అధికారుల అత్యుత్సాహం.. డోర్ల‌కు ఇనుప‌ రేకులు పెట్టి మేకులు కొట్టారు

క‌రోనా నియంత్ర‌ణ పేరుతో బెంగ‌ళూరులో అధికారులు అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. క‌రోనా సోకిన వారుండే ప్ర‌దేశాల‌ను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్ర‌క‌టించి జ‌న‌సంచారాన్ని క‌ట్ట‌డి చేయ‌డం చూస్తున్నాం. అయితే, బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక సిబ్బంది మాత్రం బాధితుల‌పై క‌క్ష‌గట్టిన‌ట్టు ప్రవర్తించారు. క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయిన‌ వారు ఉన్నార‌నే కార‌ణంతో ఓ బిల్డింగ్‌ లో ఉన్న ఇళ్ల డోర్ల‌న్నింటికీ ఇనుప రేకులు అడ్డుగా పెట్టి మేకులు కొట్టారు. దీంతో ఆ బిల్డింగ్‌లో ఉన్న‌ కుటుంబాలు ఆందోళ‌న చెందాయి. ఇళ్ల‌ల్లో చిన్న‌పిల్ల‌లు, వృద్ధులు ఉన్నారు.. ఏదైనా అత్య‌వ‌స‌రం అయితే అప్ప‌టిక‌ప్పుడు వారిని ఆస్ప‌త్రికి ఎలా త‌ర‌లించాల‌ని ఆవేదన వ్యక్తం చేశారు. పొరపాటున అగ్ని ప్రమాదం లాంటివి సంభవిస్తే పరిస్థితి ఏంటని, దీనిపై అధికారులు వెంట‌నే  స్పందించాలంటూ ఆ బిల్డింగ్‌లో ఉండే ఓ వ్య‌క్తి ట్వీట్ చేశాడు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా, ఈ ఘ‌ట‌న‌పై బెంగ‌ళూరు మ‌హాన‌గ‌ర పాలిక క‌మిష‌న‌ర్ ఎన్ మంజునాథ ప్ర‌సాద్ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. క‌రోనా బాధితుల ఇళ్ల త‌లుపుల‌కు అడ్డంగా పెట్టిన రేకులను వెంట‌నే తొల‌గించాల‌ని సిబ్బందిని ఆదేశించిన‌ట్టు తెలిపారు. వైర‌స్ సోకిన వారిని కాపాడ‌టం, సోక‌ని వారిని సేఫ్‌ గా ఉంచే ఉద్దేశ్యంతోనే త‌మ సిబ్బంది అలా చేసార‌ని చెప్పుకొచ్చారు. బాధితులంద‌రిని తాము ఒకే ర‌కంగా గౌర‌విస్తామ‌ని స్పష్టం చేశారు.

గువాహటి సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలకు కరోనా

అసోం రాజధాని గువాహటిలోని సెంట్రల్ జైలులో 435 మంది ఖైదీలు కరోనా బారినపడ్డారు. ఇది జైలులోని మొత్తం ఖైదీల సంఖ్యలో 44 శాతం కావడం గమనార్హం. రాష్ట్రంలోని 10 జైళ్లలో 535 మంది ఖైదీలకు, గువాహటి జైలులో 435 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకినట్లు అసోం జైళ్ల శాఖ డీజీ దశరథదాస్ తెలిపారు. గువాహటి జైలులో ఖైదీల కోసం 200 పడకలతో కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే, లక్షణాలు లేని ఖైదీలను నాగాం ప్రత్యేక జైలులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. కరోనా నేపథ్యంలో కొంత మంది ఖైదీలను విడుదల చేయాలని  అధికారులు యోచిస్తున్నారు. గువాహటి తోపాటు నల్బరి, ధూబ్రీ, కరీంగంజ్, నార్త్ లఖింపూర్, గోలఘాట్, డిఫూ, ఉడాల్ గురి జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలు ఉన్నారని, దీంతో 376 మంది ఖైదీలను విడుదల చేయాలని అధికారులు యోచిస్తున్నారు. తొలుత అండర్ ట్రయల్ ఖైదీలను విడుదల చేసేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

