అడవుల పరిశోధనల్లో అమ్మాయిలు
posted on Jul 25, 2020 @ 9:52AM
అబర్న్ యూనివర్సిటీ సీటు సాధించిన తెలంగాణ ఆడబిడ్డలు
అమ్మాయిలు అనగానే టీచర్లు, డాక్టర్లు, బ్యాంక్ ఉద్యోగం, సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇలా కొన్నిరకాల ఉద్యోగులకు పనికివచ్చే కోర్సులు చదవమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తరు. కానీ, వారికి ఇష్టమైన కోర్సులు చదివే స్వేచ్ఛను ఇచ్చే తల్లిదండ్రులు కొందరే ఉంటారు. వారి ప్రోత్సాహంతో తాము ఎంచుకున్న అంశంలో ఉన్నతవిద్య అభ్యసించేందుకు సిద్ధమవుతున్నారు నేటి అమ్మాయిలు. ఫారెస్ట్ కోర్సు చదువుతున్న ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో సీటు సాధించారు. అది కూడా ఉచితంగా. వారి ప్రతిభ, ఆసక్తిలను గమనించిన యూనివర్సిటీ కోర్సు ఫీజు మొత్తం రద్దు చేయడంతో పాటు అదనంగా రెండేళ్లకు 25లక్షల స్కాలర్ షిప్ ఇస్తుంది.
అమెరికాలోని ప్రతిష్టాత్మక అబర్న్ యూనివర్సిటీలో ఎంఎస్సీ కోర్సులో తెలంగాణ అమ్మాయిలు సీటు దక్కించుకున్నారు. గత మేనెలలో సూర్య దీపిక ఎంఎస్ సీటు సాధించగా.. ఇప్పుడు సుహర్ష సీటు దక్కించుకుంది. హైదరాబాద్ లోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)లో బీఎస్సీ ఫారెస్ట్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న రంగారెడ్డి జిల్లాకు చెందిన సూర్య దీపిక ఎంఎస్సీ ఫారెస్ట్ జెనటిక్స్ లో, మంచిర్యాలకు చెందిన సుహర్ష ఎంఎస్సీ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీటు సాధించింది. వీరిద్దరూ ఫైనల్ పూర్తి కాకముందే పిజీలో సీటు సాధించారు. నాలుగేళ్ల ఫారెస్ట్రీ కోర్సులో వారికి వచ్చిన మార్కుల ఆధారంగా వారిద్దరికీ ఫ్రీ సీటు ఇవ్వడంతోపాటు స్కాలర్ షిప్ కూడా అబర్న్ యూనివర్సిటీ ఇస్తుంది.
రెండేళ్ల ఈ ఎమ్మెస్ కోర్సు ఫీజు మొత్తం 30వేల డాలర్లు అంతే మన కరెన్సీలో దాదాపు 25లక్షలు. ఈ ఫీజు మొత్తాన్ని మాఫీ చేశారు. అంతేకాదు వారికి నెలకు 1,500 డాలర్ల స్కాలర్‌షిప్‌ను కూడా మంజూరు చేసింది. వారిద్దరూ తమ ప్రతిభ ఆధారంగా ఉన్నత చదువులకు అర్హత సాధించారు. అబర్న్ యూనివర్సిటీలో ప్రముఖ డాక్టర్ జన్నా విల్లోగ్ నేతృత్వంలో జెనెటిక్స్, వైల్డ్ లైఫ్‌ను సూర్య దీపిక అధ్యయనం చేయనుంది.
ములుగులో నెలకొల్పిన ఎఫ్‌సీఆర్‌ఐలో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సును 2016లో ప్రవేశపెట్టారు. ఈ కోర్సులో ఫైనల్ కు చెరిన ఫస్ట్ బ్యాచ్ లో 49మంది విద్యార్థులు ఉంటే అందులో 31మంది అమ్మాయిలే. వీరిలో సుమారు 20 మంది సివిల్ సర్వీసులకు కూడా ప్రిపేర్ అవుతున్నారు. డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ రీసెర్చ్ యూనివర్సిటీలో వుడ్ టెక్నాలజీలో ఆరుగురు అమ్మాయిలకు సీటు వచ్చింది. మరో ముగ్గురు విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యావకాశాలు వచ్చే అవకాశం ఉందని డీన్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఎమ్మెస్సీ ఫారెస్ట్రీ కోర్సును ఆరంభించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నామని మొదటి బ్యాచ్‌లో 24 మందికి ఎమ్మెస్సీ కోర్సులో ప్రవేశం కల్పిస్తామన్నారు. అబర్న్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ బయాలజీ డీన్ గా ఉన్న జానకిరాం రెడ్డి అవలపాటి తెలంగాణ విద్యార్థులకు ఉన్నతవిద్య అందించేందుకు సహకారం అందిస్తున్నారు. తెలంగాణ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నతవిద్యను అందించే లక్ష్యంగా అబర్న్ యూనివర్సిటీ, కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీతోనూ ఒప్పందాన్నికుదుర్చుకున్నారు.