తాజా వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా.. 27,892 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 872 మంది కరోనాతో మరణించారు. ఇక 6,185 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం 19,868 యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో కిరాణా దుకాణాలు తెరుచుకుంటున్నాయి. మెల్లగా మళ్లీ వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమవుతున్నాయి. ఆరెంజ్ జోన్లలో ఆంక్షలను చాలా వరకూ సడలించారు. అయితే హాట్‌ స్పాట్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం 10 గంటలకు 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఇప్పటివరకూ 3 సార్లు ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే ఈసారి ఏం డెసిషన్ తీసుకోబోతున్నారా అని దేశమంతా ఎదురు చూస్తోంది. కరోనా వైరస్ ప్రభావం ఏపీలో రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారించారు అధికారులు. చీఫ్ సెక్యురిటి ఆఫీసర్, వైద్య సహాయకుడు, పని మనిషి, హౌస్ కీపింగ్ సిబ్బందికి కరోనా నిర్దారణ జరిగింది. దీనితో అప్రమత్తమైన అధికార యంత్రాంగం గవర్నర్ కి సైతం వైద్య పరీక్షలు నిర్వహించింది. విజయవాడలో ఆదివారం మొత్తం సుమారు 30 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణలో కొత్తగా మరో 11 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1001కి చేరింది. దేశంలో కరోనా కేసుల్లో వెయ్యి మార్క్ దాటిన 9వ రాష్ట్రం తెలంగాణ కావడం గమనార్హం. తాజాగా నమోదైన కొత్త కేసులన్నీ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దాదాపు 30 లక్షల మందికి సోకింది. ఇక అమెరికాలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఆందోళన కలిగించే అంశం. మొత్తం మరణాల సంఖ్య 206894కి చేరింది. ప్రతీ రోజు కూడా 5 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మరణాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

బార్బర్ షాపుకు వెళ్ళి క‌రోనాతో వచ్చాడు!

బార్బర్ షాపులకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. అయితే కటింగ్ చేయించుకోవడానికి వెళ్లే ముందు ఒక సారి ఆలోచించుకొని వెళ్ళండి. ఎందుకంటే ఒకే టవల్ వాడి 12 మందికి కటింగ్ చేశాడట‌. అయితే అందులో ఆరుగురికి పాజిటివ్ తేలింది. మధ్యప్రదేశ్ లోని ఖర్ గావ్ జిల్లాలోని బార్ గావ్ గ్రామంలో ఓ వ్యక్తి బార్బర్ షాప్ కు వెళ్లి కటింగ్,షేవింగ్ చేయించుకున్నాడు. అతనికి వాడిన టవల్ తోనే మరో 12 మందికి కటింగ్ షేవింగ్ చేశాడు. అయితే, మొదట కటింగ్ చేయించుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతని గురించి ఆరాతీయగా, బార్బర్ షాప్ కు వెళ్లిన విషయం చెప్పాడు. కటింగ్ షాప్ లో కటింగ్ చేయించుకున్న 12 మందికి టెస్టులు చేస్తే అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. ఈ 12 మందికి ఒకే టవల్ ను ఉపయోగించి కటింగ్ చేసినట్టు బార్బర్ షాప్ అతను చెప్పాడు. గ్రామంలో ఆరుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆ గ్రామాన్ని రెడ్ జోన్ గా ప్రకటించి సరిహద్దులు మూసేశారు. ఇంటి నుంచి ఎవర్ని బయటకు రాకుండా పోలీసులు పహారా కాస్తున్నారు. క‌రోనా వ్యాప్తికి కీల‌క పాత్ర పోషించిన వ్య‌క్తి అదే... కటింగ్ చేసిన వ్యక్తికి మాత్రం కరోనా నెగెటివ్ వ‌చ్చింది. ఈ విష‌యాన్నే గ్రామ‌స్థులు వింత‌గా చెప్పుకుంటున్నార‌ట‌. ఒకరు వాడిన వస్తువులు మరొకరు వాడితే ఎలా వుంటోందో క‌టింగ్ షాప్ అద్దం ప‌డుతోంది.

రోడ్డుపై గోడ నిర్మాణం! ఏపీ-చెన్నై సరిహద్దు వ‌ద్ద ఉద్రిక్త‌త‌!