మానవాళికి శుభవార్త.. మరో అడుగు దూరంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ 

కరోనా వైరస్ ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఇటు సామాన్యులకు అటు ప్రభుత్వాలకు చుక్కలు చూపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థ సంయుక్తంగా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్ తొలి రెండుదశల ట్రయల్స్ నూ విజయవంతంగా పూర్తి చేసుకోవడం తో ప్రపంచ మానవాళి ఆనందం లో ఉంది. గత ఏప్రిల్ నెల లో వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కాగా, మొదటి రెండు దశల ట్రయల్స్ ఫలితాలు రెండు వారాల క్రితం విడుదల అయ్యాయి. తాజాగా మూడవ దశ ట్రయల్స్ జరుగుతుండగా, అవి కూడా విజయవంతం అవుతున్నట్టుగా తెలుస్తోంది. మూడవ దశలో పెద్దఎత్తున వాలంటీర్లను సెలెక్ట్ చేసుకుని వారికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఐతే ముందుగా అందుతున్న ప్రాథమిక ఫలితాల ప్రకారం, ఆ వాలంటీర్ల శరీరంలో కరోనాను ఎదుర్కొనే నిరోధక శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ఫేజ్ 3 లో వచ్చిన డేటా పరిశీలించి దాని ఆధారంగా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ తయారీకి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రపంచానికి తాము హామీ ఇచ్చిన విధంగా బిలియన్ డోస్ లను అందించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెపుతోంది. ఈ వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా మార్కెట్లోకి అందించాలని కృషి చేస్తోంది. ఐతే ఈ వైరస్ కొన్ని సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వదిలి పెట్టకపోవచ్చని ఆరోగ్య రంగంలోని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ త్వరలోనే మార్కెట్లోకి రావాలని మానవాళి మొత్తం కోరుకుంటోంది.

కల్వకుంట్ల కవిత డ్రైవర్ కు కరోనా.. ప్రస్తుతం ఆమె హోమ్ ఐసోలేషన్

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత తగ్గడం లేదు. కామన్ మ్యాన్ నుండి వీఐపీల వరకు అందరిని చుట్టేస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మొహమ్మద్ అలీ సహా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఈ మహమ్మారి బారినపడ్డారు. తాజాగా, నిజామాబాద్ మాజీ ఎంపీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కారు డ్రైవర్ కు కరోనా సోకడంతో ఆమె కూడా హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. ఇది ఇలా ఉండగా తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిన్న 50 వేల మార్కును దాటేసాయి. అదే సమయంలో, ఇప్పటి వరకు 447 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,052 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కేటీఆర్ పుట్టినరోజుకు డైరెక్టర్ బందూక్ లక్ష్మణ్ వినూత్న కానుక

తెలంగాణ రాష్ట్ర మంత్రి కె. తారకరామారావు పుట్టినరోజు సందర్భంగా బందూక్ సినిమా డైరెక్టర్ లక్ష్మణ్ వినూత్న బహుమతి సిద్ధం చేశారు. కెటీఆర్ జన్మదినమైన 24.07.76 రోజుతో కూడిన కరెన్షీ నోట్లని సేకరించి ఈ 2020 జూలై 24న కేటీఆర్ 44వ పుట్టినరోజున అందజేస్తున్నట్టు తెలిపారు. రూపాయి నోటు, ఐదురూపాయల నోటు, పదిరూపాయలనోటు, ఇరవైరూపాయల నోటు, యాబై రూపాయల నోటు, వంద రూపాయలు అలాగే రెండువందల రూపాయల నోట్ల వరకూ 24.07.76 ఒకే నంబర్ గల నోట్లని సేకరించారు. దీంతో పాటు కేటీఆర్ చిన్నతనం నుంచి ఇప్పటివరకు ఫొటోలను సేకరించి వాటిని చింతమడకలోని కేసీఆర్ ఇంటి బ్యాగ్రౌండ్తో అందమైన పోటో ఫ్రేముగా చేసారు. ఈ అరుదైన కానుకని కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అందజేస్తున్నారు.

