అక్టోబర్ నాటికి ఆక్స్‌ఫర్డ్ 'కోవిషీల్డ్' వ్యాక్సిన్

ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఒక శుభవార్త తెలిపింది. ఈ సంవత్సరం అక్టోబరు నాటికి అంటే మరో మూడు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ‘కోవిషీల్డ్’తొలి దశ ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చినట్టు ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో నిన్న వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. మన దేశంలో కూడా వచ్చే నెలలో తదుపరి దశ ప్రయోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని పూనావాలా తెలిపారు. ఆక్స్‌ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ 'కోవిషీల్డ్' ఫోటోను అయన ట్విట్టర్ ద్వారా విడుదల చేసారు. ఐతే అక్టోబరు నాటికి ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ వస్తుందన్న ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా వ్యాఖ్యలకు విరుద్ధంగా, టీకా డిసెంబరు నాటికి అందుబాటులో వస్తుందని ఆ సంస్థ చైర్మన్ సైరస్ పూనావాలా చెప్పడం గమనార్హం. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ తొలి దశ ప్రయోగాలు విజయవంతంగా ముగిశాయని, రెండు, మూడో దశ ప్రయోగాలు ఆస్ట్రియాలో కొనసాగుతున్నాయని ఆయన వివరించారు. భారత్‌ లో కనీసం వందకోట్ల డోసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తాము నిర్ణయించామని, పేదలను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరకే దీనిని అందుబాటులో ఉంచుతామని సైరస్ పూనావాలా తెలిపారు.

రాజధాని ఏర్పాటులో ఊహించని ట్విస్ట్.. విశాఖపై జగన్ సర్కార్ వెనకడుగు!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిని విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జగన్ సర్కార్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. రాజధాని మార్పుపై అమరావతి ప్రాంత రైతులు 200 రోజుల నుంచి పైగా ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు వికేంద్రీకరణ బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్‌ లో ఉంది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు విశాఖపై జగన్ సర్కార్ వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. రాజధానిని విశాఖకు కాకుండా విజయనగరం జిల్లా భోగాపురంకు తరలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.  భోగాపురంలో ఏపీ పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భోగాపురం విమానాశ్రయం వద్ద 500 ఎకరాలను రాజధాని కొరకు ఏపీ ప్రభుత్వం కేటాయించినట్లు సమాచారం. 500 ఎకరాల అభివృద్ధి ప్రణాళికలకు విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్మెంట్ అథారిటీ టెండర్లను ఖరారు చేసింది. ఢిల్లీలో సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దక్కించుకున్న, గుజరాత్‌ కు చెందిన హెచ్‌సీపీ సంస్థకు ప్రణాళికల కాంట్రాక్ట్‌ ను ఏపీ ప్రభుత్వం కట్టబెట్టిందని తెలుస్తోంది. హెచ్‌సీపీ సంస్థకు మూడు వారాల క్రితం రహస్యంగా కాంట్రాక్ట్ అప్పగించినట్లు సమాచారం. భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేటాయించిన స్థలంలో 500 ఎకరాలను ప్రభుత్వం తమ వద్దే ఉంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ స్థలాన్నే హెచ్‌సీపీ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించింది. అయితే, జగన్ సర్కార్ విశాఖపై వెనకడుగు వేయడానికి.. విశాఖలో ఇటీవల చోటుచేసుకున్న గ్యాస్ లీకేజ్ ఘటనలు, వరుస అగ్నిప్రమాదాలు కారణమా? లేక మరేదైనా కారణముందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

