అరనిమిషంలో పరీక్ష ఫలితాలు
posted on Jul 25, 2020 @ 12:18PM
ఏఐ టెక్నాలజీ ద్వారా టెస్టింగ్
కంటికి కనిపించని కోవిద్ 19 వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రపంచంలోని మేధావులంతా కృషి చేస్తున్నారు. మానవ మేధస్సుకు పదును పెడుతూ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్సీ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో వైరస్ ను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న పరిశోధన ఫలితాలు తుది దశకు వచ్చాయి. ఈ ఆధునాతన పరీక్ష విధానం అందుబాటులోకి వస్తే అరనిమిషంలోనే కోవిద్ 19 వైరస్ ఉనికిని కనిపెట్టేయవచ్చు. అతి త్వరలోనే ఈ కొత్త టెస్ట్ కిట్స్ అందుబాటులోకి రానున్నాయి.
శ్వాసే శాంపిల్
ఈ కొత్త పరీక్ష విధానంలో మన మాట, శ్వాసే శాంపిల్. కోవిద్ వైరస్ గొంతు, ముక్కు ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. మాట తీరు, శ్వాస తీసుకోవడంతో తేడాలను గుర్తించే సెన్సార్ల ద్వారా వైరస్ ఉనికిని కనిపెడతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నిం గ్ టెక్నాలజీతో శరీరంలో ఉన్న వైరస్ మూలాలను ఈ కొత్త కిట్ చెప్పేస్తుంది. పరీక్ష ఫలితాలు 85 శాతం కచ్చితంగా వైరస్ ఉనికిని నిర్దారిస్తాయి. ఈ కిట్ ధర కేవలం 750రూపాయలు మాత్రమే.
సెన్సార్ ద్వారా..
మానవ మేధస్సుకు పదను పెట్టి రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడంతో అనేక అంశాలు యంత్రాలతోనే పూర్తి అవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో సెన్సార్ తో హ్యాండ్ శానిటైజర్లు, మన టెంపరేచర్ చెక్ చేసే థర్మోమీటర్ లో ఏఐ వాడుతున్నారు. ఈ కొత్త విధానంలో ముక్కుతో గాలిని ఒక కవర్ బ్యాగ్ లోకి వదలాలి. ఆ గాలిని ఏఐ టెక్నాలజీ ఉండే ‘సెంట్ రీడర్ ’అనే ఓ మెషీన్ లోకి పంపిస్తారు. అది టెర్రాహెర్ట్జ్ వేవ్స్ (టీహెచ్ జెడ్ ) అనే టెక్నాలజీ సాయంతో వైరస్ ను అర నిమిషంలోనే గుర్తిస్తుంది. ఆ తర్వాత వాయిస్ టెస్ట్, బ్రెతలైజర్ టెస్ట్, ఐసోథెర్మల్, పాలి అమైనో యాసిడ్ టెస్ట్ చేస్తారు.
ఇజ్రాయెల్ డైరక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీడీఆర్ డీ) తయారు చేసిన ఈ కొత్త టెస్ట్ను కిట్ లను ఆ దేశంలో ఇప్పటి కే వెయ్యి మంది పేషెంట్లపై ట్రయల్ నిర్వహించారు. బ్రెతలైజర్ పద్ధతిలో చేసిన ఈ టెస్ట్ ద్వారా 85 శాతం కరెక్ట్ రిజల్ట్స్ వచ్చాయని ఆ కిట్ ను తయారుచేస్తున్న నానోసెంట్ కంపెనీ సీఈవో ఒరెన్ గావ్రియెలీ ప్రకటించారు. మన దేశానికి చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెం ట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) తో కలిసి ఫైనల్ స్టేజ్ ట్రయల్స్ చేస్తారు. రెండు వారాల పాటు జరిగే ఈ ట్రయల్స్ సక్సెస్ అయితే వాటిని పెద్ద సంఖ్యలో ఇక్కడ తయారు చేస్తారు. మన దేశ అవసరాలకు పోనూ మిగతా వాటిని ప్రపంచ దేశాలకు పంపిస్తారు.