ఆ ఎంపీ సీటు పై కన్నేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ

తీవ్ర ఆరోపణల కారణంగా ఎస్వీబిసి చైర్మన్ పదవి కోల్పోయిన కమెడియన్ పృథ్వీ తాజాగా నరసాపురం లోకసభ సీటు గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న రఘు రామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు లోకసభ స్పీకర్ ఓంబిర్లాను కోరిన సంగతి తెలిసిందే. ఐతే పృథ్వీ మాత్రం నర్సాపురం సీటుకు ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్నట్లున్నారు. నరసాపురం ఎంపీ సీటుకు ఉప ఎన్నిక వస్తే ఆ సీటు తనదేనని ఆయన అన్నారు. లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సంగతి తెలిపారు. రఘురామకృష్ణమ రాజు విజయం కోసం తాము అహోరాత్రులు కష్టపడి పనిచేశామని, దానివల్లనే ఆయన ఇప్పుడు ఎంపిగా ఉన్నారని పృథ్వీ అన్నారు. ఐతే రఘురామ రాజు పార్టీపై తిరుగుబాటు చేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ఒక వేళ నర్సాపురం నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగితే తాను తప్పకుండా పోటీ చేసి గెలుస్తానని ఆయన అన్నారు. సీఎం జగన్ ను అడిగి తాను టికెట్ తెచ్చుకుంటానని ఆయన చెప్పారు. అయితే, రఘురామకృష్ణమ రాజు వ్యవహారం మాత్రం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసుపై రఘురామ రాజు ఇచ్చిన సమాధానం తో ఒక పక్క వైసిపి పార్టీ కూడా కష్టాలలో పడింది. మరో వైపు అయన వైసీపీలో కొనసాగుతూనే జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలతో చెలరేగిపోతున్నారు.

రాజమండ్రి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక జర్నలిస్ట్ మృతి

ఆక్సిజన్ కొరతతో గాలిలో కలిసిపోతున్న ప్రాణాలు కరోనా బారిన పడిన ప్రజలకు సరైన వైద్యం అందించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంటుంది. సరైన వైద్యం అందడం లేదంటూ ఆసుపత్రి నుంచి మరీ రిపోర్టింగ్ చేసి చెప్పిన జర్నలిస్ట్ మనోజ్ సంఘటన మరవకముందే మరో జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో మరో సీనియర్ జర్నలిస్ట్ రాము ఆక్సిజన్ అందక మరణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ లో టీవీ5 విలేకరిగా పదేళ్ల నుంచి పనిచేస్తున్న రాము(52) వారం రోజులుగా కరోనా బారిన పడ్డాడు. తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో రాజమండ్రి జిల్లా ఆస్పత్రిలో ఆయనను చేర్చారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకావడంతో ఆక్సిజన్ పెట్టాలని పదే పదే స్థానిక జర్నలిస్టులు డాక్టర్లను కోరినా ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలో చేరిన రోగులకు సరిపోయే ఆక్సిజిన్ అందించే పరిస్థితులు లేవని చెప్పారు. ఆసుపత్రిలో అవసరమైన దానిలో 10శాతం కూడా సరఫరా చేయలేకపోయారు. దాంతో ఊపిరి అందక  విలవిల్లాడుతూ రాము తుదిశ్వాస విడిచాడు. ఈ ఆసుపత్రిలో ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని పదేపదే అధికారుల దృష్టికి తీసుకువచ్చే జర్నలిస్టు కూడా ఆక్సిజన్ అందక మరణించడంతో స్థానిక జర్నలిస్టుల్లో విషాదం అలుముకుంది. ఇప్పటికైనా ఆక్సిజన్ అందుబాటులో ఉంచకపోతే కరోనా  రోగులు పిట్టల్లా రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తక్షణం స్పందించాలని కోరుతున్నారు.

షాకింగ్.. ఏపీలో ఒకే రోజు 8 వేల కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఒకేరోజు దాదాపు 8 వేల కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 58,052 మందికి కరోనా పరీక్షలు చేయగా 7,998 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1391 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 1184, అనంతపురం జిల్లాలో 1016 కేసులు, కర్నూలు జిల్లాలో 904 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో 748 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 72,711 చేరింది.  గడిచిన 24 గంటల్లో 61 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 884 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 34,272గా ఉంది.