భారత్ లో కరోనా విలయతాండవం.. ఒక్క రోజే 1129 మంది మృతి

భారత్‌లో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. గత 24 గంటలలో దేశం మొత్తం కలిపి 45,720 కొత్త కేసులు నమోదు కాగా 1129 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది. ఐతే నిన్ననే 29,557 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. భారత్‌లో ఒక్క రోజులోనే ఇంత భారీ సంఖ్యలో మరణాలు నమోదవడం ఇదే మొదటి సారి. ఇది ఇలా ఉండగా తమిళనాడులో కరోనా మరణాలపై ఏర్పాటైన కమిటీ సమర్పించిన తాజా నివేదిక ప్రకారం గతంలో చనిపోయిన వారిని కూడా కలిపి చెన్నైలో 444 మరణాలను నమోదు చేశారు. వీరి మరణాలను ప్రభుత్వ రికార్డుల్లో ఇంతకు ముందు నమోదు చేయకపోవడంతో ఇపుడు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో బుధవారం కోవిడ్ మృతుల జాబితాలో చేర్చడంతో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోన్నదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిన్నటివరకు భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 12,38,635కి చేరింది. ఇందులో 7,82,606 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకుని హాస్పిటల్స్ నుండి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు భారత్ లో 29,861 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 4,26,167 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

అలస్కా ద్వీపకల్పంలో భూకంపం, సునామీ హెచ్చరికలు

అమెరికాలోని అలస్కా ద్వీపకల్పంలో తీవ్రవైన భూకంపం వచ్చింది. ఇది రిక్టర్ స్కేల్ పై 7.8గా నమోదైంది. దాంతో సునామీ హెచ్చరికలు చేశారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఈ భూకంపం సంభవించడం, సుమామీ వచ్చే ప్రమాదం ఉండటంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మాస్కులు కట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. అలస్కాలోని పెర్రివిల్లెకు ఆగ్నేయంగా 96 కిలోమీటర్ల దూరంలో 9 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రీకృతమై ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. ఈ భూపంక తీవ్రత ఎక్కువ ఉండే దక్షిణ అలస్కా, అలస్కా ద్వీపకల్పంతో పాటు అలూటియన్ దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేస్తూ  ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

అమర్ నాథ్ యాత్ర రద్దు

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర ఈ ఏడాదికి రద్దు అయ్యింది. ఈనెల 21 నుంచి యాత్ర ప్రారంభం అవుతుందని ముందుగా ప్రకటించినప్పటికీ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో యాత్రను రద్దు చేసినట్లు అమర్ నాథ్ దేవస్థానం బోర్టు స్పష్టం చేసింది. కరోనా ప్రభావం, దేశ సరిహద్దుల్లో నెలకొన్న యుద్ధవాతావరణం నేపధ్యంలో ఈ ఏడాదికి అమర్ నాథ్ యాత్రను రద్దు చేసి భక్తులకు లైవ్ టెలీకాస్ట్ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా అమర్‌నాథ్ యాత్రకు అనుమతించే అంశంపై అనేక పర్యాయాలు చర్చలు జరిగాయి. చివరికి యాత్రను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీం కోర్టు వరకు ఈ విషయం వెళ్ళింది. 15 రోజులకు యాత్రను కుదించారు. ఈ నెల 21 నుంచి యాత్ర ప్రారంభమవుతుందని ప్రకటించారు. చివరికి భక్తులను ఊరిస్తూ వచ్చిన అమర్‌నాథుడి దర్శనం  వచ్చే ఏడాదికి వాయిదా పడింది. గత సంవత్సరం కూడా అమర్ నాథ్ యాత్ర మధ్యలోనే రద్దు చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో  జమ్ములో నెలకొన్న ఉద్రికత్త పరిస్థితుల కారణంగా రద్దు చేశారు.

ఫీవర్, కింగ్ కోఠి దవాఖానాల్లో అన్ని బెడ్స్ కరోనా రోగులకే

కరోనా చికిత్సకు పూర్తి స్థాయి లో మరో రెండు దవాఖానాలు కోవిద్ 19 వైరస్ వ్యాప్తి కారణంగా పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం మరో రెండు దవాఖానాలను పూర్తి స్థాయి కరోనా చికిత్స కేంద్రాలుగా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు గాంధీ దవాఖానా మాత్రమే పూర్తిస్థాయి కరోనా దవాఖానాగా చికిత్స అందిస్తోంది. ఇప్పుడు ఫీవర్ హస్పిటల్, కింగ్ కోఠి హస్పిటల్ కూడా కరోనా సెంటర్స్ గా మార్చుతారు. ఐసీయూ బెడ్స్ పెంపు ప్రస్తుతం గాంధీ దవాఖానాలో 800మంది రోగులు ఉన్నారు. వీరిలో చాలామంది పరిస్థితి ప్రమాదం గా ఉంది. ఇంకా ఎక్కువ మందిని చేర్చుకోవడానికి సరైన సదుపాయాలు, వైద్యసిబ్బంది లేరు. దాంతో ఇటీవల ఇక్కడ వైద్యసిబ్బంది నిరసన కూడా తెలియచేశారు. గాంధీ దవాఖానాపై పెరుగుతున్న వత్తిడిని తగ్గించేలా ఫీవర్, కింగ్ కోఠి దవాఖానాల్లో ఐసీయూ వార్డులను ఏర్పాటు చేస్తారు. ఫీవర్ హస్పిటల్ లో 340బెడ్స్ ఉంటే వాటిలో 200బెడ్స్ వరకు కరోనా రోగులకు కేటాయించారు. మిగతా బెడ్స్ ను కూడా కరోనా రోగులకే కేటాయిస్తూ పూర్తిస్థాయి ఐసీయూ వార్డులను ఏర్పాటుచేస్తారు. కింగ్ కోఠిలో ప్రస్తుతం ఉన్న 350 బెడ్స్ లో 200 బెడ్స్ కరోనా రోగుల కోసం కేటాయించారు. అయితే పూర్తిస్థాయిలో ఐసీయూ సౌకర్యాలను ఏర్పాటుచేసి 350 బెడ్స్ కరోనా రోగులకే కేటాయిస్తారు.

సరిహద్దులో భారీగా చైనా బలగాలు

ఎదుర్కోనేందుకు సిద్ధంగా ఉన్న భారత్ సైన్యం లద్ధాఖ్ ఎల్ఎసీ వద్ద చొరబాట్లపై ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కి రాకముందే డ్రాగన్ కంట్రీ భారత్ సరిహద్దుల వెంట సైన్యాన్ని మోహరిస్తూ  కుతంత్రాలు పన్నుతోంది. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనేలా చూస్తామంటూనే డ్రాగన్ కంట్రీ మరోవైపు తన కుటిల బుద్ధిని చూపిస్తోంది. భారత్ సరిహద్దు దేశాలను తన వైపు తిప్పుకుంటూ యుద్దానికి సిద్ధం అంటూ పరోక్షంగా సంకేతాలను అందిస్తోంది. వెనుకడుగు వేసినట్టే వేసి భారీగా సరిహద్దు వెంట సైన్యాన్ని మోహరిస్తోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని మెక్ మెహన్ రేఖ (ఎంఎల్) సమీపంలోకి దాదాపు 40 వేలమంది సైనికులను చేరవేస్తుంది. . భారత సైన్యం కూడా డ్రాగన్ కంట్రీకి ధీటైన సమాధానం చెప్పడానికి సిద్ధమవుతోంది. యుద్ధ సామాగ్రిని, సైన్యాన్ని అరుణాచల్ ప్రదేశ్ కు పంపిస్తోంది. వైమానిక దళం సిద్దంగా ఉండాలి.. దేశ సరిహద్దుల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్దంగా ఉండమని సైన్యాన్ని ఆదేశించారు. భారత వాయుసేన అగ్ర కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో యుద్ధవిమానాలు మోహరించడం మంచి చర్య అన్నారు. సరిహద్దుల వెంట శత్రుదేశానికి గట్టి బుద్ధి చెప్పడానికి వైమానిక దళం సిద్దంగా ఉండాలని ఆదేశించారు. సరిహద్దుల్లో యుద్ధవిమానాలు.. చైనా చేస్తున్న కవ్వింపు చర్యలకు గట్టిగా గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఆర్మీ అమ్ముల పొదిలో కొత్త చేరిన అస్త్రాలను సరిహద్దుల వెంట సిద్ధం చేస్తోంది. అత్యాధునిక పరిజ్ఞానంలో తయారుచేసిన డ్రోన్ కెమెరాలతో డ్రాగన్ కంట్రీ చర్యలపై నిఘా పెంచింది. మిగ్ 29కె సూపర్ సోనిక్ ఫైటర్స్, లాంగ్ రెంజ్ ఎయిర్ క్రాఫ్ట్ పి 8లను తూర్పు లద్దాఖ్ సరహిద్దుల్లో సిద్ధంగా ఉంచింది. భారత్ చైనా సరిహద్దులోని ప్రధాన ఎయిర్ బేస్ ల్లో ఐఏఎఫ్ ఫైటర్ జెట్లతో పాటు మిగ్ విమానాలు కూడా సిద్ధంగా ఉంచారు. సుఖోయ్ 30 ఎంకేఐఎస్, చినూక్ హవీ లిఫ్ట్ హెలికాప్టర్లను కూడా సన్నద్దం చేశారు.

కాళేశ్వరం విస్తరణ పనులపై ఎన్జీటీలో పిటిషన్

విచారణ ఆగస్టు 5కు వాయిదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించే కాళేశ్వరం విస్తరణ పనులపై దాఖలైన పిటిషన్ పై విచారణ ఆగస్టు 5కు వాయిదా పడింది. ఈ విషయంలో అవసరమైన పాలనాపరమైన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రధాన బెంచ్ ను న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని చెన్నై ద్విసభ్య  గ్రీన్ ట్రిబ్యునల్ బెంచ్ కోరింది.   కాళేశ్వరం విస్తరణ పనులకు పర్యావరణ అనుమతులు లేవంటూ వేముల ఘాట్ రైతులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్ పై చెన్నై బెంచ్ లో విచారణ జరిగింది. పర్యావరణ అనుమతులు లేకుండానే 21వేల కోట్ల రూపాయల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని పిటషన్ తరపు న్యాయవాది బెంచ్ ముందు వివరించారు. అనుమతులు తీసుకునే వరకు విస్తరణ పనులు ఆపాలని కోరారు. అయితే ఇదే అంశంపై ఢిల్లీలోని ఎన్జీటీ ప్రధాన బెంచ్ లోనూ విచారణ జరుగుతోందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.

కల్నల్ సంతోష్ బాబు భార్యకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం

భారత- చైనా సరిహద్దుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు భార్య సంతోషికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కేటాయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో సంతోషికి అందించారు. ఆమె సౌలభ్యం మేరకు హైదరాబాద్, పరిపర ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.  దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన కల్నల్ సంతోష్ బాబు మృతికి తీవ్ర సంతాపం తెలపడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఐదుకోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ముఖ్యమంత్రి కెసీఆర్ సూర్యాపేటలోని ఆయన ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించడంతోపాటు ఆయన భార్య సంతోషికి గ్రూప్ 1 ఉద్యోగం, హైదరాబాద్ లో ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సంతోషి ప్రగతి భవన్ లో సిఎంను కలిశారు. ఆమెను డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు అందించారు. ఉద్యోగ నిర్వహణకు అవసరమైన సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని కార్యదర్శి స్మితా సభర్వాల్ కు సూచించారు. సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి మద్యాహ్న భోజనం చేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.

కరోనా తాకిడికి విలవిలలాడుతున్న ఏపీ.. విశాఖ సరి కొత్త రికార్డ్

కరోనా మహమ్మారి దెబ్బకు ఏపీ విలవిలలాడుతోంది. గడిచిన 24 గంటల్లో ఏకంగా 6,045 మందికి కరోనా సోకినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం విశాఖ జిల్లా లోనే ఉన్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా ఏకంగా 1049 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,713కి చేరింది. గడిచిన 24 గంటల్లో 65 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 823కి చేరింది.  కొత్తగా నమోదైన కేసుల్లో జిల్లాల వారీగా చూస్తే అనంతపురంలో 325, చిత్తూరు 345, తూర్పు గోదావరి 891, పశ్చిమగోదావరి జిల్లాలో 672, గుంటూరు 842, కర్నూలు 678, కడప 229, కృష్ణా 151, నెల్లూరు 327, ప్రకాశం 177, శ్రీకాకుళం 252, విజయనగరం 107 కేసులు నమోదయ్యాయి.