లాక్‌డౌన్ సంద‌ర్భంగాఏపీ, చెన్నై ఆయా రాష్ట్రాలు.. సరిహద్దులను మూసివేశాయి. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న సూచనలతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. అయితే, తమిళనాడు అధికారులు చేసిన పని ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. కరోనా కట్టడికి ఏపీ సరిహద్దుల దగ్గర గోడలను నిర్మించారు అధికారులు. చిత్తూరు జిల్లాలోని మూడు సరిహద్దు ప్రాంతాల్లో వేళూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గోడను నిర్మించారు. పలమనేరు సమీపంలోని గుడియత్తాం వెళ్లే రహదారి, తిరుత్తణి మార్గంలోని శెట్టింతంగాళ్ తో పాటు బొమ్మ సముద్రం నుంచి తమిళనాడు వెళ్లే మార్గాలకు అడ్డంగా గోడలను నిర్మించారు. ఈ గోడల నిర్మాణంపై చిత్తూరు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు స్థానికులు. కలెక్టర్ ఆదేశాలతో రోడ్డకు అడ్డంగా 6 అడుగుల మేర రాత్రికి రాత్రే గోడలను కట్టివేశారు త‌మిళ తంబీలు. అయితే ఇలా గోడలు కట్టడం ఏంటి? అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్డు బంద్ కావ‌డంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అదే విధంగా, అత్యవసర సేవలు, నిత్యవసర సరకుల రవాణా కూడా లేకుండా పోయింది.

వైరస్‌ ఎలా సోకింది? తేలని లింకులు!

జిహెచ్ ఎంసి ప‌రిధిలోని నేరేడ్‌మెట్‌, హెచ్‌బీకాలనీ, అమీర్‌పేట, యాచారం, నల్లకుంట ప్రాంతాల్లో క‌రోనా ఎలా పాకింది. దీనికి సంబంధించిన లింకులు ఇంకా అంతు ప‌ట్ట‌లేదు. తాజాగా కేసుల లింకులు గుర్తించేందుకు అధికారులు, వివిధ శాఖల సిబ్బంది శ్రమిస్తున్నారు. కొన్ని కేసుల్లో వైరస్‌ ఎలా సోకిందో అర్థం కావడం లేదు. మరోవైపు ఆదివారం ఛాతీ ఆసుపత్రిలో 9 మంది, ఫీవరాసుపత్రిలో ఇద్దరు అనుమానిత లక్షణాలతో చేరారు. గ్రేటర్‌ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కాస్త తగ్గినట్లు కనిపించినా.. కొత్తగా నమోదవుతున్న కేసుల విషయంలో లింకులు తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓల్డ్‌ నేరేడ్‌మెట్‌లో ఓ వ్యక్తి(32)కి ఆదివారం కరోనా పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అతని కుటుంబంలోని తల్లి, భార్య, కుమారుడు(19నెలలు), ఒక అక్క..మొత్తం ఆరుగురిని హోం క్వారంటైన్‌ చేశారు. కూకట్‌పల్లిలోని ఓ సంస్థలో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న వ్యక్తి జలుబు, దగ్గుతో 24న కింగ్‌ కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇంటికే పరిమితమైన అతనికి వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీస్తున్నారు. మీర్‌పేట్‌ హౌసింగ్‌బోర్డు కాలనీ డివిజన్‌ పరిధిలోని వ్యక్తి(46) మృతి చెందగా ఆ కుటుంబంలోని అయిదుగురికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో ఏడాది చిన్నారి కూడా ఉన్నాడు. వైరస్‌ ఎలా సోకిందని అధికారులు ఆరా తీస్తున్నారు. హైద‌రాబాద్ ప‌రిధిలో ఆదివారం కొత్త‌గా 11 కేసులు నిర్ధారణ అయ్యాయి. జిహెచ్ ఎంసి ప‌రిధిలో మొత్తం 691 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇందులో 151 డిశ్ఛార్జి అయ్యారు. 18 మంది మృతువాత ప‌డ్డారు.

కరోనాను జయించి అధికారిక విధుల్లో బోరిస్!

కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్ తిరిగి విధులకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి కార్యాలయ్యానికి వచ్చారు. ఆసుపత్రి నుంచి డాశ్చార్జి అయిన రెండు వారాల తర్వాత తిరిగి తన అధికారిక విధుల్లో బోరిస్ పాల్గొన్నారు. కరోనా లక్షణాలు ఉండటంతో మార్చి 26 నుంచి స్వీయనిర్భంధంలోనే ఉన్న ఆయన ఇంటి నుంచే పనులు కొనసాగించారు. అయితే ఆరోగ్యం క్షీణించడంతో లండన్‌లోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందారు. మూడు రోజులపాటు ఐసీయూలోనే ఉన్నారు. ఏప్రిల్ 12న పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రధాని బోరిస్ నేరుగా రంగంలోకి దిగి ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు యూకే అధికారిక వర్గాలు వెల్లడించాయి. లండన్ పర్యావరణ కార్యదర్శి జార్జ్ యూస్టిస్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రస్తుతం కరోనా మరణాల రేటు తగ్గుతుందని, రాబోయే రోజుల్లో దీని సంఖ్య మరింత తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేసేందుకు సామాజిక దూరం పాటించాలని అదే మన ప్రాణాలను నిలబెడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 1,52,000 కు పైగానే కోవిడ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ ధాటికి దాదాపు 20,732 మంది ప్రాణాలు కోల్పోయారు.

సుర‌క్షితంగా త‌ల్లితో పాటు బ‌య‌ట‌ప‌డిన చిన్నారి!

పాజిటివ్ రాక‌పోయినా ఆ చిన్నారి త‌ల్లితో పాటు ఉండాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. తల్లి, పెద్దమ్మకు కరోనా పాజిటివ్‌ రావడంతో 18 రోజుల పాటు ఐసోలేషన్‌ గదిలో ఉండాల్సి వచ్చింది ఆ చిన్నారికి. వైద్యులు తీసుకున్న జాగ్రత్తలతో పాటు శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి కారణంగా ఆ చిన్నారిని కరోనా వైరస్‌ ఏమీ చేయలేకపోయింది. చిత్తూర్ జిల్లా నగరికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ మత ప్రార్థనాలకు వెళ్లి వచ్చాడు. అధికారులు అతన్ని పరీక్షించగా పాజిటివ్‌ వచ్చింది. ఏప్రిల్‌ 5న తిరుపతిలోని కోవిడ్‌-19 ఆస్పత్రికి పంపించారు. వారిది ఉమ్మడి కుటుంబం కావడంతో ఏప్రిల్‌ 6వ తేదీన 20 మంది సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఏప్రిల్‌ 7న అక్కడి వారిని పరీక్షించగా ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ వచ్చింది. వారిని ఏప్రిల్‌ 8న చిత్తూరు కోవిడ్‌ ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకామెకు ఏడాదిన్నర వయస్సు బాబు ఉన్నాడు. కుటుంబ సభ్యులంతా క్వారంటైన్‌లో ఉండడంతో చిన్నారి సంరక్షణ బాధ్యతలు చూసేందుకు బంధువులు ముందుకు రాలేదు. సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బందికి బాబు సంరక్షణ బాధ్యతలు అప్పగిద్దామంటే ఆమె ఒప్పుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి, పెద్దమ్మతో పాటు ఆ బాలుడు 18 రోజులు ఐసోలేషన్‌లో ఉన్నాడు. బాలుడి సంరక్షణ కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారికి న్యూట్రీషియన్‌ బిస్కెట్లు ఇవ్వడం, బయటి నుంచి ఆవుపాలు తెచ్చివ్వడం వంటివి చేశారు. ఐసోలేష‌న్‌లో చేరిన మొదటి రోజు ఒకసారి, డిశ్చార్జి అయ్యే నాలుగు రోజుల ముందు పరీక్షలు చేయగా బాలుడికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. చిన్నారి ముందు కరోనా త‌ల‌వంచింది. పూర్తిగా కోలుకోవ‌డంతో వీరిని ఏప్రిల్‌ 25న చిత్తూరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. వీరు 14 రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉంటారు.

రంజాన్ నేప‌థ్యంలో లాక్ డౌన్ పొడిగింపునకే కేసీఆర్ మొగ్గు!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటగా, 316 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మరణించారు. ఆదివారం నాడు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో మే 7 తరువాత, మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రధానితో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది. హైద‌రాబాద్ జిహెచ్ ఎంసి ప‌రిధిలో కేసుల సంఖ్య అధికంగా ఉన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్ నగరంపై మరింత దృష్టిని సారించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని సూచించారు.

అవమానాల మధ్య వైసీపీ ఎమ్మెల్యే అప్పలరాజు కరోనా పరీక్ష..

వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ సీదిరి అప్పలరాజు పేరు మీకు గుర్తుండే ఉంటుంది. అప్పట్లో పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం బస్తాను ప్రచారం కోసం వాలంటీర్ల చేతుల మీదుగా అందుకుని ఫొటోలు దిగిన శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే ఈయన. తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మన ప్రభుత్వమే ఉంది ఎవరేమనుకుంటారని భావించారో ఏమో అప్పలరాజు నిబంధనలు ఉల్లంఘించి ఎంచక్కా విజయవాడ వెళ్లి కొద్ది రోజుల తర్వాత సొంత నియోజకవర్గానికి తిరిగొచ్చారు. లాక్ డౌన్ కొనసాగుతుండగా ఇతర రాష్ట్రాలకు చెందిన మన జనాన్ని రాష్ట్రంలోకి అనుమతించకుండా క్వారంటైన్ కు పంపుతామని బెదిరిస్తున్న వైసీపీ సర్కారు.. ఈయన్ను మాత్రం ఏమీ అడగలేదు. విజయవాడ వెళ్లొచ్చిన పోలీసులు కానీ జిల్లా అధికారులు కానీ ఎలాంటి ఆటంకాలు చెప్పకుండా పలాసకు పంపించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కరోనా వ్యాప్తిస్తున్న వేళ వైరస్ ప్రభావం లేని తమ జిల్లాలోకి ఎంటరైన ఈయన గారిని సొంత నియోజకవర్గంలోని విపక్ష నేతలు, అధికారులు, స్ధానిక ప్రజలు సైతం నిలదీయడం మొదలుపెట్టారు. మమ్మల్ని కరోనా పేరుతో ఇళ్లకే పరిమితం చేస్తున్న మీరు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి విజయవాడ ఎలా వెళ్లొచ్చారని ఎమ్మెల్యే అప్పలరాజును ప్రశ్నించడం మొదలుపెట్టారు. అధికారిక కార్యక్రమాలకు వెళుతున్న సమయంలోనూ అవమానాలు, ప్రశ్నలు తప్పలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి జనంలో రోజురోజుకూ పలుచన కావాల్సిన పరిస్ధితి ఎదురైంది.  చివరకు ఏడాది క్రితం తనకు ఓట్లేసిన సొంత నియోజకవర్గం ఓటర్లతో పాటు తాను రోజు కలిసి పనిచేయాల్సిన అధికారులు సైతం తనను అనుమానపు చూపులు చూస్తుండే సరికి ఈయన తట్టుకోలేకపోయారు. వారం రోజులుగా అవమానాలను భరిస్తూ వచ్చిన ఎమ్మెల్యే అప్పలరాజు చివరికి ఇవాళ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వీటి ఫలితాలు వచ్చే వరకూ ఆయనతో పాటు కుటుంబ సభ్యులు, అధికారులు, స్ధానిక ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్ధితి. అసలే ఇప్పటివరకూ కరోనా ప్రభావం లేని శ్రీకాకుళం జిల్లాలో తాజాగా మూడు కేసులు నమోదైన నేపథ్యంలో ఎమ్మెల్యేకు నెగెటివ్ వస్తే సరేసరి.. కానీ పాజిటివ్ వస్తే పరిస్ధితి ఏంటన్న భయాందోళనలు స్ధానికంగా నెలకొంటున్నాయి.