9 ఏళ్ల బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

నెల్లూరు జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న జరిగింది. బాలికపై ఓ గ్రామ వాలంటీర్ అఘాయిత్యానికి తెగబడ్డాడు. పొదలకూరు మండలం పెదరాజుపాళెంలో 9 ఏళ్ల మైనర్ బాలికపై గ్రామ వాలంటీర్ పవన్‌కళ్యాణ్ అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితురాలి తల్లిదండ్రులు వెంట‌నే ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి చూసి చ‌లించిపోయిన వైద్యులు.. పోలీస్‌ స్టేషన్‌ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి వెళ్లి బాలికను పరిశీలించారు. నిర్భయ చ‌ట్టం కింద కేసు నమోదు చేసి వాలంటీర్ పవన్‌కల్యాణ్‌ ను అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ‌లో క‌రోనా క‌మ్యూనిటి స్ప్రెడ్ మొద‌లైంది

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి స్టేజ్ 3కి చేరుకుంద‌ని, క‌మ్యూనిటి స్ప్రెడ్ అవుతుంద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస‌రావు. వ‌చ్చే నాలుగైదు వారాలు చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని, ప్ర‌జ‌లంతా మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. హైదరాబాదులో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల్లో వైరస్ విస్తరిస్తోందని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని, ల‌క్ష‌ణాలున్న ప్ర‌తీ ఒక్క‌రూ టెస్ట్‌లు చేయించుకోవాల‌ని కోరారు. క‌రోనా ల‌క్ష‌ణాలున్నవారు ఆల‌స్యం చేస్తే ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రించారు. కరోనా విషయంలో వీలైనంత త్వ‌ర‌గా చికిత్స అందిస్తే.. ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు అని శ్రీ‌నివాస‌రావు వెల్ల‌డించారు.  ఇక‌, కరోనా నియంత్రణకు తెలంగాణ రాష్ట్రం రూ.100 కోట్లు కేటాయించింద‌న్న హెల్త్ డైరెక్టర్.. ప్రతీ రోజూ 15 వేల టెస్టులు జరుగుతున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో ప‌రిస్థితులు చాలా బెటర్‌గా ఉన్నాయ‌ని, కరోనా బారిన‌ ప‌డిన‌వాళ్ల‌లో రిక‌వ‌రీ అయ్యేవారి సంఖ్య పెరిగింద‌ని వెల్ల‌డించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 8399 పడకలు ఉన్నాయ‌న్న శ్రీ‌నివాస‌రావు.. ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వెళ్లి, ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌ద్ద‌ని సూచించారు.

బాలయ్యకు వైసీపీ ఎమ్మెల్యే ఫోన్

నెల్లూరు జిల్లాలోని కావలిలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం తొలగింపుపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, జిల్లాకు చెందిన టీడీపీ నేతలు స్పందించి స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డికి బాలయ్య ఫోన్ చేసి.. కావలిలో విగ్రహం పెట్టి తీరాల్సిందేనని.. విగ్రహం ఏర్పాటు చేసేంతవరకూ వెనక్కి తగ్గొద్దని సూచించారు. ఈ విషయంపై బాలయ్య స్థానిక నేతలకు నిత్యం టచ్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం కావలి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బాలయ్యకు ఫోన్ చేసి విగ్రహం వివాదంపై నిశితంగా చర్చించారు. అసలు ఆ విగ్రహాన్ని స్థానికులు ఎందుకు తొలగించాల్సి వచ్చిందో బాలయ్యకు వివరించారు. ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం వీపు భాగం ఆలయం ఎదురుగా ఉన్నందునే స్థానికులు తొలగించారని ఎమ్మెల్యే చెప్పారు. అంతేకాదు, తాను కూడా ఎన్టీఆర్ వీరాభిమానినని చెప్పిన రామిరెడ్డి.. వివాదాస్పదం కాని స్థలంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు బాలయ్య కూడా సానుకూలంగానే స్పందించారని తెలుస్తోంది. మొత్తానికి విగ్రహం తొలగింపుపై గత కొన్ని రోజులుగా నెలకొన్న వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పడిందని చెప్పుకోవచ్చు.

