వ్యాక్సిన్ పేరుతొ మేము ప్రజలను చంపేస్తామా.. కుట్ర సిద్ధాంతాల పై బిల్ గేట్స్
posted on Jul 24, 2020 @ 5:28PM
ప్రపంచ వ్యాప్తంగా బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నసంగతి అందరికి తెలిసిందే. తాజాగా అయన కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ల కోసం 250 మిలియన్ డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లుగా తెలిపారు. అయితే, ఇంతలో కరోనా వైరస్ వ్యాప్తి వెనుక బిల్ గేట్స్ హస్తం ఉందంటూ కుట్ర సిద్ధాంతాలు తాజాగా ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాకుండా కరోనా వ్యాక్సిన్ ద్వారా భూమిపై 15 శాతం ప్రజలను అంతమొందించాలన్నది ఆయన లక్ష్యమని ఓ వీడియో ద్వారా ప్రచారం జరుగుతోంది. తాజాగా దీని పై స్పందిస్తూ కరోనా వైరస్ పుట్టుకకు తానే కారణం అన్న కుట్ర సిద్ధాంతాన్ని బిల్ గేట్స్ తీవ్రంగా ఖండించారు.
ఈ దుష్ప్రచారం పై బిల్ గేట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను వ్యాక్సిన్ల ద్వారా మేము ఎప్పుడైనా చంపామా? వ్యాక్సిన్ల ద్వారా మేము ఎప్పుడైనా డబ్బు కూడబెట్టామా? ఎవరైనా దీనిని నిరూపించగలరా అంటూ అయన సవాల్ విసిరారు. వాస్తవానికి ప్రజల ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్ల కోసం తాము ఇతర ఎన్జీవోల కన్నా ఎక్కువే ఖర్చు పెడుతున్నామని, అంతే కాకుండా అనేక వ్యాక్సిన్ల రూపకల్పనతో తమకు సంబంధం ఉన్న మాట కూడా వాస్తవమేనని అయినా, వ్యాక్సిన్లతో ప్రజలను చంపాలని తాము ఎప్పుడూ అనుకోలేదని అయన స్పష్టం చేశారు. ఐతే 2015 లో జికా వైరస్ వ్యాప్తి జరిగినపుడు కూడా బిల్ గేట్స్ పై ఇటువంటి కుట్ర సిద్ధాంత ఆరోపణలే రావడం గమనార్హం.