ఎంపీ విజయ్ సాయి రెడ్డికి కరోనా.. హైదరాబాద్ అపోలోలో ట్రీట్ మెంట్

వైసీపీ లో ముఖ్య నేత ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొద్ది రోజుల క్రితం విశాఖలో సంజీవని బస్సు ప్రారంభోత్సవంలో భాగంగా అయన టెస్ట్ చేయించుకోగా నెగిటివ్ వచ్చింది. ఐతే గత కొద్దీ రోజులుగా స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో మళ్ళీ టెస్ట్ చేయించుకోగా నిన్న పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఉత్తమ చికిత్స కోసం అయన జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇదే సమయంలో అయన పిఏకు కూడా కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. కరోనా సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విజయసాయిరెడ్డి విస్తృతంగా పర్యటించారు. అటు సీఎం జగన్ తో సహా పలువురు వైసీపీ ముఖ్య నేతలతో అయన సమావేశాలు నిర్వహించారు. ఐతే కొన్ని సందర్భాల్లో విజయసాయిరెడ్డి మాస్క్‌ కూడా ధరించలేదు. వారం పది రోజల పాటు క్వారంటైన్‌లో తాను ఉండనున్నట్లు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు. అత్యవసరమైతేనే ఫోన్‌లో అందుబాటులోకి వస్తానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా కరోనా సోకినా ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్య నేతలందరూ ఇతర రాష్ట్రాలలో చికిత్స తీసుకోవడం ఇపుడు విమర్శలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో కరోనా చికిత్సకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పుకుంటున్న వైసిపి నేతలు ఇలా పొరుగు రాష్ట్రాలలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ట్రీట్ మెంట్ తీసుకోవడం ప్రజలను ఆశ్చర్యానికి ఆందోళనకు గురి చేస్తోంది.

వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త మృతి

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త, మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి నాగభూషణరావు మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే భర్త మరణంతో కుటుంబంతో పాటు పాతపట్నం నియోజకవర్గంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. నాగభూషణరావు ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా దేశంలో పలు కీలక బాధ్యతలు చేపట్టారు. గోవా ఫారెస్ట్ కంజ‌ర్వేటర్‌గా, డామ‌న్ డ‌య్యూ టూరిజం డైర‌క్ట‌ర్‌ గా, ప‌ర్యావ‌ర‌ణం, కాలుష్యం, అడ‌వులు, ఇంద‌న‌వ‌న‌రుల‌ శాఖ‌ల‌కు సంబంధించిన ప‌లు విభాగాల్లో ప‌ని చేశారు. ప‌లువురు కేంద్ర మంత్రుల వ‌ద్ద ఓఎస్‌డీగా కూడా విధులు నిర్వర్తించారు. పార్ల‌మెంట్ డిప్యూటీ స్పీక‌ర్ వ‌ద్ద ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీగా చేస్తూ స్వ‌చ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ చేశారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి భర్త నాగభూషణరావు మృతిపట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రెడ్డిశాంతికి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం

కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కొన్నేందుకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ తొలిదశ విజయవంతమైంది. దేశంలోని 12 కేంద్రాల్లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. హైదరాబాద్ లోని నిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ఇద్దరు వ్యక్తులకు వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిద్దరినీ రెండు రోజుల పాటు ఐసియులో ఉంచి వారి ఆరోగ్య పరిస్థితిని గమనించారు. రెండు రోజుల డాక్టర్ల పర్యవేక్షణలో వారిలో ఎలాంటి అలెర్జీలు, సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. దాంతో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ లో మొదటి అంకం పూర్తి అయ్యింది. వీరిద్దరినీ ఈ రోజు నిమ్స్ నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపించారు. మరో 12రోజుల పాటు వారి ఆరోగ్యపరిస్థితిని గమనిస్తారు. ఆ తర్వాత రెండో దశ క్లినికల్ ట్రయల్ నిర్వహిస్తారు. తొలి దశలో వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరూ ఆరోగ్యవంతంగా ఉండటంతో మరో 24మందికి ఈ వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం 60మందికి తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వడానికి శాంపిల్స్ సేకరించారు. దేశ వ్యాప్తంగా 12 కేంద్రాల్లో 375మందికి తొలిదశ వ్యాక్సిన్ ఇస్తారు.

ఒక్క వ్యాక్సిన్ సరిపోదు.. సక్సెస్ అయినా లాభం లేదు!!