ఆగస్టు 5న రామమందిరానికి భూమి పూజ

హిందువుల ఆరాధ్యదైవం శ్రీరాముడి మందిర నిర్మాణానికి అయోధ్యలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. దశాబ్దాల కాలం పాటు కోర్డులో ఉన్న రామమందిర అంశం ఒక కొలిక్కిరావడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. రామమందిర నిర్మాణానికి ఆగస్టు 5న భూమిపూజ చేయడానికి ముహుర్తం నిర్ణయించారు. మూడు అంతస్తుల్లో 161 అడుగుల ఎత్తులో అయోధ్య రామ మందిరం డిజైన్ రూపొందించారు. ఆగ‌స్టు 5వ తేదీన ఆల‌య నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతారు. దాదాపు 250 మంది ముఖ్య‌మైన నేత‌లు కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. అదే రోజు సాయంత్రం దేశ‌వ్యాప్తంగా ఉన్న హిందువులు త‌మ ఇంటి ముందు దీపాల‌ను వెలిగించాల‌ని ఇప్ప‌టికే విశ్వ హిందూ ప‌రిష‌త్ పిలుపునిచ్చింది. ఆలయ నిర్మాణ స్థలం మొత్తం 67ఎకరాలు కాగా అందులో పది ఎకరాల విస్తీర్ణంలో మూడంతస్తులో ఆలయ నిర్మాణం జరుగుతుంది. మిగతా 57 ఎకరాల స్థలంలో ఆలయ కాంప్లెక్స్ నిర్మిస్తామని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టు ప్రకటించింది. శ్రీ‌రాముడి జీవితంలోని ప‌లు ముఖ్య‌మైన ఘ‌ట్టాల థీమ్‌తో  పార్కును నిర్మిస్తారు. ఆలయ స్థ‌లం తవ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డిన ప‌లు వ‌స్తువుల‌ను సందర్శనకు ఉంచేలా మ్యూజియం నిర్మిస్తారు. గోశాల‌, ధ‌ర్మ‌శాల, ఇత‌ర చిన్న చిన్న ఆల‌యాల‌ను కూడా ఆల‌య ప్రాంగ‌ణంలో నిర్మించ‌నున్నారు. వీటిలో పాటు 27 న‌క్ష‌త్ర వృక్షాల‌తో, అరుదైన మొక్కలతో వాల్మికీ వనం పెంచుతారు. ట్ర‌స్టు స‌భ్యులు ప్ర‌స్తుతం రామ మందిర నిర్మాణ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

హైదరాబాద్ లో ప్రతి వెయ్యిమందికి 30 సీసీ కెమెరాలు

నిఘానేత్రంలో హైదరాబాద్ కు 15వ స్థానం ప్రతి వెయ్యిమందికి 30 సీసీకెమెరాలు ప్రపంచంలోని పెద్దనగరాల్లో తీసుకుంటున్న భద్రత చర్యల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కవి గాంచని చోటు రవిగాంచును అన్న విధంగా పోలీసు తెలుసుకోలేని ఎన్నో విషయాలు సీసీ కెమెరాలు పట్టిస్తాయి. నేరాల విచారణలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాలు భద్రత కోసం సీసీకెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను తగ్గించి, భద్రత సులభతరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో లండన్ కు చెందిన కంపారిటెక్ అనే కంపెనీ  నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అత్యదిక సీసీటీవిలు కలిగిన  20 నగరాల జాబితాలో లండన్, హైదరాబాద్ మినహా మిగిలిన 18 నగరాలు చైనాలోనే ఉన్నాయి. మొదటి స్థానంలో ఉన్న చైనాలోని తైయువాన్ సిటీలో ప్రతి వెయ్యిమందికి 119 సీసీకెమెరాలు ఉన్నాయి. ఈ నగరం మొత్తంలో 4.65 లక్షల సీసీ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. బీజింగ్ నగరంలో 11.50 లక్షల సీసీకెమెరాలను ఏర్పాటుచేశారు. 15వ స్థానంలో ఉన్న హైదరాబాద్ లో ప్రతి వెయ్యిమందికి 30సీసీకెమెరాల ఉండగా నగరం మొత్తంలో దాదాపు 3లక్షల సీసీకెమెరాలు ఏర్పాటుచేశారు. 21స్థానంలో ఉన్న చెన్నైలో ప్రతి వెయ్యిమందికి 25 సీసీకెమెరాలున్నాయి. 33వ స్థానంలో ఉన్న ఢిల్లీ నగరంలో ప్రతివెయ్యిమందికి 14 సీసీకెమెరాలున్నాయి.

