సెప్టెంబర్ చివరికి మన దేశంలో కోటి కేసులు.. అంచనాలకు తగ్గట్టుగానే వైరస్ వ్యాప్తి
posted on Jul 25, 2020 @ 9:56AM
చైనాలో కరోనా వైరస్ మొదలైన కొత్తలో.. ఈ వైరస్ భారత్ లోకి ఎంటర్ ఐతే వ్యాప్తిని నిరోధిందడం కష్టమనే అభిప్రాయం అటు దేశంలోను ఇటు ప్రపంచ దేశాల నుండి వినిపించింది. ఐతే ఫిబ్రవరిలో ఇండియాలో వైరస్ ప్రవేశించినా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పాటు మొదట్లో దాని తీవ్రత అంతగా లేకపోవడంతో భారత్‌కి కరోనా ముప్పు తక్కువే అని అందరు భావించారు. ఐతే అధ్యయన సంస్థలు మాత్రం ఇండియాలో కరోనా వైరస్ ఎంటర్ ఐతే అది ఏ స్థాయిలో వ్యాపిస్తుందో కొన్ని అంచనాలు వేశాయి. ఐతే లాక్‌డౌన్ ఎత్తివేశాక కరోనా వైరస్ వ్యాప్తి పెరిగింది. మే, జూన్ నెలల లో కేసుల సంఖ్య పెరుగుతూ పోయాయి. ఇక జులైలో అది మరింత ఎక్కువై ప్రతి రోజూ 50 వేల వరకు కేసులు నమోదవుతున్నాయి. మన దేశం లో పాజిటివ్ కేసుల సంఖ్య 1000 నుంచి లక్షకు చేరడానికి 51 రోజుల సమయం పట్టింది. అదే ఒక లక్ష నుంచి 10 లక్షలు చేరడానికి 59 రోజుల సమయమే తీసుకుంది. ఇక ముందు పెరిగే కేసుల సంఖ్య కు పట్టే సమయము తగ్గుతూ పోతోంది. దీంతో వచ్చే ఆగస్ట్‌లో మరింత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెపుతున్నారు.
చెన్నై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్‌పరిశోధకులు జూన్‌లో వేసిన అంచనాల ప్రకారం జులై చివరికి 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావచ్చని పేర్కొన్నారు. ఐతే జూలై 16 నాటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అంతే కాకుండా వ్యాక్సిన్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుత అంచనా ప్రకారం 2021 నాటికి భారత్‌లో రోజుకు 2.87 లక్షల కొత్త కేసులు వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం సెప్టెంబరు 22 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య ఒక కోటి దాటుతుంది. దీనిని బట్టి 60 రోజుల తర్వాత కేసుల సంఖ్య కోటి కి చేరుతుందంటే వచ్చే రెండు నెలల్లో కొత్తగా వచ్చే కేసులు 89 లక్షలు.
ప్రస్తుతం మన దేశంలో కరోనా రికవరీ రేటు 63.5 శాతంగా ఉంది. అంతే కాకుండా కరోనా వచ్చిన వారిలో 90 శాతానికి పైగా కోలుకుంటున్నారు. అదే విధంగా ప్రపంచ దేశాల తో పోలిస్తే మన దగ్గర మరణాల రేటు తక్కువగా 2.4 శాతంగా ఉంది. ఐతే మనం అన్ని జాగ్రత్తలూ పాటిస్తే.. చుట్టూ ఎన్ని పాజిటివ్ కేసులు ఉన్నా వైరస్ దరిచేరకుడా చేసుకోవచ్చు. కానీ ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా.. వైరస్ కబళించే ప్రమాదం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఇదే సమయంలో ప్రభుత్వాలు కూడా టెస్టుల సంఖ్యను పెంచడంతో పాటు సమస్య తీవ్రంగా ఉన్న పేషెంట్లను గుర్తించి వెంటనే వారికి అత్యవసర చికిత్స అందించాలని నిపుణులు కోరుతున్నారు.