ప్రపంచం మొత్తం కరోనా తాకిడికి విలవిలలాడుతోంది. ఒక పక్క విపరీతంగా కొత్త కేసులు నమోదవుతుంటే మరో పక్క మరణాలు కూడా జనాలను భయపెడుతున్నాయి. దీంతో కరోనా వ్యాక్సిన్ కోసం మానవాళి మొత్తం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇది ఇలా ఉంటె కరోనా కు వ్యాక్సిన్ కనిపెట్టే దిశగా శాస్త్రవేత్తలు పరుగులు పెడుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ రేసు నడుస్తోంది. ఇప్పటికే వ్యాక్సిన్ తో మూడు దశల ట్రయల్స్ పూర్తయ్యాయని రష్యా ప్రకటించింది. వచ్చే నెల ఆగస్టు లో వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభించవచ్చని తెలిపింది. ఇంకో పక్క ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఆస్ట్రా జెనెకా తో కలిసి తయారుచేస్తున్న వ్యాక్సిన్ తొలిదశ ట్రయల్స్ గ్రాండ్ సక్సెస్ కావడంతో కరోనాకి వ్యాక్సిన్ వచ్చేసినట్లే అని ప్రపంచం భావిస్తోంది. మిగిలిన రెండు ట్రయల్స్‌లో కూడా విజయవంతం అయితే దీంతో కరోనాకి చెక్ పెట్టినట్లేనని భావిస్తున్నారు. ఇక ఇదే విషయంలో ఇండియాకి చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తాము కూడా ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తో భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు కోరుతున్నామనీ... ఓ వారంలో ట్రయల్స్ ప్రారంభిస్తామని చెబుతోంది. దాదాపు ప్రపంచం మొత్తం లో దాదాపు 150 వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నట్లు సమాచారం. ఐతే వీటిలో కొన్నైనా సక్సెస్ కావాలని పరిశోధకులు కోరుతున్నారు. ఎందుకంటే ఒక్కటే వ్యాక్సిన్ సక్సెస్ ఐతే.. దాన్నే ఉత్పత్తి చెయ్యడం వల్ల అది ప్రపంచం మొత్తానికీ చేరడానికి చాలా టైమ్ పడుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఒకేసమయంలో వేర్వేరు వ్యాక్సిన్లు కనుక తయారైతే కరోనా నుండి త్వరగా బయట పడవచ్చంటున్నారు.

ఏపీలో ఒక్కరోజులో 62 కరోనా మరణాలు

ఏపీలో కరోనా కేసులు, మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో 37,162 శాంపిల్స్ ని పరీక్షించగా.. 4,944 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో రికార్డు స్థాయిలో 62 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 58,668కి చేరగా.. కరోనా మరణాల సంఖ్య 758కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 32,336 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన 4,944 కరోనా పాజిటివ్ కేసులలో అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 623 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి తర్వాత అత్యధికంగా గుంటూరు జిల్లాలో 577 కేసులు నమోదయ్యాయి. గుంటూరు తర్వాత చిత్తూరు జిల్లాలో 560, తూర్పు గోదావరి జిల్లాలో 524, కర్నూలు జిల్లాలో 515, అనంతపురం జిల్లాలో 458, కృష్ణా జిల్లాలో 424, కడప జిల్లాలో 322, విశాఖపట్నం జిల్లాలో 230, విజయనగరం జిల్లాలో 210, నెల్లూరు జిల్లాలో 197, ప్రకాశం జిల్లాలో 171, శ్రీకాకుళం జిల్లాలో 133 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీలో దారుణ ఘటన.. పోలీస్ స్టేషన్‌లో దళిత యువకుడికి శిరోముండనం!

తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌ లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసి, తీవ్రంగా కొట్టారు. జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌ లో ఈ ఘోరం జరిగింది.  సీతానగరం పోలీస్ స్టేషన్‌ లో దళిత యువకుడు వరప్రసాద్​ ని కొట్టి మీసాలు, జుట్టు కత్తిరించారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకే తనపై ఇలా దాడి చేశారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఇసుక లారీలను ఆపిన సమయంలో ముని కూడలి వద్ద వైసీపీ నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీ కొట్టినట్లు బాధితుడు పేర్కొన్నాడు. దీనిపై ప్రశ్నించినందుకు తిరిగి తనపైనే వైసీపీ నాయకుడి అనుచరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని బాధితుడు వాపోయాడు. దీంతో పోలీసులు తనపై కేసు నమోదు చేశారని, అనంతరం సీతానగరం పోలీస్‌ స్టేషన్‌కు తరలించి తీవ్రంగా కొట్టి శిరోముండనం చేశారని ఆరోపించాడు. కాగా, గాయపడ్డ బాధితుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టాయి. జరిగిన ఘటనపై కోరుకొండ డీఎస్పీ విచారణ చేపట్టారు. వెదుళ్లపల్లిలో బాధితుడు వరప్రసాద్‌ ఇంటికి వెళ్లి విచారించారు. సీతానగరం ఎస్సైతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేశారు.