సీఎం జగన్‌ కీలక నిర్ణయం.. ప్రతి మండలానికి కోల్డ్‌ స్టోరేజీ

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని, రూ. 4 వేల కోట్లతో వ్యవసాయ మార్కెటింగ్‌ను బలోపేతం చేస్తామని అన్నారు. పంట నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజి నిర్మించాలని యోచిస్తున్నట్టు తెలిపారు.  రైతు తన పంటను అమ్ముకునేలా మార్కెటింగ్‌ శాఖ తోడ్పాటు అందించాలని.. కనీస గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాలని సూచించారు. ప్రతి రైతు భరోసా కేంద్రం(ఆర్బీకే) పరిధిలో గోదాంలు, గ్రేడింగ్‌, సార్టింగ్ యంత్ర పరికరాలు ఉందాలన్నారు. తన వద్ద పంట ఉందన్న విషయం రైతు ఆర్బీకే అధికారులకు తెలిపితే ఆ విషయం వెంటనే సెంట్రల్ సర్వర్ కు చేరాలని స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెలకల్లా ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపొందించాలి అని అధికారులను ఆదేశించారు.

బాలికను దత్తత తీసుకుంటాం: చంద్రబాబు

రాజమండ్రిలో దళిత బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చలించిపోయారు. ఘటన గురించి తెలుసుకొని తీవ్ర ఆవేదన చెందిన చంద్రబాబు.. వెంటనే బాధితురాలికి టీడీపీ తరపున రూ.2లక్షల ఆర్థిక సాయం అందించాలని పార్టీ నేతలకు ఆదేశించారు. అలాగే పార్టీ తరపున ఆమెను దత్తత తీసుకుని చదివిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.  జరిగిన ఘోరాన్ని తెలుసుకునేందుకు చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారు. కమిటీ సభ్యులు బుధవారం రాజమండ్రి సందర్శించి బాధితురాలిని పరామర్శించారు. విచారణ అనంతరం టీడీపీ నిజనిర్ధారణ కమిటీ చంద్రబాబుకు నివేదిక అందజేసింది. బాధిత బాలిక పదో తరగతి వరకు చదువుకుందని పార్టీ నాయకులు చెప్పారు. దీంతో బాలికను దత్తత తీసుకుని చదివించే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. బాధితురాలిలో ఆత్మవిశ్వాసం కలిగించాలని, టీడీపీ అండగా ఉంటుందనే భరోసా కల్పించాలని పార్టీ నేతలను చంద్రబాబు కోరారు. ఇటువంటి దుర్మార్గాలపై పోరాడే యోధురాలిలా ఆమెను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఏపీ మూడు రాజధానుల పై ఆరా తీసిన ప్రధాని కార్యాలయం..

ఏపీ ప్రభత్వం మూడు రాజధానుల బిల్లు గవర్నర్ ఆమోదం కోసం వెళ్లడంతో మూడు రాజధానుల అంశం మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఈ బిల్లు పై గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి వివరాలు కోరిందట. గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి, అమరావతి జేఏసీ నేత జి.వి.ఆర్ శాస్త్రి పీఎంవోకు లేఖ రాశారు. దానిపై స్పందించిన ప్రధాన మంత్రి కార్యాలయం.. గవర్నర్‌ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్లు సమాచారం. దీని పై జివిఆర్ శాస్త్రి మీడియాతో మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలోనిదని, హైకోర్టు నోటిఫికేషన్‌ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగిందని, ఇపుడు రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ తాను ప్రధాన మంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి లేఖలు రాసినట్లుగా తెలిపారు. ఇదే సందర్భంలో చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎందుకు సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించినట్లుగా అయన తెలిపారు. అంతే కాకుండా దీనిపై అటార్నీ జనరల్‌ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం తో ఈ విషయం పై స్పందించిన పీఎంవో మరి కొన్ని వివరాలు అడగగా ఆ వివరాలు కూడా సమర్పించినట్లు డాక్టర్ శాస్త్రి తెలిపారు.

