139 మంది అత్యాచారం కేసులో ట్విస్ట్.. డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే వారిపై కేసులు
posted on Aug 31, 2020 @ 2:14PM
తనపై 139 మంది అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదు చేయడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ 139 మందిలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉండటంతో.. ఈ విషయం పెను సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ కేసులో ట్విస్ట్ వెలుగుచూసింది. డాలర్ బాయ్ అనే వ్యక్తి ఒత్తిడి వల్లనే తాను ప్రముఖులపై కేసులు పెట్టానని బాధిత యువతి చెప్పింది.
నిజానికి ఈ కేసు వెలుగులోకి రాగానే ఈ కేసుపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. బాధిత యువతిని కొంత మంది తప్పుదోవ పట్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు, ఈ కేసులో పలువురి ప్రముఖుల పేర్లు వినిపించడంతో.. వారిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ కేసుకి తమకి సంబంధం లేదని, కావాలనే మా పేర్లు ఇరికించారని ప్రముఖులు చెప్పుకొచ్చారు. అంతేకాదు, డబ్బులు డిమాండ్ చేస్తూ మాకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పోలీసులు తమకి న్యాయం చేయాలని కోరారు. దీంతో ఈ కేసు మలుపు తిరిగి, డాలర్ బాయ్ అనే పేరు తెరమీదకి వచ్చింది. ఈ డాలర్ బాయ్ అనే వ్యక్తి యువతిని ట్రాప్ చేసి, ప్రముఖుల నుండి డబ్బులు గుంజడం కోసం ఇదంతా చేపిస్తున్నాడన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ అనుమానాలే నిజమయ్యాయి. బాధిత యువతి ఆ డాలర్ బాయ్ బండారం బయట పెట్టింది.
బాధితురాలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. "డాలర్ బాయ్ ఒత్తిడి మేరకే కొందరి పేర్లు పెట్టాల్సి వచ్చింది. నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు. చిత్ర హింసలకు గురి చేశాడు. నాలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడు. నాపై లైంగికదాడి జరిగింది వాస్తవమే. కానీ సెలబ్రిటీలు లేరు. నేను బయట 50 శాతం వేధింపులకు గురైతే, 50 శాతం డాలర్ బాయ్ వేధించాడు. అనవసరంగా నా వల్ల ఇబ్బంది పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నా." అని చెప్పుకొచ్చింది.
కాగా, డాలర్ బాయ్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అతని వల్ల బాధితురాలికి జరిగిన అన్యాయం తప్పుదోవ పట్టడంతో పాటు, పలువురు ప్రముఖులు, వారి కుటుంబసభ్యులు మానసిక వేదనికి గురయ్యారు. అంతేకాదు, మరో ఇద్దరు యువతులను కూడా అతను ట్రాప్ చేశాడని తెలుస్తోంది. ఇలాంటి వారి మూలంగా భవిష్యత్ లో ఎవరైనా తమకి అన్యాయం జరిగిందని చెప్పాలన్నా భయపడే పరిస్థితి నెలకొందని, కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్స్ వ్యక్తమవుతున్నాయి.