ఎన్టీఆర్ విగ్రహం టచ్ చేయాలంటే వణుకు పుట్టాలి

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని చెబుతున్న సీఎం వైఎస్ జగన్ ఇంతవరకు మాస్క్ ధరించలేదని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటివరకు మాస్క్ ధరించని సీఎం.. ఇతరులు మాస్కు ధరించకపోతే జరిమానా వేస్తా అనడం ఎంతవరకు సమంజసం అని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపీలోని 175 నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జిలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చేతకానితనం వల్ల రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతోందని అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి తరలిపోకుండా పోరాటాలను మరింత ఉధృతం చేయాలి అన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ఏపీనే ఎక్కువ అప్పులు చేసిందని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో న్యాయమూర్తిపై దాడి చేసింది మంత్రి అనుచరులే అని చంద్రబాబు ఆరోపించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర కావలిలో ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, పోలీసులు కలిసి తొలగించారని బీదా రవిచంద్ర వివరించారు. కావాలనే ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారని ఎమ్మెల్సీ చెప్పడంతో చంద్రబాబు ఆగ్రహానికి గురయ్యారు. ఎన్టీఆర్ విగ్రహం తొలగింపు అంశాన్ని సీరియస్‍గా తీసుకోవాలని నెల్లూరు నాయకులకు చంద్రబాబు సూచించారు. ఇకపై ఎన్టీఆర్ విగ్రహాలను టచ్ చేయాలంటే.. వైసీపీ నాయకులకు వణుకు పుట్టేలా మన చర్యలు ఉండాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు.

ఎన్-95 మాస్క్ కరోనాను ఆపలేదు

ఇంట్లో తయారుచేసుకుంటేనే బెటర్ కేంద్ర ఆరోగ్య శాఖ సూచన కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి అది ఎన్-95 మాత్రమే అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు  కవాటం ఉన్న ఆ మాస్క్ లు సురక్షితం కాదు అంటున్నారు కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన వైద్య సేవల డైరెక్టర్‌ జనరల్‌. వైరస్‌ వ్యాప్తిని ఈ మాస్కు అడ్డుకోలేదని, కరోనా పాజిటివ్ వ్యక్తులు వీటిని ఉపయోగించినప్పుడు కవాటం వల్ల వైరస్ బయటకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వైరస్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైన సమయంలో ఈ మాస్క్ వాడటం వల్ల వైరస్‌ ఇరతులకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు. ఆ మేరకు అన్ని రాష్ట్రాల వైద్యవిద్య శాఖ ముఖ్యకార్యదర్శులకు లేఖ రాశారు.  ఇంటి నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని అయితే కవాటం ఉన్న మాస్క్ లు కాకుండా సాధారణ మాస్కులు ధరించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కవాటం ఉంటే.. ఎన్ - 95 కవాటాలున్న మాస్క్  వాతావరణంలో ఉండే గాలిని శుద్ధి చేసి మనకు అందిస్తాయి. అయితే వదిలిన గాలిని మాత్రం శుద్ధి చేయకుండా నేరుగా వాతావరణంలోకి పంపిస్తుంది. కరోనా ఉన్న వ్యక్తులు వీటిని ధరించినప్పుడు వారు వదిలే గాలి ద్వారా వైరస్ వాతావరణంలోకి చేరుతుంది. గాలి ద్వారా కూడా వైరస్ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు స్పష్టం చేసిన తరుణంలో ఈ మాస్క్ ల వాడకంపై చాలా దేశాలు నిషేధం విధించాయి. వదిలేసిన గాలిని నేరుగా వాతావరణంలో కలిపేలా ఉంటే మాస్కులు ధరించి ప్రయోజనం లేదని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. క్లాత్ తో తయారు చేసిన మాస్క్ లను వాడటమే ఆరోగ్యకరమని సూచించింది. కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో లాంటి అమెరికా దేశాలు వీటిని నిషేధించాయి. ఇంట్లో తయారు చేసిన మాస్కులనే వాడాలని మన ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతిరోజూ... ముక్కును, నోరును పూర్తిగా కవర్ చేసేలా క్లాత్ తో కుట్టిన మాస్క్ లు వాడటమే శ్రేయస్కరం. బయటకు వెళ్ళివచ్చిన తర్వాత వేడి నీటిలో కనీసం ఐదు నిమిషాల పాటు నానపెట్టి శుభ్రంగా మాస్క్ ను ఉతకాలి. ఎండలో ఆరవేసిన తర్వాత తిరిగి వాడటం ఆరోగ్యకరం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరు వాడిన మాస్క్ లను మరోకరు వాడవద్దు.

భయపెడుతున్న లెక్కలు.. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానం!!

ఆంధ్రప్రదేశ్‌ లో ప్రభుత్వం చేస్తోన్న అప్పులు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని క్రెడిట్‌ రేటింగ్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన లెక్కలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి 34.6% కి చేరనున్నట్లు ఆ సంస్థ అంచనా వేసింది. ఈ నిష్పత్తి 25% వరకే ఉండాలని 14వ ఆర్థిక సంఘం నిర్దేశించింది. దాంతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, కర్ణాటక వంటి రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తిని 25% పరిధిలోనే ఉంచుకున్నట్లు క్రెడిట్‌ రేటింగ్స్‌ సంస్థ పేర్కొంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే మాత్రం 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన దాని కంటే దాదాపు పది శాతం అధికం ఉంది.క్రెడిట్‌ రేటింగ్స్‌ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం పొరుగు రాష్ట్రమైన తెలంగాణ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తి 21.4% ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ది అంతకంటే 13.2% అధికంగా ఉంది. పెద్ద రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్‌ (28.8%), పశ్చిమ బెంగాల్‌ (33.3%), రాజస్థాన్‌ (33.1%)లతోపాటు కేరళ(30.1%) కంటే ఆంధ్రప్రదేశ్‌ రుణ-జీఎస్‌డీపీ నిష్పత్తే (34.6%) అధికంగా ఉన్నట్లు ఆ సంస్థ వివరించింది.   ఇక, అప్పులపై వడ్డీ చెల్లింపుల భారమూ ఆంధ్రప్రదేశ్‌ పై అధికంగానే ఉంది. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 2021 ఆర్థిక సంవత్సరంలో వడ్డీల కింద 12.6%, రుణ చెల్లింపుల కింద 22.5% ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మొత్తం గ్యారెంటీల పరిమాణం రూ.49,442 కోట్లకు చేరింది. తాజా లెక్కల ప్రకారం అత్యధిక రుణభారం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ 6వ స్థానంలో నిలిచింది. 2020 ఆర్థిక సంవత్సరం నాటికి రాష్ట్రంపై రూ.3,41,270 కోట్ల రుణభారం ఉన్నట్లు క్రెడిట్‌ రేటింగ్స్‌ సంస్థ పేర్కొంది. రుణభారం పరంగా తెలంగాణ రూ.1,68,725 కోట్లతో 14వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.

కరోనా కాలంలో మోడీ సర్కార్ సాధించిన ఆరు ఘనకార్యాలు ఇవే: రాహుల్

చైనా తో సరిహద్దు వివాదం సందర్భంలో బీజేపీ ప్రభుత్వం పై విరుచుకు పడ్డ కాంగ్రస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా మరో సారి సెటైర్లతో దాడి చేసారు. తాజాగా ట్విట్టర్ వేదికగా మోడీ ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఒక పక్క దేశాన్ని క‌రోనా ప‌ట్టి పీడిస్తోంటే.. మోదీ ప్ర‌భుత్వం రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలను కూల్చే ప‌నిలో ప‌డింద‌ని అయన మండిప‌డ్డారు. దీని పై ఫిబ్ర‌వ‌రి నుంచి నెల‌ల‌వారీగా మోదీ ప్ర‌భుత్వం చేసిన ప‌నుల గురించి ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో - న‌మ‌స్తే ట్రంప్ ప్రోగ్రామ్, మార్చిలో - మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూల్చివేత‌, ఏప్రిల్‌లో - కొవ్వొత్తులను వెలిగించడం .. మే నెల‌లో - మోదీ స‌ర్కార్‌ ఆరేళ్ళ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ , జూన్‌లో - బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వ‌ర్చువ‌ల్ ర్యాలీ, జులైలో - రాజ‌స్థాన్ స‌ర్కార్‌ను కూల్చేందుకు కుట్ర.. ఇవీ ఆరు నెల‌లుగా మోదీ ప్ర‌భుత్వం సాధించిన ఘనకార్యాలు అంటూ రాహుల్ తీవ్రంగా విమ‌ర్శించారు. దీంతో దేశ ప్రజలు కరోనాపై పోరాటం చేయడంలో (ఆత్మ‌నిర్భ‌రత్వంతో) తమపై తామే ఆధారపడ్డారు అంటూ సెటైర్ వేశారు.