వైసీపీలో చేరనున్న గంటా.. జగన్ గ్రీన్ సిగ్నల్!!

టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలబోతున్నట్టు తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే సీఎం జగన్‌తో సన్నిహితంగా మెలిగే కీలక నేతలతో మంతనాలను కూడా ముగించినట్లు తెలుస్తోంది. వైసీపీలో గంటా చేరికకు జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గంటా వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆయన సన్నిహితులు కూడా చెపుతున్నారు. ఆగస్ట్ 15వ తేదీన పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. అదే రోజున గంటా వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. అయితే వైసీపీలో గంటా చేరికపై.. విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్ అసంతృప్తిగా ఉన్నారని, అయినప్పటికీ జగన్ సుముఖంగా ఉండటంతో.. గంటా చేరిక ఖాయమైపోయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే టీడీపీకి భారీ షాక్ తగిలినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ కొత్త ఎత్తుగడ.. పీవీ కుమార్తెకు ఎమ్మెల్సీ!!

తెలంగాణలో ఇప్పటికే కాంగ్రెస్ ను పలు రకాలుగా దెబ్బకొట్టిన టీఆర్ఎస్.. ఇప్పుడు మరో గట్టి దెబ్బ కొట్టడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుని కాంగ్రెస్ కి పూర్తిగా దూరం చేసే ఎత్తుగడ వేస్తుందని సమాచారం. పీవీని కాంగ్రెస్ ప్రధానిని చేసింది, ఏఐసీసీ అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టింది, ఇలా ఎన్నో పదవులు కట్టబెట్టింది. కానీ చివరిరోజుల్లో పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదన్న ఆవేదన పీవీ కుటుంబీకుల్లో, అభిమానుల్లో ఉంది. దానికితోడు, ఇప్పుడు ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించి.. పీవీని గౌరవించడంలో టీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఈ విషయంలో కాస్త ఆలస్యంగా మేల్కొన్న కాంగ్రెస్.. పార్టీ తరఫున ఏడాది పొడవునా పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పినా ఆదరణ కరువైంది. ఓ రకంగా పీవీ సెంటిమెంటుతో టీఆర్ఎస్ పీవీ కుటుంబీకులకి, అభిమానులకి దగ్గరైంది. ఇప్పుడు మరో ఎత్తుగడతో పీవీని కాంగ్రెస్ కి పూర్తిగా దూరం చేయడానికి టీఆర్ఎస్ సిద్దమైందని తెలుస్తోంది. పీవీ కుమార్తె సురభి వాణిదేవికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ పదవిని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆఫర్‌ చేసినట్లు సమాచారం. మాజీ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌  స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉండగా.. ఆగస్టులో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పదవీ కాలమూ పూర్తవుతోంది. ఈ మూడు స్థానాలూ గవర్నర్‌ కోటాలోవే. నాయిని నర్సింహా రెడ్డి, కర్నె ప్రభాకర్‌లను రెన్యువల్‌ చేయడం దాదాపు ఖాయమని చెబుతున్నారు. అయితే, మూడో సీటుకు అనూహ్యంగా పీవీ కుమార్తె పేరును పార్టీ అధిష్ఠానం తెరపైకి తీసుకొచ్చిందనే ప్రచారం జరుగుతోంది. తద్వారా, పీవీ సెంటిమెంటుతో కాంగ్రెస్ ను మరింత దెబ్బ కొట్టొచ్చని టీఆర్‌ఎస్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది.