అమరావతి రైతులకు అన్యాయం జరగకూడదు.. తుది వరకు బాధ్యతగా నిలబడతాం
posted on Aug 29, 2020 @ 5:17PM
ఏపీ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేసేందుకు అన్ని పార్టీలకు అవకాశమివ్వాలని హైకోర్టు నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాజధాని తరలింపుపై కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది.
ఈ విషయంపై చర్చించేందుకు ఈరోజు జనసేన నేతలతో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారి అభిప్రాయాలు తెలుసుకున్న పిమ్మట కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కౌంటర్ దాఖలుతో పాటు కేసులో తుది వరకు బాధ్యతగా నిలబడాలని, న్యాయనిపుణుల సహకారంతో గడువులోగా కౌంటర్ వేయాలని జనసేన నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాజధాని అంశంలో జనసేన తొలి నుంచి స్పష్టమైన అభిప్రాయంతో ఉందని వెల్లడించారు. ప్రభుత్వాన్ని నమ్మి 28వేల మంది రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదని జనసేన బలంగా చెబుతోందని స్పష్టం చేశారు. ఇప్పుడు రాజధాని తరలింపుకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సూచించిన నేపథ్యంలో, న్యాయనిపుణుల సలహా తీసుకుని గడువులోగా కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. అంతేకాకుండా, ఈ కేసులో చివరి వరకు బాధ్యతగా నిలబడతామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో ఘోర ఓటమి, బీజేపీతో దోస్తీ తర్వాత సైలెంట్ అయిన జనసేన.. మళ్ళీ రాజధాని అంశంతో గళం వినిపించాలని చూస్తోంది. రాజధాని అంశంపై మిత్రపక్షమైన బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్న వేళ.. అమరావతి రైతుల కోసం జనసేన ఎంతవరకు పోరాడుతుందో?.. జనసేన పోరాటంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.