రాష్ట్రపతిని కలిసిన రఘురామ కృష్ణంరాజు.. ఆయనకంతా తెలుసు!!

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ను కలిసి రెండు లేఖలు అందజేశారు. ఒకటి వ్యక్తిగత భద్రత కోసం కాగా, రెండోది రాజధాని అమరావతి కోసం. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అమరావతితో పాటు, తన వ్యక్తిగత భద్రత గురించి రాష్ట్రపతితో చర్చించానని అన్నారు. రాష్ట్రపతి తనకిచ్చిన సమయంలో ఎక్కువ సేపు రాజధాని అమరావతి గురించే మాట్లాడినట్లు తెలిపారు. ఏపీలో రాజ్యాంగ విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శాసనమండలిలో బిల్లు పాస్ కాకపోతే, ఆ బిల్లుని మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి పంపించారని, కానీ మండలి సెక్రటరీ దాన్ని పక్కన పెట్టారన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. మండలి ఛైర్మన్ నిర్ణయాన్నే సెక్రటరీ ఒప్పుకోకపోవడం ఆ వ్యవస్థకే మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల తర్వాత రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను గవర్నర్‌ కు పంపించారు అన్నారు. గవర్నర్ కూడా అటార్నీ జనరల్‌ తో చర్చించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతే కొనసాగాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. ప్రజలంతా అమరావతే రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ విధంగానే రాష్ట్రపతికి విన్నవించానని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ కులాన్నైతే ద్వేషిస్తుందో.. ఆ కులం వారికంటే ఎస్సీ, ఎస్టీ వాళ్లే ఎక్కువగా రాజధాని కోసం భూములిచ్చారని తెలిపారు. కనుక వాళ్ల కోసమైనా అమరావతిని కొనసాగించాలని అన్నారు. పోరాడి అమరావతే రాజధానిగా ఉండేలా కృషి చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వం అమరావతి కోసం చాలా ఎక్కువగా డబ్బు ఖర్చు చేసిందన్నారు. అయినా ఇప్పుడు విశాఖలో రాజధాని కట్టడానికి అంత డబ్బు ఎక్కడిది? దీన్ని కూడా ప్రజలు నిలదీయాలి అని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాష్ట్రపతికి ముందే తెలిసినట్టుగా ఉందని రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్పాలనుకున్న సమాచారం అంతా రాష్ట్రపతి దగ్గర ముందే ఉందని తెలిపారు.

వైఎస్సార్ సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే మృతి

తెనాలి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ చౌదరి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని హైదరాబాద్‌ నుంచి తెనాలిలోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా రవీంద్రనాథ్ చౌదరి పేరుపొందారు. ఇద్దరూ ఒకే కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం ఉంది. వైఎస్సార్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చిన రవీంద్రనాథ్.. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి.. తెనాలి మున్సిపల్ చైర్మన్ గా రెండు సార్లు, తెనాలి ఎమ్మెల్యేగా రెండు సార్లు పని చేశారు.

కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో!

పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ ను ఏపీ ప్రభుత్వం సవరించింది. పెట్రోల్ పై రూ. 1.24, డీజిల్‌ పై 93 పైసలు వ్యాట్‌ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ వ్యాట్‌ 2005ను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పెట్రోల్‌ పై 31 శాతం పన్నుతో పాటు రూ.4 అదనపు సుంకం, డీజిల్‌ పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 అదనంగా సుంకం విధించింది. లాక్ డౌన్ కారణంగా ఆదాయం పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ఛార్జీల పెంపుపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. "బాదుడే బాదుడు. కరోనా సమయంలో విద్యుత్ ఛార్జీలు ఘోరంగా పెంచి పేద ప్రజల కష్టాన్ని దోచుకున్నారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఇప్పుడు లీటర్ పెట్రోల్ పై రూ.1.24 పైసలు, డీజిల్ పై 93 పైసలు పెంచేసారు. పెట్రోల్, డీజిల్‍పై అదనపు వ్యాట్‍ను రూ.4కు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే." అని లోకేష్ విమర్శించారు. ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. ధరలు పెంచి మద్యనిషేధం అన్న మేధావి కరోనా కట్టడికి పెట్రోల్ ధరలు పెంచానంటారేమో! అంటూ సీఎం జగన్ పై లోకేష్ వ్యంగాస్త్రం సంధించారు.