వెల్త్ ట్యాక్స్ ను తిరిగి ప్రారంభించాలని ప్రధాని మోడీకి ఐ ఆర్ ఎస్ అధికారుల సూచన

భారత దేశం లో వ్యాపారాలు ఎక్కడికక్కడ నిలిపోయాయి. ప్రభుత్వానికి రాబడి తగ్గి ఖజానా నిండుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను తిరిగి ఎలా పట్టాలేక్కించాలనే దానిపై ఐఆర్ఎస్ అధికారులు ప్రధానీ మోదీకి కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో ఓ కథనం ప్రచురితమైంది. ఫిస్కల్ ఆప్షన్స్ అండ్ రెస్పాన్స్ టూ కోవిడ్-19 ఎపిడమిక్(ఫోర్స్) పేరిట రూపొందించిన సవివరమైన ప్రతిపాదనలను 50 మంది ఐఆర్‌ఎస్ అధికారులు ప్రధాని కార్యాలయానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపినట్టు తెలుస్తోంది. కేంద్ర పత్యక్ష పన్నుల బోర్డు వద్దకు కూడా ఈ ప్రతిపాదనలు చేరినట్టు సమాచారం. కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వారిపై 40 శాతం పన్ను విధించడం, వెల్త్‌ ట్యాక్స్‌ను పునఃప్రారంభించడం, 10 లక్షల ఆదాయం ఉన్న వారిపై 4 శాతం వన్ టైమ్ కొవిడ్-19 సెస్ విధించటం వంటి ప్రతిపాదనలు ఈ నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా పేద ప్రజలను ఆదుకునేందుకు ప్రతి నేలా వారికి నేరుగా రూ. 5000 చెల్లించాలని కూడా అధికారులు ప్రతిపాదించారట. ఆరోగ్య రంగంలోని కార్పొరేట్లకు, చిన్న వ్యాపారాలకు ట్యాక్స్ హాలిడే కూడా ఇవ్వాలని కూడా వారు సూచించారట. ‘ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం మరిన్ని నిధులు వెచ్చించాలి. అదే సమయంలో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న సామాన్య పౌరుడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలి’ అని అధికారులు ఆ నివేదికలో అభిప్రాయపడ్డారని సమాచారం.

ఏపీ లో మొత్తం 1,097 పాజిటివ్‌ కేసులు

ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా గత 24 గంటల్లో 6,768 శాంపిల్స్‌ పరీక్షించగా వాటిలో 81 కేసులు కరోనా పాజిటివ్‌గా తేలాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్‌–19 కేసుల సంఖ్య 1,097 కు చేరింది. కర్నూలు జిల్లాలలో అత్యధికంగా 279 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో 214, కృష్ణా జిల్లాలో 177, చిత్తూరు జిల్లాలో 73, నెల్లూరు జిల్లాలో 72, వైయస్సార్‌ కడప జిల్లాలో 58,  ప్రకాశం జిల్లాలో 56, అనంతపురం జిల్లాలో 53, పశ్చిమ గోదావరి జిల్లాలో 51, తూర్పు గోదావరి జిల్లాలో 39, విశాఖపట్నం జిల్లాలో 22, శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు గుర్తించారు. విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 231 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 31 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఆ తర్వాత కృష్ణా, గుంటూరు జిల్లాలలో 29 మంది చొప్పున, వైయస్సార్‌ కడప జిల్లాలలో 28 మంది,  ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో 23 మంది చొప్పున, విశాఖపట్నం జిల్లాలో 19 మంది, అనంతపురం జిల్లాలలో 14 మంది, చిత్తూరు జిల్లాలో 13 మంది, తూర్పు గోదావరి జిల్లాలో 12 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 మంది.. మొత్తం 231 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 835 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు. కర్నూలు జిల్లాలో 9 మంది, గుంటూరు, కృష్ణా జిల్లాలలో 8 మంది చొప్పున, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు చనిపోయారు.

స్ధానిక పోరులో గెలుపు కోసం సొంత ఎమ్మెల్యేల ప్రాణాలతో జగన్ చెలగాటం?

ఏపీలో కరోనా నేపథ్యంలో అర్ధాంతరంగా వాయిదా పడిన స్ధానిక ఎన్నికల పోరులో ఎలాగైనా గెలవాలన్న పట్టుదల ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను లాక్ డౌన్ లోనూ రోడ్లపై పరుగులు పెట్టిస్తోంది. జగన్ విధించిన టార్గెట్ ను అందుకోవాలంటే కరోనా వైరస్ వ్యాప్తిని కూడా పట్టించుకోకుండా జనంలో తిరగక తప్పని  పరిస్ధితి. దీంతో ఏపీ వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఒక్కొక్కరిగా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. పరిస్ధితి చూస్తుంటే అతి త్వరలో జగన్ మినహా 150 మంది ఎమ్మెల్యేలు త్వరలో జనంలోకి వచ్చేసినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. ఇప్పటికే జనంలో తిరుగుతున్న వైసీపీ ఎమ్మెల్యేల కారణంగా కర్నూలు, శ్రీకాళహస్తి, గుంటూరుతో పాటు పలు నియోజకవర్గాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయి. దీంతో ఇప్పుడు వీరి ప్రచార యావ కరోనాను మరింత వ్యాప్తి చేసేలా ఉందన్న విమర్శలు పెరుగుతున్నాయి. కరోనాతో స్ధానిక ఎన్నికలు వాయిదా పడకముందే జగన్ తన ఎమ్మెల్యేలు, మంత్రులకు స్పష్టమైన టార్గెట్ ఇచ్చేశారు. స్ధానిక ఎన్నికల్లో గెలవకపోతే భవిష్యత్తులో కష్టాలు తప్పవని, మంత్రులైతే తమ పదవులు రాజీనామా చేయక తప్పదని జగన్ తేల్చిచెప్పారు. దీంతో ఎలాగైనా స్ధానిక పోరులో ముందుండాలన్న తపనతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ దాడులకు బెదిరిపోయి టీడీపీతో పాటు విపక్షానికి చెందిన ఏ ఒక్క అభ్యర్దీ నామినేషన్లు వేసేందుకు సైతం ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే వారికి సంఘీభావంగా పల్నాడు వెళుతున్న టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమ కారుపై వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్ధి భీకరంగా దాడి చేశాడు. ఈ దాడి నుంచి తృటిలో తప్పించుకున్న టీడీపీ నేతలను ఆ తర్వాత కూడా బయటికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.  ఆ లోపే కరోనా వైరస్ కారణంగా స్ధానిక ఎన్నికలు వాయిదా పడిపోవడంతో వైసీపీ నేతలు దిక్కుతోచని పరిస్ధితుల్లో పడిపోయారు. కరోనా భయంతో ఓ వారం పాటు ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లకే పరిమితం అయిన వైసీపీ ఎమ్మెల్యేలు.. ఆ తర్వాత నిత్యావసరాల పంపిణీ పేరుతో జనంలోకి రావడం మొదలుపెట్టారు. శ్రీకాళహస్తిలో మధుసూధన్ రెడ్డి, కర్నూల్లో హఫీజ్ ఖాన్, నగరిలో రోజా, చిలకలూరిపేటలో విడదల రజనీ, విశాఖలో విజయసాయిరెడ్డి, సూళ్లూరుపేటలో సంజీవయ్య ఇప్పటికీ జనాల్లో హల్ చల్ చేస్తూ కరోనా  వ్యాప్తికి కారణమవుతున్నారు. వీరి కారణంగా స్ధానికంగా కేసులు పెరుగుతుండటంతో కరోనాను కట్టడి చేయలేక అధికార యంత్రాంగం సైతం చేతులెత్తేస్తున్న పరిస్దితులు కనిపిస్తున్నాయి. అయినా స్ధానిక పోరు గెలవాలన్న పట్టుదలతో వీరు ఎవరినీ లెక్క చేయకుండా రోడ్లపైనే ఉంటున్నారు. స్వయంగా జగన్ ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసే క్రమంలో వీరు జనంలో తిరుగుతూ ఉండటంతో అధికారులు కూడా వీరిని అడ్డుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై  పూర్తి నిషేధం

* అత్యవసర సేవలైనా సరే అనుమతించేది లేదు...  * ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులకూ 'నో పర్మిషన్'  రెండు జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్ట్లు ఏర్పాటు చేసినట్టు రెండు జిల్లాల పోలీసులు ప్రకటించారు. పులిగడ్డ పెనుమూడి వారథి వద్ద రెండు జిల్లాల గుండా ప్రయాణాలు చేస్తున్న ప్రయాణీకులను అడ్డుకుని నిబంధనలు తెలియచేస్తున్న అవనిగడ్డ (కృష్ణాజిల్లా), రేపల్లె  (గుంటూరు జిల్లా) పోలీసులు. అత్యవసర సేవల కోసం కూడా రెండు జిల్లాల మధ్య రాకపోకలను బంద్ చేసిన అధికారులు, ఏ జిల్లా వాసులు ఆ జిల్లాల్లోనే ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో కరోనా విశ్వరూపం దాలుస్తున్న నేపథ్యంలో రెండు జిల్లాల మధ్య రాకపోకలపై నిషేధం విధించారు.  రెండు జిల్లాల గుండా రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేట్  ఉద్యోగులన్ని కూడా అనుమతించే ప్రసక్తే లేదంటున్న అధికారులు.

అక్టోబర్ నాటికి మూడు కోట్ల వాక్సిన్లతో మనమే ముందుకు...

