బోసిపోతున్న ఐటీ కారిడార్స్.. ఇంటిదారి పడుతున్న ఉద్యోగులు
వర్క్ ఫ్రమ్ హోమ్ కే ప్రాధాన్యత ఇస్తున్న ఐటి కంపెనీలు
ఇంటిదారి పడుతున్న ఉద్యోగులు
బోసిపోతున్న ఐటీ కారిడార్స్
పట్నం నుంచి పల్లెలకు పయనం
గ్రామాల్లో పెరుగుతున్న ఆదాయం
కోవిద్ 19 వైరస్ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అలజడి నుంచి బయటపడి పూర్తిగా కోలుకోవాలంటే మరో ఏడాది తప్పదని అనిపిస్తోంది. వైరస్ వ్యాప్తి లక్షలాది మందిని సోకి ప్రజల జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల భద్రత కోసం వర్క ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ వరకు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు బోర్డ్ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాన్ని సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దీంతో గూగుల్ సంస్థలో పనిచేస్తున్న రెండు లక్షల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. సెర్చ్ ఇంజన్ సంస్థ ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ సంస్థ కూడా తమ ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి 8 వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించారు. యాపిల్, ఫేస్బుక్ ,ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, క్వాల్ కామ్, ఐబిఎం, కాగ్నిజెంట్, టిసిఎల్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసే అవకాశం కల్పిస్తున్నాయి. కార్పోరేట్ ఐటి సంస్థలు ఈ విధమైన నిర్ణయం తీసుకుంటే కేంద్రప్రభుత్వం లోని కొన్నిశాఖల్లోనూ ఏడాదిలో 15రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. డిజిటల్ సదుపాయంలో పనిచేసే 75 విభాగాల్లో ఈ మేరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పిస్తున్నారు.
రెండు నెలలకు పైగా లాక్ డౌన్ విధించినా కంట్రోల్ కాని కరోనాతో స్కూల్స్, సినిమా హాల్స్, క్లబులు, పబులు, పార్క్లు, జిమ్ లు, హాస్టల్స్ అన్నీ మూతపడటం, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో లక్షలాది మంది ఉద్యోగులు తమ సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. ఐటి కంపెనీలు ఎక్కువగా ఉండే నగరాల నుంచి గ్రామాలకు పయనమవుతున్నారు. కేవలం హైదరాబాద్ లోనే సుమారు ఆరు లక్షల మంది ఐటి సంస్థల్లో పనిచేస్తారని అంచనా. వీరితో అత్యధిక శాతం మంది ఇక్కడి ఖర్చుల భరించలేక, వీకెండ్ లో రీప్రెష్ మెంట్ సదుపాయాలు లేక ఊర్లకు వెళ్ళిపోయారు. ఇక ఇతర రంగాల్లో పనిచేసేవారు కూడా సొంత ఊర్లకు వెళ్ళిపోయారు. దాంతో హైదరాబాద్ రోడ్లు, మాల్స్ బోసిపోయాయి. మార్కెట్ లో కొనుగోలు తగ్గుముఖం పట్టాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అద్దె ఇంటి యజమానులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా భారీగా ఆదాయం పడిపోతుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉండటంతో చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు లాక్ టాప్ భుజానికి తగిలించుకుని.. సామాన్లు సర్దుకుని ఇండ్లు ఖాళీ చేసి పోతున్నారు. దాంతో నగరంలో వీధికి నాలుగు టూలేట్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఐటీ ఉద్యోగులు లేక, ఆదాయం వచ్చే మార్గాలు లేక నగరంలో షాపులు, కూరగాయల దుకాణాలు బోసిపోతుంటే పల్లెల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు ఇంటికి దూరంగా ఉన్న వారంతా గ్రామాలకు చేరుకోవడంతో నిత్యావసరాల, కూరగాయల వినియోగం పెరిగింది. గతం కన్నా రెట్టింపు స్థాయిలో నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారని దుకాణదారులు అంటున్నారు. మరో ఆరునెలల పాటు ఇలాగే కొనసాగితే గ్రామాల ఆర్థికఆదాయం నాలుగింతలు అవుతుందని అంచనా వేస్తున్నారు.
స్మార్ట్ సిటీలు అంటూ పట్టణాలకు వలసలను ప్రోత్సహించి ట్రాఫిక్, పోల్యుషన్ పెంచిన ప్రభుత్వాలు గ్రామాల ఆర్థిక ప్రగతిని మరచిపోయాయి. కరోనా నేర్పిన పాఠాలతో స్మార్ట్ విలేజ్ ల కాన్సెఫ్ట్ తీసుకుని గ్రామాల్లో ఉపాధి అవకాశాలు పెంచి, మౌలిక సదుపాయాలపై దృష్టి పెడితే పట్టణాలకు వలసలు తగ్గుతాయి.