ఆన్ లైన్ లో పరిశ్రమలకు అనుమతులు

కొత్తగా ఏర్పాటు కానున్న 12 వేలకు పైగా పరిశ్రమలు.. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు రూ.2,04,000 కోట్లు..  15లక్షల మందికి ఉపాది అవకాశాలు.. ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నింటినీ సంక్షోభంలో నెట్టేసింది కోవిద్ 19 వైరస్. దీన్ని చైనా తయారు చేసిందన్న కారణంగా చాలా బహుళజాతి సంస్థలు తమ కంపెనీలను చైనా నుంచి తొలగిస్తున్నాయి. మానవ వనరులు ఎక్కువగా ఉన్న మనదేశంలో తమ కంపెనీలు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. విదేశీ సంస్థలు ఆకర్షించే ప్రత్యేక ప్యాకేజీలను తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంతో అనేక ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఈ కామర్స్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని తమ ఉత్పత్తులను, సేవలను అందించడానికి ముందుకు వస్తున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా పరిశ్రమల ఏర్పాట్లు, అనుమతులు అన్ని ఆన్ లైన్ లోనే జరుగుతున్నాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి రానున్న కొత్త పరిశ్రమల గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.  అనేక అంతర్జాతీయ సంస్థలు తమ పరిశ్రమలను హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని పనులు ప్రారంభించేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.2,04,000 కోట్ల మేరకు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. 12,425 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. ఇందులో ఎరోస్పేస్, డిఫెన్స్ కు సంబంధీంచిన అంతర్జాతీయ సంస్థలు 20 ఉన్నాయి. అయితే ఎరోస్పేస్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 12 సంస్థలు హైదరాబాదు కేంద్రంగా చేసుకుని ఉత్పత్తులను ప్రారంభించేందుకు సిద్దమైయ్యాయి. అనుమతులు అందుకున్న వాటిలో 370 ఆహార ఉత్పత్తి పరిశ్రమలు, 169ఫార్మా కెమికల్, 165 ప్లాస్టిక్, రబ్బర్,195 ఆగ్రోబేస్, 166 గ్రాంటస్టోన్, 69 పేపర్ ప్రింటిగ్ 63 టెక్స్ టైల్స్ 117 సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. బహుళజాతి సంస్థలు పరిశ్రమలైన ఐకీయా రూ.600క్నోతో ఇప్పటికే పనులు ప్రారంభించింది. రూ.200కోటతో జాండ్ జాన్సన్ పరిశ్రమ గజ్వేల్ లోని ముప్పిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేసింది.  ఈ పరిశ్రమలన్నీ తమ పనులను ప్రారంభిస్తే సుమారు 15 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమలకు అనుమతి కోరుతూ చైనా సంస్థలు కూడా కొన్ని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అయితే అనుమతులు ఇచ్చేముందు ఆయా సంస్థల గురించి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. 

వరవరరావుకు సీరియస్‌.. చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండేలా చూడండి