నేనేమి ట్రంప్ ను కాదు.. ఉద్ధవ్ థాకరే సెన్సేషనల్ కామెంట్స్

కరోనా మహారాష్ట్రను మరీ ముఖ్యంగా ముంబయి ని కబళిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "నేను డొనాల్డ్ ట్రంప్ కాదు. నా కళ్ల ముందే నా ప్రజలు ఇబ్బంది పడటాన్ని నేను చూడలేను" అని ఆయన అన్నారు. శివసేన అధికార మీడియా అయిన సామ్నా కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అయన ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ ఇంటర్వ్యూ ఈ వీకెండ్ లో రెండు భాగాలుగా ప్రసారం కానుంది. ఈ ఇంటర్వ్యూ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. వైరస్ ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఆసక్తి చూపలేదనే విమర్శలు ఉన్నాయి. ఐతే తాను ట్రంప్ మాదిరిగా విఫలం చెందలేదనే విషయాన్ని ఉద్ధవ్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పటికీ మహారాష్ట్రలో లాక్ డౌన్ అమల్లో ఉందని.. అయితే మెల్లమెల్లగా ఒక్కొక్క రంగానికి క్రమంగా కరోనా నిబంధనల నుంచి సడలింపులు ఇస్తున్నామని అయన తెలిపారు. ఇదే సందర్భంలో ఏ విద్యార్థి కూడా కరోనా బారిన పడకూడదనే ఉద్దేశం తోనే విద్యార్థులకు ఎలాంటి పరీక్షలను నిర్వహించలేదని ఆయన చెప్పారు.

నిమ్మగడ్డ కొనసాగింపు పై గవర్నర్ ఆదేశాలకు వైసీపీ షాకింగ్ రిప్లై

ఈ రోజు ఉదయం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా దీని పై అధికార పార్టీ వైసీపీ స్పందించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయమని గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారని వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని తాము గవర్నర్ దృష్టికి తీసుకెళతామని ఆయన తెలిపారు. ఈ విషయంలో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీరు సరిగ్గా లేదని అయన విమర్శించారు. నిమ్మగడ్డ రాజ్యాంగ పదవిలో ఉండాలంటూనే మళ్ళీ హోటళ్లలో రహస్యంగా మంతనాలు జరిపారని విమర్శించారు. ఇప్పటికే ఎన్ఈసీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దాన్ని గౌరవించాల్సిన పని లేదా? అని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజ్యాంగ వ్యవస్థకు తగిన విధంగా నిమ్మగడ్డ ప్రవర్తించడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించకుండా ఎందుకు రహస్యంగా కలుస్తున్నారని ప్రశ్నించారు. కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ కోర్టుల్లో కేసులు వేస్తున్నారని అసలు నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారని అయన ప్రశ్నించారు. తనకు సంబంధించిన వ్యక్తులే కీలకమైన పదవుల్లో ఉండేలా చంద్రబాబు తెర వెనుక ఉండి కుట్రలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.

గన్నవరం గరంగరం.. వంశీలో మొదలైన కలవరం!!

కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. అధికారపార్టీలో ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటినుంచి వంశీ.. టీడీపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారు. వైసీపీకి మద్దతు తెలుపుతూ.. సొంత పార్టీ నేతలపైనే వంశీ దూషణల పర్వానికి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు మరియు ఆ పార్టీ నాయకుల‌పై తీవ్ర విమర్శులు చేశారు. అధికారికంగా వైసీపీలో చేరకున్నా.. తాను వైసీపీ మనిషినే అన్న ముద్ర మాత్రం వేయించుకున్నారు. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి వెళ్లి మరీ సీఎం జగన్‌ ను వంశీ కలిశారు. అక్కడనుంచి గన్నవరం వైసీపీ రాజకీయాలు మలుపు తిరిగాయి. వంశీ వైసీపీకి అనుకూలంగా ఉండటాన్ని.. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో, యార్లగడ్డకు నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి ఆ వర్గాన్ని శాంతింపజేశారు. అయితే, యార్లగడ్డ నుంచి ఎదురవుతున్న అసంతృప్తిని ఏదో విధంగా చల్లార్చుకున్న వంశీ.. మరో నాయకుడు 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు నుంచి తీవ్రమైన ఇరకాటాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే వంశీ, దుట్టా రామచంద్రరావు వర్గాలకు పొసగడం లేనట్టుగా తెలుస్తోంది. వంశీకి వ్యతిరేకంగా దుట్టా అల్లుడు శివభరత్‌ రెడ్డి.. గన్నవరం నియోజకవర్గంలో ఓ వర్గానికి ప్రోత్సాహం ఇస్తున్నారని పార్టీలో ప్రచారం జోరుగా సాగుతోంది.  ప్రస్తుతం నియోజకవర్గంలో వంశీకి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని ఆయన వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివభరత్‌రెడ్డి నియోజకవర్గంలో పెత్తనం చేస్తున్నారని, వైసీపీ పెద్దల‌కు ఆయన బంధువు కావడంతో అధికారులు కూడా ఆయ‌న చెప్పిన విధంగా చేస్తున్నారనే మాట వంశీ వర్గీయుల‌ నుంచి వినిపిస్తోంది. హైదరాబాద్‌లో హాస్పటల్‌ నిర్వహిస్తున్న శివభరత్‌రెడ్డి.. నియోజకవర్గంలోని కార్యకర్తకుల‌, నాయకులకు ఫోన్‌లు చేసి నిత్యం టచ్‌లో ఉంటూ తన వర్గాన్ని పెంచుకుంటున్నారని, ఇది వంశీకి ఇబ్బందిని కల్గిస్తోందని అంటున్నారు. వైసీపీకి మద్దతు ప్రకటించిన వంశీ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెల‌వాల‌ని భావిస్తున్నారు. ఆ మేరకు వ్యూహాలు రంగం సిద్ధం చేసుకుంటుండగానే.. వైసీపీ నాయకుల‌ నుంచి వస్తోన్న ప్రతిస్పందనతో వంశీ కల‌వరానికి గురవుతున్నారంటున్నారు. దీనికితోడు, ఇటీవల జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో దుట్టా వర్గం సమావేశమైంది. గన్నవరంలో ఉప ఎన్నిక జరిగితే టికెట్ తమకే ఇవ్వాలంటూ షరతు విధించినట్లు తెలుస్తోంది. వంశీకి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహకరించబోమని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో, ఏం చేయాలో తెలియక వంశీ అయోమయంలో ఉన్నారట. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే.. ఉప ఎన్నికల్లో టికెట్ ఇస్తారా?.. ఒక వేళ ఇచ్చినా.. దుట్టా వర్గీయులు ఎన్నికల్లో తనకు సహకరిస్తారా?.. అనే ఆందోళన వంశీలో నెల‌కొందని ఆయన వర్గీయులు అంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా శివభరత్‌రెడ్డికే సహకరించే అవకాశముందని, ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో తెలియక వంశీ నిర్వేదానికి గురవుతున్నారనే మాట ఆయన వర్గీయులు నుంచి వినిపిస్తోంది.

మూగబోయిన బాలల హక్కుల గొంతుక

కరోనాతో కన్నుమూసిన పి. అచ్యుత రావు స్వేచ్ఛగా, ఆనందంగా పెరగాల్సిన బాలలకు ఎక్కడ సమస్య వచ్చినా.. వారి హక్కులకు ఆటంకం కలిగినా ఆయన గొంతుక అక్కడ వినిపించేది. యాదాద్రిలో చిన్నారుల అక్రమ నిర్భందం, నల్లగొండలో చిన్నారుల అమ్మకం ఇలా ఎక్కడ బాల్యం బజారున పడితే అక్కడ తన స్వరం వినిపిస్తూ న్యాయం జరిగేలా పోరాడే వ్యక్తి అచ్యుత రావు. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడిగా దశాబ్దాలుగా పోరాటం చేసిన ఆయన కరోనా చేతిలో ఓడిపోయారు. కొన్నిరోజులుగా కోవిద్ 19 వైరస్ తో ఫైట్ చేసి అలసిపోయి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చిన్నారుల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, బాలకార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు ఇలా ఎన్నో అంశాలపై ఆయన కోర్టుల్లో కేసులు వేసి చిన్నారుల బాల్యం బందీ కావద్దని వాదించారు. అనేక న్యూస్ చానెల్స్ లో బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ఆయన మృతి పట్ట పౌరసంఘాలు, బాలల హక్కుల కోసం పనిచేసే స్వచ్చంధ సంస్థలు తీవ్ర దిగ్భాంతిని తెలిపాయి.

