అరనిమిషంలో పరీక్ష ఫలితాలు

ఏఐ టెక్నాలజీ ద్వారా టెస్టింగ్ కంటికి కనిపించని కోవిద్ 19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రపంచంలోని మేధావులంతా కృషి చేస్తున్నారు. మానవ మేధస్సుకు పదును పెడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో వైరస్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న పరిశోధన ఫలితాలు తుది దశకు వచ్చాయి. ఈ ఆధునాతన పరీక్ష విధానం అందుబాటులోకి వస్తే అరనిమిషంలోనే కోవిద్ 19 వైరస్ ఉనికిని కనిపెట్టేయవచ్చు. అతి త్వరలోనే ఈ కొత్త టెస్ట్ కిట్స్ అందుబాటులోకి రానున్నాయి. శ్వాసే శాంపిల్ ఈ కొత్త పరీక్ష విధానంలో మన మాట, శ్వాసే శాంపిల్. కోవిద్ వైరస్ గొంతు, ముక్కు ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. మాట తీరు, శ్వాస తీసుకోవడంతో తేడాలను గుర్తించే సెన్సార్ల ద్వారా వైరస్ ఉనికిని కనిపెడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నిం గ్ టెక్నాలజీతో శరీరంలో ఉన్న వైరస్ మూలాలను ఈ కొత్త కిట్ చెప్పేస్తుంది. పరీక్ష ఫలితాలు 85 శాతం కచ్చితంగా వైరస్ ఉనికిని నిర్దారిస్తాయి. ఈ కిట్ ధర కేవలం 750రూపాయలు మాత్రమే. సెన్సార్ ద్వారా.. మానవ మేధస్సుకు పదను పెట్టి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో అనేక అంశాలు యంత్రాలతోనే పూర్తి అవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో సెన్సార్ తో  హ్యాండ్ శానిటైజర్లు, మన టెంపరేచర్ చెక్ చేసే థర్మోమీటర్ లో ఏఐ వాడుతున్నారు. ఈ కొత్త విధానంలో ముక్కుతో గాలిని ఒక కవర్ బ్యాగ్ లోకి వదలాలి. ఆ గాలిని ఏఐ టెక్నాలజీ ఉండే ‘సెంట్ రీడర్ ’అనే ఓ మెషీన్ లోకి పంపిస్తారు. అది టెర్రాహెర్ట్జ్ వేవ్స్ (టీహెచ్ జెడ్ ) అనే టెక్నాలజీ సాయంతో వైరస్ ను అర నిమిషంలోనే గుర్తిస్తుంది. ఆ తర్వాత వాయిస్ టెస్ట్, బ్రెతలైజర్ టెస్ట్, ఐసోథెర్మల్,  పాలి అమైనో యాసిడ్ టెస్ట్ చేస్తారు. ఇజ్రాయెల్ డైరక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీడీఆర్ డీ) తయారు చేసిన ఈ కొత్త టెస్ట్ను కిట్ లను ఆ దేశంలో ఇప్పటి కే  వెయ్యి మంది పేషెంట్లపై ట్రయల్ నిర్వహించారు. బ్రెతలైజర్ పద్ధతిలో చేసిన ఈ టెస్ట్ ద్వారా 85 శాతం కరెక్ట్ రిజల్ట్స్ వచ్చాయని ఆ కిట్ ను తయారుచేస్తున్న నానోసెంట్ కంపెనీ సీఈవో ఒరెన్ గావ్రియెలీ ప్రకటించారు. మన దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెం ట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తో కలిసి ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ చేస్తారు.  రెండు వారాల పాటు జరిగే ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే  వాటిని పెద్ద సంఖ్యలో ఇక్కడ తయారు చేస్తారు. మన దేశ అవసరాలకు పోనూ మిగతా వాటిని ప్రపంచ దేశాలకు పంపిస్తారు.

నలంద కిషోర్ మృతి.. బాధ్యులెవరు?

విశాఖలో టీడీపీ సానుభూతిపరుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచరుడు నలంద కిషోర్ ఓ ప్రైవేటు హాస్పిటల్‌ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. సోషల్ మీడియాలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారంటూ ఇటీవల కిషోర్‌ ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విశాఖ నుంచి కర్నూలుకు రోడ్డు మార్గంలో తరలించి అక్కడ న్యాయస్థానంలో హాజరుపర్చారు. స్టేషన్ బెయిల్‌ పై కిషోర్ విడుదలై బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేదని ఆయన బంధువులు అంటున్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కరోనా పాజిటివ్ అని అనుమానంతో ఆస్పత్రి సిబ్బంది శాంపిల్స్ సేకరించింది. ఇదిలా ఉంటే, నలంద కిషోర్ మృతికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, సీఐడీ పోలిసుల నిర్లక్ష్యమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా పరీక్షల పేరుతో ఆయనను కర్నూల్ లో కరోనా పాజిటివ్ పేషంట్ల వార్డ్ లో ఉంచారని, అక్కడే ఆయనకు కరోనా సోకిందని, అందుకే మరణించారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు ఆయన ప్రాణాలను బలి తీసుకున్నరంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కరోనా కట్టడికి వినూత్న పంథాలు