విప్లవ కవి వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. 81 ఏళ్ల వరవరరావు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పైగా, ఇప్పుడు ఆయనకు కరోనా కూడా సోకడంతో.. ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వరవరరావుకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు లాయర్ సుదీప్ పస్బోలా బాంబే హైకోర్టును కోరారు. వరవరరావు ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, మరికొన్ని రోజులు మాత్రమే ఆయన బతికే అవకాశం ఉందని సుదీప్ అన్నారు. కనీసం చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య ఉండేలా చూడాలని విన్నవించారు. ఈ వయసులో ఆయన విచారణను ప్రభావితం చేసే అవకాశాలు ఏమాత్రం లేవని చెప్పారు. ఈ విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు కూడా భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు.  కాగా, ఆయన ఆరోగ్య పరిస్థితిని తమకు పారదర్శకంగా తెలపాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన భార్య, కూతుర్లు డిమాండ్‌ చేశారు. "వరవరరావు తనకు తానుగా ఏ పనీ చేయలేకపోతున్నారు. ఆయనకు సహకరించడానికి కుటుంబ సభ్యుల్లో ఒకరిని తోడుగా ఉండేలా చూడండి." అని విజ్ఞప్తి చేశారు. ఆయన చికిత్సకు సంబంధించిన వైద్య నివేదికలన్నీ అందుబాటులో ఉంచాలని, బెయిల్‌ తీసుకోవడానికున్న అడ్డంకులన్నీ తొలగించాలని కోరారు. అయితే, కరోనా రోగుల్ని కలిసేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలు అంగీకరించవని ఎన్‌ఐఏ తరపున న్యాయవాది  కోర్టుకు విన్నవించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దీపక్‌ థాకరే వాదనలను వినిపిస్తూ.. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కుటుంబ సభ్యులు వరవరరావును కలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, నిర్దిష్ట దూరం నుంచైనా వరవరరావును కుటుంబసభ్యులు చూసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. బుధవారంలోగా తమకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.

రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితురాలు ఆత్మహత్యాయత్నం

భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో గత 29 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్.. మంగళవారం ఉదయం తమిళనాడులోని వెల్లూరు జైలులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన జైలు అధికారులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆమె లాయర్ పుహళేంది తెలిపారు. అయితే నళిని ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను జైలు అధికారులు సరిగా చెప్పడం లేదని, అసలు నిజాలను వారు కప్పిపుచ్చుతున్నారని లాయర్ ఆరోపించారు. తోటి ఖైదీకి, నళినికి మధ్య జైలులో గొడవ జరిగిందని, గొడవతో కలత చెందిన నళిని ఆత్మహత్యాయత్నం చేసినట్లు జైలు అధికారులు చెబుతున్నారని లాయర్ పేర్కొన్నారు. అయితే ఖైదీల మధ్య ఇలాంటి తగాదాలు సర్వసాధారణమని, ఈ కారణానికి ఆమె ఆత్మహత్యాయత్నం చేసి ఉండకపోవచ్చని లాయర్ అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూ నళిని ఇలా ప్రవర్తించలేదని, ఇందుకు గల అసలు కారణాలు తెలుసుకుంటామన్నారు. దీని వెనుక మరింత దర్యాప్తు అవసరమని లాయర్ సూచించారు. త్వరలోనే ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పుహళేంది వివరించారు.

వ్యాక్సిన్ అతి త్వరలోనే...

ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేస్తుంది. కోట్లాదిమందికి సోకి లక్షలాది మందిని బలితీసుకున్న ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు పలుదేశాల్లో 140పైగా పరిశోధనలు జరుగుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ పరిశోధనల్లో సైంటిస్ట్ లంతా నిమగ్నమయ్యారు. అహోరాత్రులు కష్టపడి చేస్తున్న ఆ పరిశోధనల ఫలితాలు అతి త్వరలోనే మానవాళికి అందుబాటులోకి రానున్నాయి. తొలి వ్యాక్సిన్ సిద్దం చేసిన రష్యా కోవిద్ 19 వైరస్ తో బాగా ప్రభావితమైన రష్యా వ్యాక్సిన్ తయారిలో చాలా చురుగ్గా పరిశోధనలు నిర్వహిస్తోంది. రష్యాప్రభుత్వం వ్యాక్సిన్ తయారీని ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పరిశోధనలను వేగవంతం చేయడానికి కావల్సిన ఏర్పాట్లు చేసింది. 1,2 దశల క్లినికల్ ట్రయల్స్ గతంలోనే పూర్తి చేసిన  సెచెనోవ్ విశ్వవిద్యాలయం ఇప్పుడు మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ను కూడా విజయవంతంగా నిర్వహించింది. అన్ని పరీక్షలు మంచి ఫలితాలను ఇచ్చాయని.. ఆగస్టు 3 నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువస్తామని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటించారు. మూడు కోట్ల డోస్ లను దేశీయంగా తయారు చేస్తామని మరో 17కోట్ల డోస్ లు విదేశాల్లో తయారు చేస్తమని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్ తమతమ దేశాల్లో తయారు చేయడానికి ఐదు దేశాలు ఇప్పటికే అంగీకరం తెలిపాయన్నారు.    త్వరలోనే ఫలితాలు.. కోవిద్ 19 వైరస్ ను ఎదుర్కోనే వ్యాక్సిన్ పై  లండన్ లోని ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రయోగాలు విజయవంతమయ్యాయి.  వారు తయారు చేసిన ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ కోవిద్ 19 వైరస్ తో సమర్థవంతంగా పోరాడగలదని ప్రకటించారు. చాలా సురక్షితమైన తమ వ్యాక్సిన్ వైరస్ను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తి ని ఇస్తుందన్నారు. తమ పరిశోథనల ఫలితాలను ది లాస్సెట్ మెడికల్ జర్నర్ లో ప్రచురించారు. మొదటి దశ, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయని, చివరి దశగా వృద్దులపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్నయన్నారు.  ఈ ఏడాది చివరి వరకు పూర్తి ఫలితాలు వస్తాయన్నారు.  తొలిదశ ప్రారంభం భారత్ లో కోవిద్ 19 వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమైనవి. కాస్త ఆలస్యంగా క్లినికల్ ట్రయల్స్ మొదలైనా.. విజయవంతంగా కొనసాగుతున్నాయి.  దేశంలోని భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ ఫస్ట్ డోస్ 12 చోట్ల 60మంది వాలంటీర్లపై తొలిదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.  హైదరాబాద్ లోని నిమ్స్ లో ఇద్దరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్  ఇచ్చారు. 14రోజుల తర్వాత ఫలితాలు వస్తాయి. 

