వర్షాకాలంలో వజ్రాల వేట
posted on Jul 24, 2020 @ 1:02PM
రాయలసీమలో విలువైన రాళ్ల కోసం రైతుల వెదుకులాట
రతనాల సీమగా పెరుగాంచిన రాయలసీమలో వర్షాకాలం వచ్చిందంటే చాలు వజ్రాల వేట మొదలౌతుంది. తొలకరి చినుకులు పడగానే పొలాల వెంట పిల్లా పెద్ద అంతా విలువైన రాళ్ల కోసం వెదుకులాట ప్రారంభిస్తారు. అప్పడప్పుడు వారి అన్వేషణ ఫలించి వజ్రాలు దొరుకుతుంటాయి. ఎక్కువగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో నెలల పాటు వేట కొనసాగుతుంది.
తాజాగా కర్నూలు జిల్లాలో ఓ రైతుకు వజ్రం లభించింది. మద్దికెర మండలం పెరవలిలో దొరికిన ఈ వజ్రం బరువు 2 క్యారెట్లు. గతంలో కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె పొలాల్లో ఇద్దరికీ రెండు వజ్రాలు దొరికాయి.
ప్రతి ఏడాది వర్షాకాలంలో సాగే ఈ వజ్రాల, విలువైన రాళ్ల వేట రాయలసీమ ప్రాంతంలో మాములే. అయితే లక్షలాది రూపాయల విలువ చేసే ఈ వజ్రాలను రైతుల, స్థానిక ప్రజల నుంచి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వీటి విలువ గురించి తెలిసిన వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.