బెదిరించో.. బుజ్జగించో వ్యాప్తిని నివారించే ప్రయత్నం ఒక్కరితో మొదలై కోట్లాది మందికి సోకిన కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వాలు పడరాని పాట్లు పడుతున్నాయి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో వైరస్ వ్యాప్తిని నివారించే అవకాశం ఉండటంతో ప్రజల్లో అవగాహన కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. ప్రజలకు నచ్చచెప్పడానికి కొన్నిచోట్ల ప్రభుత్వాలు భారీ ఫైన్లు, జైలు శిక్షలతో బెదిరిస్తుంటే మరికొన్నిచోట్ల బహుమతులు ఇస్తామంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. జివ్వకో రుచి అన్నట్టు.. ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్నారు. చివరి అందరి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే సామబేధదానదండోపాయలను ప్రయోగించైనా సరే కరోనాను కట్టడి చేయడం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జార్ఖండ్ ప్రభుత్వం మాస్క్ లేకుండా బయటకు వస్తే లక్ష రూపాయల ఫైన్.. రెండేళ్ల జైలు శిక్ష అంటూ కీలక ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇన్ఫెక్షియస్ డిసీస్ ఆర్డినెన్స్ -2020’ని తీసుకొచ్చింది. వైద్య పరీక్షలతో కరోనా వ్యాప్తిని నివారించాలన్న ఆలోచనతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజలకు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. క‌రోనా వైర‌స్ టెస్ట్ లు చేయించుకున్నవారికి 300 డాలర్లు మన క‌రెన్సీ ప్ర‌కారం రూ.25వేలు, పాజిటీవ్ వ‌చ్చిన‌వారికి 1500 డాలర్లు (లక్షా 11వేల రూపాయాలు)  చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఆస్టేలియా విక్టోరియా రాష్ట్రంలో రెండు వారాల వ్యవధిలోనే 3,800 మందికి పైగా క‌రోనా వైర‌స్ సోకింది. ఈ నేప‌థ్యంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు విక్టోరియా సీఎం డేనియ‌ల్ ఆండ్రూస్ ఈ ప్రకటన చేశారు. ఈ బహుమతి పొందడానికి కొన్ని ష‌ర‌తులు కూడా విధించారు. ఉద్యోగస్తులకు మాత్రమే ఈ అవకాశం. అంతేకాదు గ‌తంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఉద్యోగుల‌ు ఇందుకు అర్హులు.

ఇంటినుంచే ఆర్టీఏ సేవలు

కొత్త బండి రిజిస్ట్రేషన్ కావాలన్నా, పాత లైసెన్స్ రెన్యూవల్ చేయాలన్నా ఇకపై ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అంతేకాదు లెర్నర్ లైసెన్స్ కోసం కూడా ఇంటినుంచే అప్లై చేసుకోవచ్చు. ఇప్పటికే 59 సేవలను ఆన్ లైన్ ద్వారా అందిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలా వరకు ఆన్ లైన్ లోనే సేవలు అందించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంట్లో నుంచే కంప్యూటర్‌‌, ఫోన్‌ ‌ద్వారా వాహన్‌‌ వెబ్‌సైట్‌‌లో కావలసిన సేవల కోసం అప్లై చేసుకోవచ్చు. డూప్లికేట్ ఎల్‌‌ఎల్‌‌ఆర్‌‌ (లెర్నర్‌‌ లైసెన్స్‌‌), డూప్లికేట్ లైసెన్స్, బ్యాడ్జి , స్మార్ట్ కార్డ్(పాత లైసెన్స్ఇచ్చి కొత్తది తీసుకోవడం), లైసెన్స్ హిస్టరీ షీట్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఆర్టీఏలో 59 సేవలను ఆన్‌‌లైన్‌‌ ద్వారా పొందే వీలుంది. ఇందులో 31 అంశాల్లో దరఖాస్తు దారులు నేరుగా ఆఫీస్ కు వెళ్ళాల్సి ఉంటుంది. వీటిలో ప్రస్తుతం 5 సేవలను పూర్తిగా ఆన్ లైన్ చేశారు. అయితే ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఆన్ లైన్ లో పంపించాలి. మరో 6 సర్వీసులను అతి త్వరలోనే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి  తీసుకొచ్చే అవకాశం ఉంది.