అంతర్గత రాజకీయాలతో అట్టుడుకుతున్న తిరుమల.. డాలర్ శేషాద్రికి కరోనా అంటూ ట్వీట్

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల అంతర్గత రాజకీయాలతో అట్టుడుకుతోంది. కరోనా కాలంలోనూ కొందరు శ్రీవారి చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అక్కడి ప్రముఖులు కొందరు వ్యవహరిస్తున్న తీరు విమర్శలపాలవుతోంది.  తాజాగా తిరుమల ఓఎస్డీ డాలర్ శేషాద్రి ఆరోగ్యంపై వదంతులు పుట్టిస్తున్న ఎస్వీ బద్రిపై పోలీసులకు టీటీడీ ఫిర్యాదు చేసింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే, ఈ ఎస్వీ బద్రి తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకి ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ఇటీవల రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా దర్శనాలు నిలిపివేయాలని సీఎం జగన్ ని కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇప్పటికీ తిరుమలలో మాజీ సీఎం చంద్రబాబు హవానే నడుస్తోంది అన్నట్లుగా సంచలన వ్యాక్యాలు చేశారు. దీంతో, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియా సాక్షిగా మీరు రాజకీయాలు చేయడం తగదంటూ రమణ దీక్షితులకు సూచించారు. ఇదిలా ఉంటే, రమణ దీక్షితులు అనుచరుడు ఎస్వీ బద్రి.. తిరుమల ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కరోనా పాజిటివ్‌ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. డాలర్‌ శేషాద్రికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని, చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు పెట్టారు. అంతేకాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ లను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేయడం కలకలం రేపింది. 'డాలర్ శేషాద్రికి కరోనా పాజిటివ్ అని నాకు తెలిసింది. ఇది నిజమేనా? కరోనా నేపథ్యంలో కైంకర్యాలన్నీ ఏకాంతంలోనే నిర్వహించాలనే ఒక మంచి సలహాను జగన్, వైవీ సుబ్బారెడ్డి ఎందుకు వినడం లేదు?.. కరోనా బారిన పడిన జీయంగార్లు ఎలా ఉన్నారు? తక్షణమే సరైన చర్యలు తీసుకోండి లేదా కర్మ ఫలితాలను ఎదుర్కోండి' అంటూ బద్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై డాలర్ శేషాద్రి తీవ్రంగా ప్రతిస్పందించారు. తనకు ఇప్పటి వరకు మూడుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించారని.. అన్ని పరీక్షల్లోనూ నెగెటివ్ అని తేలిందని చెప్పారు. అయినప్పటికీ తనను మానసికంగా వేధించేలా బద్రి ట్వీట్లు చేస్తున్నారని అన్నారు. బద్రి ట్వీట్లతో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. మరోపైపు ఎపిడెమిక్ చట్టం కింద బద్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన టీటీడీకి ఫిర్యాదు చేశారు. డాలర్ శేషాద్రి ఫిర్యాదుతో పోలీసులకు బద్రిపై టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బద్రిపై కేసు నమోదు చేశారు.