మళ్లీ వాయిదా.. తొందరపాటు నిర్ణయాలు.. విపక్షాల ఫైర్!
posted on Sep 5, 2020 @ 9:56AM
ఆంధ్రప్రదేశ్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలతో గందరగోళం నెలకొంటుంది. ఇప్పటికే పలు అంశాల్లో హడావుడిగా నిర్ణయాలు తీసుకుని.. తర్వాత మళ్లీ మార్చుకుంది. కరోనా ప్రభావంతో మూతపడిన విద్యాసంస్థ రీ ఓపెన్ పైనా జగన్ సర్కార్ నిర్ణయాలు విద్యార్థులు, వారి పేరెంట్స్ ను అయోమయానికి గురి చేశాయి. కేంద్రం లాక్ డౌన్ మార్గదర్శకాల ప్రకారమే ఎడ్యుకేషనల్ సంస్థలు తెరవాల్సిన ఉన్నా.. ఏపీ సర్కార్ మాత్రం ముందే నిర్ణయాలు తీసుకుంది. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు లేకున్నా సెప్టెంబర్ 5న స్కూల్స్ తెరుస్తామని ప్రకటించింది. ఇంతలోనే కేంద్రం గైడ్ లైన్స్ రావడంతో మళ్లీ అక్టోబర్ 5కు వాయిదా వేసింది.
ఈ విద్యా సంవత్సరాన్ని ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 5 నుంచిపునర్ ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది. అదే రోజు జగనన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఏపీలో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో వైరస్ విస్తరించింది. దీంతో స్కూల్స్ తెరవడం సరికాదని పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు కూడా పిల్లల జీవితాలతో చెలగాటమాడొద్దని, స్కూల్స్ తెరిచే విషయంలో తొందర పడవద్దని సూచించాయి. అయినా స్పందించలేదు జగన్ సర్కార్. సెప్టెంబర్ 5నే విద్యాసంస్థలను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు తెరవకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. దీంతో వెనక్కి తగ్గింది ఏపీ సర్కార్. స్కూల్స్ ఓపెనింగ్ ను అక్టోబర్ 5కి వాయిదా వేసింది. జగనన్న విద్యా కానుక కార్యక్రమం కూడా అదే రోజున నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. గతంలోనూ ఎలాంటి ప్రణాళిక లేకుండానే, ముందస్తు జాగ్రత్తలు లేకుండానే ఆగష్టు3 నుంచి పాఠశాలలన్నీ తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే అన్ని జిల్లాల్లోనూ కరోనా కేసులు భారీగా పెరగడంతో వాయిదా వేసింది.
జగన్ సర్కార్ తొందరపాటు నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ఏపీతో పోల్చితే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి. కాని అక్కడ విద్యాసంస్థలను తెరవాలని అక్కడి సర్కార్ నిర్ణయించలేదు. ఆన్ లైన్ క్లాసులు ప్రారంభించింది. డీడీతో ఇతర ఛానళ్ల ద్వారా ప్రసారాలు అందిస్తోంది. డిజిటల్ టీచింగ్ కు తెలంగాణలో మంచి స్పందన వస్తోంది. 90 శాతం మంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వింటున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మరికొన్ని రాష్ట్రాల్లోనూ డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి. ఏపీ సర్కార్ మాత్రం ఆన్ లైన్ క్లాసుల ఆలోచన చేయకుండా స్కూల్స్ తెరుస్తామంటూ మొండిగా ముందుకెళ్లింది. కేంద్రం ఆదేశాలతో మళ్లీ వాయిదా వేసుకుంది. ఇప్పుడు తెలంగాణలో డిజిటిల్ టీచింగ్ కొనసాగుతుండగా.. ఏపీలో అందుకు అవకాశం లేకుండా పోయింది. జగన్ సర్కార్ తొందరపాటు నిర్ణయాల వల్లే విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. కరోనా ఎప్పటికి కట్టడిలోకి వస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారంటున్న పేరంట్స్.. ఇప్పటికైనా స్కూల్స్ తెరవడంపై ఫోకస్ చేయకుండా ఆన్ లైన్ క్లాసులపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.