సెప్టెంబర్ చివరికి మన దేశంలో కోటి కేసులు.. అంచనాలకు తగ్గట్టుగానే వైరస్ వ్యాప్తి 

చైనాలో కరోనా వైరస్ మొదలైన కొత్తలో.. ఈ వైరస్ భారత్ లోకి ఎంటర్ ఐతే వ్యాప్తిని నిరోధిందడం కష్టమనే అభిప్రాయం అటు దేశంలోను ఇటు ప్రపంచ దేశాల నుండి వినిపించింది. ఐతే ఫిబ్రవరిలో ఇండియాలో వైరస్ ప్రవేశించినా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటు మొదట్లో దాని తీవ్రత అంతగా లేకపోవడంతో భారత్‌కి కరోనా ముప్పు తక్కువే అని అందరు భావించారు. ఐతే అధ్యయన సంస్థలు మాత్రం ఇండియాలో కరోనా వైరస్ ఎంటర్ ఐతే అది ఏ స్థాయిలో వ్యాపిస్తుందో కొన్ని అంచనాలు వేశాయి. ఐతే లాక్‌డౌన్ ఎత్తివేశాక కరోనా వైరస్ వ్యాప్తి పెరిగింది. మే, జూన్ నెలల ‌లో కేసుల సంఖ్య పెరుగుతూ పోయాయి. ఇక జులైలో అది మరింత ఎక్కువై ప్రతి రోజూ 50 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. మన దేశం లో పాజిటివ్ కేసుల సంఖ్య 1000 నుంచి లక్షకు చేరడానికి 51 రోజుల సమయం పట్టింది. అదే ఒక లక్ష నుంచి 10 లక్షలు చేరడానికి 59 రోజుల సమయమే తీసుకుంది. ఇక ముందు పెరిగే కేసుల సంఖ్య కు పట్టే సమయము తగ్గుతూ పోతోంది. దీంతో వచ్చే ఆగస్ట్‌లో మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెపుతున్నారు. చెన్నై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమేటికల్‌ సైన్సెస్‌పరిశోధకులు జూన్‌‌లో వేసిన అంచనాల ప్రకారం జులై చివరికి 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఐతే జూలై 16 నాటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అంతే కాకుండా వ్యాక్సిన్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుత అంచనా ప్రకారం 2021 నాటికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కొత్త కేసులు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం సెప్టెంబరు 22 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య ఒక కోటి దాటుతుంది. దీనిని బట్టి 60 రోజుల తర్వాత కేసుల సంఖ్య కోటి కి చేరుతుందంటే వచ్చే రెండు నెలల్లో కొత్తగా వచ్చే కేసులు 89 లక్షలు. ప్రస్తుతం మన దేశంలో కరోనా రికవరీ రేటు 63.5 శాతంగా ఉంది. అంతే కాకుండా కరోనా వచ్చిన వారిలో 90 శాతానికి పైగా కోలుకుంటున్నారు. అదే విధంగా ప్రపంచ దేశాల తో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు తక్కువగా 2.4 శాతంగా ఉంది. ఐతే మనం అన్ని జాగ్రత్తలూ పాటిస్తే.. చుట్టూ ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నా వైరస్ దరిచేరకుడా చేసుకోవచ్చు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. వైరస్ కబళించే ప్రమాదం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు సమస్య తీవ్రంగా ఉన్న పేషెంట్లను గుర్తించి వెంటనే వారికి అత్యవసర చికిత్స అందించాలని నిపుణులు కోరుతున్నారు.

అడవుల పరిశోధనల్లో అమ్మాయిలు

అబర్న్ యూనివర్సిటీ సీటు సాధించిన తెలంగాణ ఆడబిడ్డలు అమ్మాయిలు అనగానే టీచర్లు, డాక్టర్లు, బ్యాంక్ ఉద్యోగం, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇలా కొన్నిరకాల ఉద్యోగులకు పనికివచ్చే కోర్సులు చదవమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తరు. కానీ, వారికి ఇష్టమైన కోర్సులు చదివే స్వేచ్ఛను ఇచ్చే తల్లిదండ్రులు కొందరే ఉంటారు. వారి ప్రోత్సాహంతో తాము ఎంచుకున్న అంశంలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు సిద్ధమవుతున్నారు నేటి అమ్మాయిలు. ఫారెస్ట్ కోర్సు చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో సీటు సాధించారు. అది కూడా ఉచితంగా. వారి ప్రతిభ, ఆసక్తిలను గమనించిన యూనివర్సిటీ కోర్సు ఫీజు మొత్తం రద్దు చేయడంతో పాటు అదనంగా రెండేళ్లకు 25లక్షల స్కాలర్ షిప్ ఇస్తుంది.  అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్సీ కోర్సులో తెలంగాణ అమ్మాయిలు సీటు దక్కించుకున్నారు. గత మేనెలలో సూర్య దీపిక ఎంఎస్ సీటు సాధించగా.. ఇప్పుడు సుహర్ష సీటు దక్కించుకుంది. హైదరాబాద్‌ లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఎంఎస్సీ ఫారెస్ట్ జెనటిక్స్ లో,  మంచిర్యాలకు చెందిన సుహర్ష ఎంఎస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీటు సాధించింది. వీరిద్దరూ ఫైనల్‌ పూర్తి కాకముందే పిజీలో సీటు సాధించారు. నాలుగేళ్ల ఫారెస్ట్రీ కోర్సులో వారికి వచ్చిన మార్కుల ఆధారంగా వారిద్దరికీ ఫ్రీ సీటు ఇవ్వడంతోపాటు స్కాలర్ షిప్ కూడా అబర్న్ యూనివర్సిటీ ఇస్తుంది.   రెండేళ్ల ఈ ఎమ్మెస్‌ కోర్సు ఫీజు మొత్తం 30వేల డాలర్లు అంతే మన కరెన్సీలో దాదాపు 25లక్షలు. ఈ ఫీజు మొత్తాన్ని మాఫీ చేశారు. అంతేకాదు వారికి నెలకు 1,500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కూడా మంజూరు చేసింది. వారిద్దరూ తమ ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువులకు అర్హత సాధించారు. అబర్న్‌ యూనివర్సిటీలో ప్రముఖ డాక్టర్‌ జన్నా విల్లోగ్‌ నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్‌ లైఫ్‌ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది. ములుగులో నెలకొల్పిన ఎఫ్‌సీఆర్‌ఐలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును 2016లో ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో ఫైనల్ కు చెరిన ఫస్ట్ బ్యాచ్ లో 49మంది విద్యార్థులు ఉంటే అందులో 31మంది అమ్మాయిలే. వీరిలో సుమారు 20 మంది సివిల్‌ సర్వీసులకు కూడా ప్రిపేర్‌ అవుతున్నారు. డెహ్రాడూన్ లోని  ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీలో వుడ్ టెక్నాలజీలో ఆరుగురు అమ్మాయిలకు సీటు వచ్చింది. మరో ముగ్గురు విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యావకాశాలు వచ్చే అవకాశం ఉందని డీన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నామని మొదటి బ్యాచ్‌లో 24 మందికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు. అబర్న్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ డీన్ గా ఉన్న జానకిరాం రెడ్డి అవలపాటి తెలంగాణ విద్యార్థులకు ఉన్నతవిద్య అందించేందుకు సహకారం అందిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యను అందించే లక్ష్యంగా అబర్న్‌ యూనివర్సిటీ, కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా యూనివర్సిటీతోనూ ఒప్పందాన్నికుదుర్చుకున్నారు.

మీడియాని అడ్డుకోవద్దు.. అనేక అనుమానాలకు దారి తీస్తుంది

సచివాలయం కూల్చివేతల వద్దకు మీడియాకు అనుమతి ఇవ్వలేమని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. సచివాలయం కూల్చివేతపై కవరేజ్‌ కు మీడియాను అనుమతించాలని దాఖలైన పిటిషన్‌ పై హైకోర్టు ఈరోజు విచారించింది. కోవిడ్ బులిటెన్ మాదిరిగా కూల్చివేతలకు సంబంధించిన బులిటెన్ విడుదల చేస్తామని ప్రభుత్వం కోర్టు దృష్టికి తెచ్చింది. అయితే, తమకు ప్రత్యక్ష ప్రసారాలు చేసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిష‌నర్ కోరారు. ఆర్టికల్ 90 ప్రకారం మీడియా స్వేచ్చకు ప్రభుత్వం ఆటంకాలు కలిగిస్తుందని పిటిష‌నర్ అన్నారు.  నిర్ధిష్ట స‌మ‌యంలో క‌నీసం అర‌గంట అయినా మీడియాను అనుమ‌తించ లేరా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంద‌రూ ఒకేసారి రావ‌టంతో క‌రోనా నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తార‌ని, జ‌ర్న‌లిస్టుల‌ను అనుమ‌తిస్తే వారికి ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌భుత్వం వాదించింది. క‌నీసం సచివాలయ చుట్టు ప్ర‌క్క‌ల ప్రాంతాల నుండి కూల్చివేతలను కవరేజ్ చేస్తున్నా అడ్డుకున్నారని పిటిష‌నర్ కోర్టు దృష్టికి తీసుక‌రాగా.. ప్రైవేటు ప్రాంతాల్లో వెళ్లి కవరేజ్ చేస్తే ఎందుకు అడ్డుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు ప్రాంతాల్లో కవరేజ్ చేస్తున్న మీడియా అడ్డుకోవద్దని ఆదేశించింది. నిజాం నిధి ఉందని జాతీయ మీడియాలో ప్రసారం అయిందని, అది నిజమో కాదో తెలియాల్సిన అవసరం ఉందని పిటిష‌నర్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఎందుకు ఇంత రహస్యంగా పనులు చేపడుతోందని హైకోర్టు ప్రశ్నించింది. అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించి కోట్ల రూపాయల సంపదను లైవ్‌లో చూపించిన మీడియాను, ఇప్పుడు ఎందుకు మీరు కట్టడి చేస్తున్నారని ప్రశ్నించింది. ప్రభుత్వం మీడియాకు అనుమతిస్తుందని అనుకున్నామని, అనుమతి ఇవ్వకపోవడంతో అనేక అనుమానాలకు దారి తీస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రేపు పిటిషన్ అర్హతపై ప్రభుత్వం నిర్ణయం చూసి తుది తీర్పు ఇస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

భారత్ లోని ఆ నగరాల్లో కరోనా తగ్గుముఖం.. ఎయిమ్స్ డైరెక్టర్

మన దేశం లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఐతే కొన్ని నగారాలలో మాత్రం కరోనా వ్యాప్తి ఇప్పటికే పీక్ స్టేజ్ కు చేరుకొని ఇపుడు తగ్గు ముఖం పడుతోందని ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ముంబై, అహ్మదాబాద్ వంటి నగరాలతో పాటు దక్షిణ భరత దేశం లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే పీక్ స్టేజ్ పూర్తయి, అక్కడ కేసుల గ్రాఫ్ క్రమంగా కిందికి దిగుతోందని ఆయన పేర్కొన్నారు. ఐతే ప్రస్తుతం కేసులు అధికంగా ఉన్న బీహార్, అసోం వంటి రాష్ట్రాల్లో కరోనా నియంత్రణ కోసం కఠినమైన వ్యూహాలు అమలు చేయాల్సి ఉంటుందని గులేరియా అభిప్రాయపడ్డారు. అయితే, భారత్ లోని అనేక ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుతుండడంతో ప్రజలు తమను కరోనా ఏమీ చేయలేదని భావిస్తున్నారని, దీంతో భౌతికదూరం పాటించడంలేదని, మాస్కులు కూడా ధరించకుండా బయటికి వస్తున్నారని, దీంతో మరోసారి కరోనాను ఆహ్వానించినట్టేనని ఆయన హెచ్చరించారు.

కరోనా చికిత్స కోసం అదనంగా రూ. 1000 కోట్లు: సీఎం జగన్‌

కరోనా చికిత్స కోసం వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్టు ఏపీ సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు. శుక్రవారం జరిగిన కోవిడ్‌ సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా మరో 54 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 138 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అదనంగా మరో 5 ఆస్పత్రుల్లో క్రిటికల్‌ కేర్‌ సదుపాయలు కల్పించే దిశగా సాగుతున్నామని, వాటిలో ఇప్పటికే 3 ఆస్పత్రులు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. కరోనా బాధితుల చికిత్స కోసం అదనంగా 2380 క్రిటికల్‌ కేర్‌ బెడ్లు అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్‌ చెప్పారు. వచ్చే 6 నెలల్లో అదనంగా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామని అన్నారు. మందులు, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సిబ్బంది నియామకాల కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. ఇవికాకుండా కోవిడ్‌ టెస్టులు, క్వారంటైన్‌ సదుపాయాలకోసం రోజుకు సుమారు రూ.6.5 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తోందని అన్నారు.

వ్యాక్సిన్ పేరుతొ మేము ప్రజలను చంపేస్తామా.. కుట్ర సిద్ధాంతాల పై బిల్ గేట్స్  

ప్రపంచ వ్యాప్తంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నసంగతి అందరికి తెలిసిందే. తాజాగా అయన కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ల కోసం 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే, ఇంతలో కరోనా వైరస్ వ్యాప్తి వెనుక బిల్ గేట్స్ హస్తం ఉందంటూ కుట్ర సిద్ధాంతాలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై 15 శాతం ప్రజలను అంతమొందించాలన్నది ఆయన లక్ష్యమని ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీని పై స్పందిస్తూ కరోనా వైరస్ పుట్టుకకు తానే కారణం అన్న కుట్ర సిద్ధాంతాన్ని బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు. ఈ దుష్ప్రచారం పై బిల్ గేట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను వ్యాక్సిన్ల ద్వారా మేము ఎప్పుడైనా చంపామా? వ్యాక్సిన్ల ద్వారా మేము ఎప్పుడైనా డబ్బు కూడబెట్టామా? ఎవరైనా దీనిని నిరూపించగలరా అంటూ అయన సవాల్ విసిరారు. వాస్తవానికి ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం తాము ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని, అంతే కాకుండా అనేక వ్యాక్సిన్ల రూపకల్పనతో తమకు సంబంధం ఉన్న మాట కూడా వాస్తవమేనని అయినా, వ్యాక్సిన్లతో ప్రజలను చంపాలని తాము ఎప్పుడూ అనుకోలేదని అయన స్పష్టం చేశారు. ఐతే 2015 లో జికా వైరస్ వ్యాప్తి జరిగినపుడు కూడా బిల్ గేట్స్ పై ఇటువంటి కుట్ర సిద్ధాంత ఆరోపణలే రావడం గమనార్హం.