ఆదిత్య  బిల్డర్స్ అధినేతపై చీటింగ్ కేసు

కొత్త మలుపు తిరిగిన డాక్యుమెంట్ల చోరీకేసు ప్రముఖ బిల్డర్స్ సంస్థ ఆదిత్య బిల్డర్స్‌ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. గత కొన్నిరోజుల క్రితం వెలుగులోకి వచ్చిన  100కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసు కొత్త మలుపు తిరిగింది. ఆదిత్య బిల్డర్స్‌ ఛైర్మన్, డైరెక్టర్స్ మధ్య నెలకొన్న వివాదంలో కొత్త కోణం బయటకు వచ్చింది. ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటా రెడ్డితో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్‌ హోమ్స్‌ ఎల్‌ఎల్‌పీ జాయింట్‌ వెంచర్‌లో తనకు తెలియకుండా విల్లాలు విక్రయించారని వంశీరామ్ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తాము ముందుగా చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నందగిరి హిల్స్‌లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్‌ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్‌ సంస్థతో 2014లో డెవలప్‌మెంట్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని సుబ్బారెడ్డి  ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని ఆయన తన  ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండురోజుల క్రితం ఆదిత్య బిల్డర్స్ డైరెక్టర్ సుధీర్ రెడ్డి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కోటారెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడని చెప్పారు. ఈ నేపధ్యంతో సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. కుటుంబ కలహాలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి కేసుల పర్వం కొనసాగుతోంది.

భారత్ లో 18 కోట్ల మందికి కరోనా సోకింది.. ప్రముఖ సంస్థ షాకింగ్ రిపోర్ట్

మనదేశం లో కరోనా ఉధృతి తీవ్రంగానే ఉంది. ప్రతి నిత్యం రికార్డ్ స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు సుమారు 12 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు గా తెలుస్తోంది. ఐతే 12 లక్షలు కాదు.. ఇప్పటి వరకు ఇండియాలో దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉండవచ్చని థైరో కేర్ ల్యాబ్స్ అనే ప్రయివేట్ డయాగ్నస్టిక్స్ సంస్థ సంచలన రిపోర్టును బయటపెట్టింది. మన దేశంలో ఇప్పటికే 15 శాతం మంది ప్రజలు కరోనా బారినపడ్డారని తమ అధ్యయనం ద్వారా తేలిందని ఆ సంస్థ ఛైర్మన్ డాక్టర్ వేలుమణి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రఖ్యాత డయాగ్నస్టిక్స్ సంస్థ అయిన థైరో కేర్ ల్యాబ్స్ దేశవ్యాప్తంగా 600 పిన్‌కోడ్స్‌లో సుమారు 60వేల మంది పై యాంటి బాడీ పరీక్షలు చేసింది. ఇందులో యావరేజ్ గా 15 శాతం మంది ప్రజల లో యాంటీ బాడీలు కనిపించాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. మన శరీరంలో కరోనా వైరస్ ప్రవేశిస్తే.. దాన్ని ఎదుర్కొనేందుకు యాంటీ బాడీలు తయారవుతాయి. దీని ఆధారంగా టెస్టులో యాంటీబాడీలు కనిపించాయంటే వారికి కరోనా సోకినట్లేనని నిపుణులు చెబుతున్నారు. మన దేశం మొత్తంగా 15 శాతం అంటే దాదాపు 18 కోట్ల మందికి కరోనా సోకి ఉంటుందని థైరో కేర్ సర్వే తెలిపింది. ఐతే దీనికి 3 శాతం అటూ ఇటూగా వాస్తవ పరిస్థితులు ఉండవచ్చని ఆ సర్వే వెల్లడించింది. ఇదే సర్వేలో హైదరాబాద్‌లోని వివిధ పిన్ కోడ్లలో పరిస్థితి ఈ విధంగా ఉంది. 500002,500060,500036,500026 పిన్‌కోడ్ కలిగిన ప్రాంతాల్లో వరుసగా 37.3 శాతం, 30.6శాతం, 23.5శాతం, 23.3 శాతం మందిలో యాంటీ బాడీలు కనిపించాయని ఆ సంస్థ సర్వే రిపోర్టులో పేర్కొన్నారు.