కోవిడ్ 19 వాక్సిన్ దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమవుతోంది.ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం మొన్న హ్యూమన్ ట్రయల్ ప్రారంభించిన వాక్సిన్ను అక్టోబర్ నాటికి కనీసం మూడు కోట్ల డోసులు ఉత్పత్తి చేసేందుకు సిరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(sii)  అన్ని ఏర్పాట్లు చేస్తోంది.ఈ వాక్సిన్ అన్ని పరీక్షలను దాటుకుని సెప్టెంబర్ నాటికి ప్రజా వినియోగానికి ఆమోదం పొందితే అప్పటికి ఇంగ్లాండ్ లో కేవలం పది లక్షల డోస్ లు మాత్రమే అక్కడ ఆందుబాటులోకి వస్తాయి.ఈ నేపథ్యంలో భారతీయ సంస్థ ఆనాటికి మూడు కోట్ల డోసులతో సిద్ధంగా ఉంటుంది.ఈ విషయంలో ఆక్స్ఫర్డ్ కంటే భారత్ ఒక అడుగు ముందే ఉండాలని నిర్ణయం తీసుకుంది.ఒకసారి వాక్సిన్ ఆమోదం పొందితే కొరత ఉండకూడదనే లక్ష్యంతో అక్టోబర్ నాటికి నెలకు యాభై లక్షల డోస్ ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్టు SII CEO అదర్ పూనావాలా చెబుతున్నారు.ఒకసారి మొదలు పెట్టాక ఆ సామర్ధ్యాన్ని నెలకు కోటి డోసుల వరకు పెంచగలమని అంటున్నారు. ఇదిలా ఉండగా లెప్రసీ వాక్సిన్ mycobacterium w ను covid రోగుల చికిత్స కోసం ప్రయోగించి చూసేందుకు PGI చండీఘర్ కు ఆమోదం లభించింది.ఈ వాక్సిన్ను ఇప్పటికే నలుగురు రోగులకు ఇవ్వగా ప్రతికూలతలు లేవని తెలుస్తోంది.ఈ వాక్సిన్ కూడా నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కాగా బెంగలూరుకు చెందిన BIOCON సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ కిరణ్ మజుందార్ షా తాము ఏడాదిలోపుగానే వాక్సిన్ సిద్ధం చేయగలమని చెప్పారు.ఈలోగా ప్లాస్మా ట్రీట్మెంట్ చక్కని ప్రత్యామ్నాయమని ఆమె చెబుతున్నారు.గత కొద్ది వారాలలో భారత్ కరోనా దుష్పరిణామాలపై మంచి అవగాహన ఏర్పరచుకుందని,అందుకే ఇప్పుడు ఈ మహమ్మారిని మనం సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని ఆమె పేర్కొన్నారు.మిగిలిన దేశాలతో పోలిస్తే భారత్ లో మరణాల సంఖ్య మాత్రమే కాక వెంటిలేటర్ చికిత్స వరకు వస్తున్న వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని ఆమె అన్నారు.ఈ నేపథ్యంలో మే 3 నాటికి లాక్ డౌన్ సడలిస్తే జూన్ చివరి నాటికి ఆర్థిక పునర్ నిర్మాణంలో మనం గాడిలో పడగలుగుతామని ఆమె అభిప్రాయపడ్డారు.

24 గంటల్లో అమెరికాలో 36,000 కొత్త కేసులు

అగ్రరాజ్యం లో మొత్తం మృతుల సంఖ్య 53,928 కాగా, మొత్తం కేసుల సంఖ్య 9,56,375 కు చేరుకుంది. 24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకీ భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో అమెరికాలో 2,494 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 53,928గా ఉంది. అమెరికాలో మొత్తం కేసుల సంఖ్య 9,56,375కి చేరిందని జాన్స్‌ హోప్కిన్‌ విశ్వవిద్యాలయం తెలిపింది. కరోనా కేసులు, మృతుల సంఖ్య ఏ దేశంలో లేనంత అత్యధికంగా అమెరికాలో ఉంది. శుక్రవారం అమెరికాలో 1,258 మంది ప్రాణాలు కోల్పోయారు. మూడు వారాల్లో అత్యల్ప మరణాల సంఖ్య ఇదే. ఇంతలోనే మృతుల సంఖ్య భారీగా పెరిగింది.  24 గంటల్లో అగ్రరాజ్యంలో కొత్తగా సుమారు 36 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. అమెరికాలో పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.