తెలంగాణ కళాకారుల వివరాలు మొబైల్ యాప్ లో

కళల ఖజానాగా వర్ధిల్లుతున్న తెలంగాణలో ఉన్న ఎంతోమంది జానపద, గిరిజన, శాస్త్రీయ, లలిత కళాకారుల వివరాలు ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేసింది రాష్ట్ర సాంస్కృతిక శాఖ. ఇందుకు సంబంధించి ప్రత్యేక యాప్ T-CULTURE ను  తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించారు. ఇందులో కళాకారులందరికీ సంభందించిన డేటా అందుబాటులో ఉంటుంది.  మొబైల్ యాప్ ద్వారా ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక, పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. వినూత్న మొబైల్ యాప్ ను రూపొందించినందుకు శాఖ కార్యదర్శి   శ్రీనివాసరాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ లను మంత్రి అభినందించారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న కళాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆన్ లైన్  ద్వారా గుర్తింపు కార్డులను జారీ చేయడం సులభం అవుతుంది.   కళాకారుల డేటా బేస్ ను రూపొందించి వారి జన్మస్థలం, కళారూపం, వయస్సు, చదువు, సాధించిన విజయాలు వంటి విషయాలు అందుబాటులో ఉంచుతారు. ఈ యాప్ ద్వారా ID కార్డ్ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని MEE SEVA తో అనుసంధానం చేశామన్నారు. ID కార్డు కావాలనుకునే కళాకారులెవరైనా తమ వివరాలు, కళా ప్రదర్శన వివరాలు, వారి గురించి పత్రికలలో వచ్చిన కథనాలను మీ సేవ సెంటర్ లలో సమర్పించి 30 రోజులలో తమ ID కార్డ్ ను పొందవచ్చు. ఈ యాప్ 1 ఆగస్టు, 2020 నుండి అందుబాటులో ఉంటుంది. మొదటి కార్డు ను కవి, కళాకారుడు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అందించారు.

డోసుల రేసులో పెరుగుతున్న పోటీలు

కోవిద్ 19 వైరస్ తో అతి ఎక్కువగా ప్రభావితమైన అగ్రదేశాలు వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేసే రేసులో పోటీలు పడుతున్నాయి. వ్యాక్సిన్ తయారి కోసం ప్రపంచంలోని అనేక దేశాల్లోని 150కి పైగా సంస్థలు ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ఆక్స్ ఫర్డ్, రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసుకుని మార్కెట్ లోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకముందే కరోనాతో తీవ్రంగా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం చవిచూసిన అగ్రరాజ్యాలు తమ ప్రజలకు కావల్సిన స్థాయిలో వ్యాక్సిన్ డోసులు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నాయి.  ఫైజర్‌, బియోఎన్‌టెక్‌ఎస్‌ఈ సంయుక్తంగా తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ పాలకవర్గం ఒప్పందం చేసుకుంది. యూఎస్‌ఎఫ్‌డీఏ ఆమోదం లభిస్తే డిసెంబర్‌లోగా అందించే 10 కోట్ల డోసులకు 200 కోట్ల డాలర్లు చెల్లించడానికి అమెరికా సిద్దంగా ఉంది. ఈ వ్యాక్సిన్ బాగా పనిచేసి సురక్షితమే అని స్పష్టమైన తర్వాత మరో 50కోట్ల డోసులు కొనడానికి ట్రంప్ రెడీగా ఉన్నాడు. వ్యాక్సిన్ ఏ దేశం అందుబాటులోకి తీసుకువచ్చినా ముందుగా తమ ప్రజలకు దానిని ఇచ్చేందుకు ట్రంప్ భారీగా కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బ్రిటన్‌ తొమ్మిది కోట్ల డోసులకు ఒప్పందం కుదుర్చుకుంది. కొత్తగా నిమిషానికి 43 మంది .. ప్రపంచంలోనే ఎక్కువగా కరోనా కేసులు నమోదు అయిన దేశం అమెరికానే. ఇక్కడ నిమిషానికి 43 మంది కొత్తగా కోవిద్ 19 వైరస్ బారిన పడుతున్నారు.  దేశవ్యాప్తంగా కరోనా కేసులు 40 లక్షలు దాటిపోయాయి. లక్షా 47,342 మంది మరణించారు. దాదాపు 20లక్షల మంది రికవరీ అయ్యారు.

అయోధ్య రామమందిరం భూమిపూజ ఆపివేయాలని హైకోర్టులో పిల్ 

ప్రస్తుతం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 5న ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం జరగనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన వేళ.. భూమి పూజ ఆపాలంటూ అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయింది. అన్‌లాక్ 2 గైడ్ లైన్స్ ప్రకారం ప్రార్థనా మందిరాల్లో సామూహిక వేడుకలు నిర్వహించకూడదని ఢిల్లీకి చెందిన లాయర్ సాకేత్ గోఖలే పిల్ వేశారు. ఎక్కువ మంది ప్రజలు ఒక్క చోట గుమిగూడితే వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదముందని అందులో అయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని భూమి పూజ కార్యక్రమంపై స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇందులో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ను, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఐతే ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ఇప్పటి వరకు విచారణకు స్వీకరించలేదు. ఐతే హైకోర్టులో పిల్ వేసినందువల్ల, కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ఎక్కువ మందిని ఆహ్వానించకూడదని శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయించిన విషయం తెలిసిందే. కేవలం 150 మంది అతిథులు సహా 200 మంది మాత్రమే కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించింది.

ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దు.. రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వచ్చే శుక్రవారంలోగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థతో చీవాట్లు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అనవసరంగా న్యాయవ్యవస్థలతో పెట్టుకుని ఆర్టికల్ 356ని కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. కోర్టులకు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వెళ్లే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అన్నారు. మనది రాచరిక వ్యవస్థ కాదని, ప్రజాస్వామ్య దేశమని.. న్యాయ వ్యవస్థలను, కోర్టులను గౌరవిద్దామని చెప్పారు.  సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించి ఎస్ఈసీగా నిమ్మగడ్డను తిరిగి నియమించాలని కోరారు. కోర్టు తీర్పు మేరకు నిమ్మగడ్డను నియమిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గవర్నర్ మాట వినలేదు.. కనీసం సుప్రీంకోర్టు తీర్పునైనా గౌరవించండి అని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయం సరైనదని.. కరోనా మహమ్మారి నుంచి ఆ నిర్ణయం ప్రజలను కాపాడిందని చెప్పారు. తాను సలహా ఇస్తే స్వీకరించరు. సలహాదారులు బోలెడంత మంది ఉన్నా.. వారేమో సరైన సలహాలు ఇవ్వరని ఎద్దేవా చేశారు. చెప్పుడు మాటలు విని ముఖ్యమంత్రి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడమే తన తప్పైపోయిందని  వ్యాఖ్యానించారు. 22 మంది ఎంపీలను మీకు అప్పగిస్తాం.. రఘురామ కృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని ఢిల్లీకి వచ్చి వేడుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం మీద అవగాహన లేని కొంతమంది చేసే ఫిర్యాదులతో తనకు ఏమీ కాదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధి గొంతును నొక్కే ప్రయత్నం చేయవద్దని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

వ్యాధితో కొందరు.. భయంతో మరికొందరు

ప్రాణాలు హరిస్తున్న కరోనా ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కరోనా ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ వ్యాధి పై జరుగుతున్న ప్రచారంతో ఇదో భయంకరమైన రోగంగా భావిస్తూ కరోనా పాజిటివ్ అని తెలియగానే కొందరు భయంతోనే చనిపోతున్నారు. కరోనా సోకి ఉంటుందని అనుమానించిన మామిడాల రాజా వెంకటరమణ (54) ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల విద్యాశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఆయన కరోనా భయంతో ప్రాణాలు తీసుకున్నాడు. కరోనా భయంతో ఎయిర్‌‌‌‌లైన్స్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌‌‌‌కాలనీలో ఎల్లారెడ్డి గూడకు చెందిన నాగేంద్ర (75) ఇండియన్ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌లో పనిచేసి రిటైర్ ‌‌‌‌అయ్యారు. జర్వం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న నాగేంద్రను కుటుంబసభ్యులు బుధవారం చెస్ట్ ‌‌హాస్పిటల్‌‌కి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం శ్రీనగర్‌‌‌‌కాలనీలోని ప్రైవేట్ హాస్పిటల్‌‌లో అడ్మిట్‌‌చేశారు. తనకు కరోనా సోకిందనే భయంతో  హాస్పిటల్ బిల్డింగ్‌‌ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వ్యాధి వచ్చిందని తెలిసిన క్షణంలోనే గుండెపోటుతో ఓ రిటైర్డ్ ‌‌ప్రభుత్వ ఉద్యోగి మృతిచెందారు. ములుగు జిల్లా ఏటూరు నాగారానికి చెందిన భాస్కర్‌‌‌‌(65) జ్వరం రాగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. వరంగల్ వెళ్ళాలని డాక్టర్ సూచించడంతో  వరంగల్ లోని ఎంజీఎంకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. రిపోర్ట్స్ మూడు రోజుల్లో వస్తాయని డాక్టర్లు చెప్పడంతో అక్కడే ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లారు. ఈ నెల 22న సాయంత్రం భాస్కర్‌‌‌‌కు పాజిటివ్ ‌‌వచ్చిందని ట్రీట్మెంట్ కోసం ఎంజీఎం ఆసుపత్రికి రావాలని చెప్పడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబసభ్యులు ఎంజీఎం తీసుకెళ్ల‌గా పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్లు చెప్పారు. భయం వద్దు... తాజా లెక్కలను చూస్తే కరోనా బారిన పడుతున్నవారి కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటుంది. రికవరీ రేటు పెరుగుతోంది. మిగతా జబ్బుల మాదిరిగానే ఇది వైరస్ కారణంగా వచ్చే ఒక వ్యాధి మాత్రమే. అయితే ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించే ఈ వ్యాధి కారక వైరస్ ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కొద్దిగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అయితే రెండు నుంచి మూడు వారాల పాటు సరైన జాగ్రత్తలు తీసుకుంటూ.. శరీరంలో ఆక్సిజన్ స్థాయిని గమనిస్తూ డాక్టర్ సలహాల ప్రకారం మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. భయం అన్నది లేకుండా చికిత్స తీసుకుంటే చాలు.

