దళిత యువకుడికి శిరోముండనం.. నూతన్ నాయుడు భార్యపై కేసు నమోదు
posted on Aug 29, 2020 @ 2:45PM
విశాఖలోని పెందుర్తిలో దళిత యువకుడుకి శిరోముండనం ఘటనలో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1 నిందితురాలిగా బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు భార్య మధుప్రియ పేరు నమోదైంది. మధుప్రియతో పాటు ఇంట్లో సహాయకులుగా ఉన్న ఇందిర, ఝాన్సీ, వరహాలు, బాలు, సౌజన్య, రవిల పైనా కేసు నమోదు చేశారు.
బిగ్‌బాస్ కంటెస్టెంట్, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడుకి శిరోముండనం చేశారు. నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసే శ్రీకాంత్ అనే యువకుడు.. వ్యక్తిగత కారణాలతో చెప్పకుండా పని మానేశాడట. అయితే శుక్రవారం శ్రీకాంత్ కు నూతన్ భార్య మధుప్రియ ఫోన్ చేసి ‘నువ్ సెల్‌ఫోన్ తీశావు.. ఇంటికిరా మాట్లాడాలి’అని పిలిచారు. అక్కడకు వెళ్లిన శ్రీకాంత్‌ను నిర్బంధించి, శిరోముండనం చేయించారు. దీంతో అతడు తనకు జరిగిన అన్యాయంపై పెందుర్తి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు వెస్ట్ ఏసీపీ శ్రావణ్‌కుమార్, ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పెందుర్తి పీఎస్‌కు చేరుకుని బాధితుడితో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి. తాజాగా శిరోమండనం ఘటనపై సీసీ ఫుటేజ్ ను పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా విడుదల చేశారు. ఈ వీడియోలో శ్రీకాంత్ కు శిరోముండన చేసినట్లు పక్కాగా ఆధారం లభించింది. ఈ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని.. కొంత ఫుటేజ్‌ను తొలగించినట్లు గుర్తించామన్నారు సీపీ. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూతన్ నాయుడు భార్యతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.