పంద్రాగస్ట్ కు ఖైదీల విడుదల

పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన సిఎం ఈ ఏడాది స్వాతంత్ర  దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పోలీసు శాఖను ఆదేశించారు. ఇందుకోసం అవసరమైన  జాబితాను రూపొందించాలని సూచించారు. ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, డిజిపి మహేందర్ రెడ్డి తదితరులతో ఈ అంశంపై చర్చించారు. ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను పరిశీలించారు విడుదలకు అర్హులైన ఖైదీల జాబితా తయారు చేయాలని సిఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.

అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌!

ఏపీ అధికార పార్టీ వైసీపీ నేతలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ కాగా, తాజాగా వైసీపీకి చెందిన మరో కీలక నేత కరోనా బారిన పడ్డారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల అంబటి రాంబాబును కలిసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులతో పాటు వారందరికీ కరోనా పరీక్షలు చేయనున్నారు. కాగా, అంబటి రాంబాబుకు చేసిన టెస్టులపై కాస్త గందరగోళం నెలకొంది. స్వాబ్ టెస్టులో భిన్నమైన ఫలితాలు వెలుగు చూశాయి. సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేసిన టెస్టులో ఒకసారి నెగటివ్, మరోసారి చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

జగన్ గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా?

ప్రకాశం జిల్లా చీరాలలో ఎస్‌ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళి సంఘాలు నిరసనకు దిగాయి. ఎస్‌ఐ విజయ్ కుమార్‌ పై హత్య, ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చెయ్యాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అద్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. ఈనెల 19న మాస్క్ లేకుండా తిరుగుతున్నాడని కిరణ్‌ కుమార్ అనే యువకుడిని  చీరాల టూటౌన్ ఎస్‌ఐ విజయ్ కుమార్ చితకబాదాడు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ఆసుపత్రికి తరలించారు. కాగా యువకుడు కిరణ్‌ కుమార్ పరిస్థితి మరింత విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. పోలీసులు లాఠీ దెబ్బల కారణంగానే కిరణ్‌ కుమార్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరోవైపు, ఎస్‌ఐ విజయ్ కుమార్ అత్యుత్సాహంపై దళిత సంఘాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. కాగా, నిన్న తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక లారీలు అడ్డుకున్నందుకు దళిత యువకుడు వరప్రసాద్ కి పోలీసులు శిరోముండనం చేసి, తీవ్రంగా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలపై టీడీపీ నేత నారా లోకేష్ స్పందించారు. వైఎస్ జగన్ గారి రౌడీ రాజ్యంలో దళితులకు జీవించే హక్కు లేదా? అని ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లాలో దళిత యువకుడు వరప్రసాద్ కి అధికారపార్టీ నేతల మెప్పు కోసం పోలీసులే శిరోముండనం చేయించి చిత్ర హింసలు పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ప్రకాశం జిల్లా లో దళిత యువకుడు కిరణ్ కుమార్ పోలీసుల దాడిలో చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.  దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. అసలు ఈ రాష్ట్రంలో శాంతి,భద్రతలు ఉన్నాయా? అని లోకేష్ ప్రశ్నించారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీకి తొత్తుల్లా మారి, గూండాల్లా దళితులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు పాల్పడిన పోలీసులు,వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలి. శిరోముండనం ఘటనపైన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించాలని లోకేష్ డిమాండ్ చేశారు.