తిరుమలలో తగ్గిన రద్దీ

గురుడసేవ ఆలయం మండపంలోనే ఎప్పుడు రద్దీగా ఉంటూ నమో వెంకటేశాయ అంటూ ప్రతిధ్వనించే ఏడు కొండలు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో నిశబ్ధంగా మారాయి. లాక్ డౌన్ ఎత్తేసి ఆలయాల్లోకి భక్తులను అనుమతించిన తర్వాత శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య కొంత పెరిగినా.. టీటీడి ఉద్యోగులకు, అర్చకులకు కరోనా రావడంతో మళ్ళీ భక్తుల తాకిడి తగ్గింది. రోజూ లక్షలాది మంది సందర్శించుకునే తిరుమలలో వేల సంఖ్యలోనే దర్శనాలు అవుతున్నాయి. కరోనా కారణంగా దర్శనం టికెట్లను ఇవ్వడం లేదు. కేవలం ఆన్ లైన్లో గతంలో బుక్ చేసుకున్నవారిలో చాలామంది తమ దర్శనం టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే  ఆలయంలో జరగాల్సిన చాలా సేవలను రద్దు చేశారు. ప్రతి ఏటా గరుడ పంచమి రోజు గరుడ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగే స్వామి సేవను ఈ ఏడాది రంగనాయకుల మండపం వరకే పరిమిత చేస్తున్నారు.

నిమ్మగడ్డ కేసులో జగన్ సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో షాక్

ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు ఈ రోజు నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మీరు అమలు చేయాల్సిందేనంటూ జగన్ ప్రభుత్వాన్నిఈ సందర్భంగా ఆదేశించింది.  ఈ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు పై సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కేసులో వాదనల సందర్బంగా "అసలు ఏపీ లో ఏం జరుగుతోంది..?" అంటూ సుప్రీం కోర్టు పలుమార్లు వ్యాఖ్యానించింది. అసలు గవర్నర్ ఆదేశాలు ఇచ్చినా మీరు ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గవర్నర్ మీకు సలహాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? అని ఏపీ సర్కార్‌పై సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. వచ్చే శుక్రవారంలోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సుప్రీం కోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా జడ్జీలను, జడ్జిమెంట్‌లను ఎటాక్ చేస్తున్నారని నిమ్మగడ్డ తరుఫు లాయర్ చెప్పటంతో ఆ క్లిప్పింగ్స్ తమకు కూడా ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆయనను కోరింది.  నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సీఎస్ కు లేఖ పంపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ తీర్పు కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఉందని... ఆ తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని, ఒక రాజ్యాంగ పదవి కోరుతున్న వ్యక్తి సుప్రీం తీర్పు వచ్చే వరకు ఆగలేరా అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎలా అడుగు ముందుకు వేస్తుందో వేచి చూడాలి.

వర్షాకాలంలో వజ్రాల వేట

రాయలసీమలో విలువైన రాళ్ల కోసం రైతుల వెదుకులాట రతనాల సీమగా పెరుగాంచిన రాయలసీమలో వర్షాకాలం వచ్చిందంటే చాలు వజ్రాల వేట మొదలౌతుంది. తొలకరి చినుకులు పడగానే పొలాల వెంట పిల్లా పెద్ద అంతా విలువైన రాళ్ల కోసం వెదుకులాట ప్రారంభిస్తారు. అప్పడప్పుడు వారి అన్వేషణ ఫలించి వజ్రాలు దొరుకుతుంటాయి. ఎక్కువగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నెలల పాటు వేట కొనసాగుతుంది.  తాజాగా కర్నూలు జిల్లాలో ఓ రైతుకు వజ్రం లభించింది. మద్దికెర మండలం పెరవలిలో దొరికిన ఈ వజ్రం బరువు 2 క్యారెట్లు. గతంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికీ రెండు వజ్రాలు దొరికాయి.  ప్రతి ఏడాది వర్షాకాలంలో సాగే ఈ వజ్రాల, విలువైన రాళ్ల వేట రాయలసీమ ప్రాంతంలో మాములే. అయితే లక్షలాది రూపాయల విలువ చేసే ఈ వజ్రాలను రైతుల, స్థానిక ప్రజల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటి విలువ గురించి తెలిసిన వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కేటీఆర్ ను బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్న ప్రముఖులు

ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ను అటు రాజకీయ ప్రముఖులు, ఇటు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా " మై డియర్‌ బ్రదర్ తారక్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను" అంటూ ఏపీ సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా విషెస్ అందించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ "పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ బ్రదర్‌ శ్రీ కేటీఆర్.. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని చిల్కూరు బాలాజీని ప్రార్థిస్తున్నాను" శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కేటీఆర్ తో వేదిక పంచుకున్న శ్రీమంతుడు మహేశ్ బాబు "హ్యాపీ బర్త్‌ డే కేటీఆర్.. అందరికీ స్ఫూర్తివంతమైన మీ నాయకత్వం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను" అని ట్విట్టర్ ద్వారా తన సందేశం పంపారు. వీరితో పాటు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బాల్క సుమన్ తన ట్విట్టర్ లో "పేదింటికి చిరునవ్వు.. నేతన్న కంటిచూపు.. భాగ్యనగరం బాద్షా.. ఐటీ సూటేసిన.. రాజనీతి రాకెట్టు.. అదరక బెదరక విశ్వవేదికలపై తెలంగాణ వాడిని వేడిని చాటిన ఉద్యమసేనాని.. తండ్రికి తగ్గ తనయుడు..  సిరిసిల్ల శ్రీమంతుడు.. అన్న కల్వకుంట్ల తారకరాముడికి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు.