దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు
posted on Aug 29, 2020 @ 6:16PM
ఏపీలో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దళిత యువకుడికి శిరోముండనం, అధికార పార్టీ నేతల బెదిరింపులకు భయపడి దళిత యువకుడి ఆత్మహత్య ఇలా నిత్యం ఏపీలో ఏదోక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా మరో వార్త వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాలో దళితుడిపై అధికార పార్టీకి చెందిన నాయకుడు దాడి చేశాడు. ఈ దాడికి సంబంధించిన వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన టీడీపీ నేత నారా లోకేష్.. అధికార పార్టీ తీరుపై విరుచుకుపడ్డారు.
రాష్ట్రంలో వైఎస్ జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది అని లోకేష్ విమర్శించారు. రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైసీపీ నాయకులకు నిద్ర పట్టడం లేదని మండిపడ్డారు. అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైసీపీ నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడు.. అంటూ, దీనికి సంబంధించిన వీడియోను లోకేష్ షేర్ చేశారు.
శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితుల పై దమనకాండ కొనసాగిస్తున్నారు జగన్ రెడ్డి అని విమర్శించారు. దళితులపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు.