సంబరాల నుంచి సైలెంట్.. తెలంగాణ బీజేపీ దూకుడుకు బ్రేక్? అంతా కేంద్రం వల్లే..
posted on Aug 30, 2020 @ 12:26PM
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటున్న బీజేపీ.. కొన్ని రోజులుగా దూకుడు పెంచింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదు. కరోనా భయపెడుతున్నా ప్రజా సమస్యలపై స్పీడ్ గా స్పందిస్తోంది బండి సంజయ్ టీమ్. ఎక్కడ సమస్య ఉన్నా.. అక్కడికి వెళ్లి సర్కార్ తీరును ఎండగడుతున్నారు కమలనాధులు. సంజయ్ స్పీడ్ తో బీజేపీ కేడర్ లోనూ జోష్ పెరిగింది. ప్రజా పోరాటంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కన్నాబీజేపీ ముందుందనే చర్చ జనాల్లోనూ జరుగుతోంది. ఏపీతో జరుగుతున్న జల వివాదంతో మొదట కేంద్రం స్పందన తెలంగాణ బీజేపీకి బూస్ట్ ఇచ్చింది. కేంద్రం ఏపీ ప్రభుత్వానికి వరుస లేఖలు రాయడంతో సంజయ్ టీమ్ సంబరాలు చేసుకుంది. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు మిగల్లేదు. ఏపీ ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్రం యూ టర్న్ తీసుకోవడంతో సంబరాలు చేసుకున్న తెలంగాణ బీజేపీ నేతలే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.
కృష్ణా జల వివాదం, ఏపీ సర్కార్ కొత్తగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ గా స్పందించారు. ఏపీ అక్రమంగా ప్రాజెక్టులు కడుతుందని బహిరంగా ప్రకటనలు చేశారు. అంతేకాదు కేంద్ర జల వనరుల శాఖకు ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ మొదట మౌనంగా ఉండటంతో... ఇదే అస్త్రంగా టీఆర్ఎస్ సర్కార్ పై దాడికి దిగారు తెలంగాణ బీజేపీ నేతలు. టీఎస్ నేతల ఫిర్యాదుపై కేంద్రం కూడా వేగంగానే స్పందించింది. రాయలసీమ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. దీంతో తెలంగాణ బీజేపీ నేతలు సంబరపడ్డారు. తమ పోరాటం వల్లే ఏపీ ప్రాజెక్టులకు బ్రేక్ పడిందని చెప్పుకున్నారు. తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోలేదని, తామే పాలమూరు రైతులకు నష్టం జరగకుండా చూశామని గొప్పలు చెప్పుకున్నారు. జల వివాదంలో బండి సంజయ్ టీమ్ పోరాటానికి తెలంగాణ ప్రజల్లో మైలేజీ కూడా వచ్చినట్లు కనిపించింది. ఇదే స్పూర్తిగా మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని తెలంగాణ కమలనాధులు కార్యాచరణ రచించారు.
అయితే తెలంగాణ బీజేపీ నేతల స్పీడ్ కు బ్రేకేసింది కేంద్ర సర్కార్ తాజా నిర్ణయం.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ లో జరుగుతున్న విచారణలో.. ఏపీ వాదనను సమర్ధించేలా కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పాత పథకమేనని స్పష్టం చేసింది. దానివల్ల అదనపు ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని తెలిపింది. ప్రాజెక్ట్ కు పర్యావరణ అనుమతులు అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఎలాంటి నిబంధనల ఉల్లంఘనలు జరగలేదని వెల్లడించింది. ఎన్జీటీలో కేంద్రం వేసిన అఫిడవిట్ తో తెలంగాణ బీజేపీ నేతలకు షాక్ తగిలింది. ఇంతకాలం తామే కేంద్రానికి ఫిర్యాదు చేసి ఏపీ ప్రాజెక్టులను అడ్డుకున్నామని చెప్పి న నేతలు... ఇప్పుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కేంద్రం అఫిడవిట్ తో తాము చేస్తున్న పోరాటమంతూ బూడిదలో పోసిన పన్నీరులా మారిందని ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే మంచి అవకాశం కోల్పోయామని చెబుతున్నారు. పార్టీ దూకుడుకు వెళుతున్న సమయంలో ఇలా జరగడమేంటనీ తెలంగాణ కమలనాధులు మధనపడుతున్నారు. మరోవైపు రాయలసీమ లిఫ్ట్ స్కీంపై తెలంగాణ బీజేపీ నేతలు అత్యూత్సాహం ప్రదర్శించారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు. రాష్ట్రాల మధ్య వివాదాలు వచ్చినప్పుడు జాతీయ పార్టీ నేతలు ఆచితూచి వ్యవహరించాలని, దూకుడుగా వెళితే ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పారు.