కరోనా కట్టడికి వినూత్న పంథాలు
posted on Jul 25, 2020 @ 10:37AM
బెదిరించో.. బుజ్జగించో వ్యాప్తిని నివారించే ప్రయత్నం
ఒక్కరితో మొదలై కోట్లాది మందికి సోకిన కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వాలు పడరాని పాట్లు పడుతున్నాయి. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో వైరస్ వ్యాప్తిని నివారించే అవకాశం ఉండటంతో ప్రజల్లో అవగాహన కోసం నానా ఆగచాట్లు పడుతున్నారు. ప్రజలకు నచ్చచెప్పడానికి కొన్నిచోట్ల ప్రభుత్వాలు భారీ ఫైన్లు, జైలు శిక్షలతో బెదిరిస్తుంటే మరికొన్నిచోట్ల బహుమతులు ఇస్తామంటూ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. జివ్వకో రుచి అన్నట్టు.. ఎవరికి తోచిన విధంగా వారు చేస్తున్నారు. చివరి అందరి అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే సామబేధదానదండోపాయలను ప్రయోగించైనా సరే కరోనాను కట్టడి చేయడం..
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా జార్ఖండ్ ప్రభుత్వం మాస్క్ లేకుండా బయటకు వస్తే లక్ష రూపాయల ఫైన్.. రెండేళ్ల జైలు శిక్ష అంటూ కీలక ప్రకటన చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఇన్ఫెక్షియస్ డిసీస్ ఆర్డినెన్స్ -2020’ని తీసుకొచ్చింది.
వైద్య పరీక్షలతో కరోనా వ్యాప్తిని నివారించాలన్న ఆలోచనతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రజలకు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. కరోనా వైరస్ టెస్ట్ లు చేయించుకున్నవారికి 300 డాలర్లు మన కరెన్సీ ప్రకారం రూ.25వేలు, పాజిటీవ్ వచ్చినవారికి 1500 డాలర్లు (లక్షా 11వేల రూపాయాలు) చెల్లిస్తామని ప్రకటించింది. ఆస్టేలియా విక్టోరియా రాష్ట్రంలో రెండు వారాల వ్యవధిలోనే 3,800 మందికి పైగా కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు విక్టోరియా సీఎం డేనియల్ ఆండ్రూస్ ఈ ప్రకటన చేశారు. ఈ బహుమతి పొందడానికి కొన్ని షరతులు కూడా విధించారు. ఉద్యోగస్తులకు మాత్రమే ఈ అవకాశం. అంతేకాదు గతంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని ఉద్యోగులు ఇందుకు అర్హులు.