సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. పొలిటికల్ ఎంట్రీపై లారెన్స్ కీలక ప్రకటన
posted on Sep 5, 2020 @ 4:34PM
ఎందరో సినీ స్టార్స్ రాజకీయాల్లోకి వస్తుంటారు. అయితే వారిలో కొందరు మాత్రమే సక్సస్ అవుతారు. సినిమాల ద్వారా కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్న స్టార్స్ సైతం.. రాజకీయాల్లోకి అడుగు పెట్టాక ఓట్లు సంపాదించటానికి అవస్థలు పడుతుంటారు. అయినప్పటికీ ఎందరో సినీ స్టార్స్ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంటారు.
తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఎన్నో ఏళ్లుగా చర్చ జరుగుతుంది. ప్రతి ఏడాది ఆయన ఈ పుట్టినరోజు నాడు పార్టీని ప్రకటించబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు. తీరా ఆయన పుట్టినరోజు నాడు ఎటువంటి ప్రకటన ఉండదు. ఇది కొన్నేళ్లుగా జరుగుతున్న తంతు. మరోవైపు రజనీకాంత్ కూడా రాజకీయాల్లోకి వస్తా అంటారు కానీ, ఎప్పుడొస్తారో క్లారిటీ ఇవ్వరు. దీంతో అసలు ఆయన రాజకీయాల్లోకి రారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే రజినీకాంత్ పొలిటికల్ పార్టీ గురించి తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు లారెన్స్ కీలక ప్రకటన చేశారు. త్వరలో రజనీకాంత్ పార్టీ పెట్టబోతున్నారని, ఆ పార్టీలో తాను చేరబోతున్నానని స్పష్టం చేశారు.
రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్ తాను రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘ఎన్నో ఏళ్లుగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఎంతో మంది అభిమానులు, సన్నిహితులు నన్ను రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారందరికీ ఓ శుభ వార్తను చెబుతున్నా. నా గురువు రజనీకాంత్ పార్టీ ప్రకటన అనంతరం ఆయన పార్టీలో చేరతాను. నా సమాజ సేవకు జయలలిత, కరుణానిధితో పాటు స్టాలిన్, పళనిస్వామి ఎంతో సహాయం చేశారు. నేటి రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం తప్పడంలేదు. కానీ రజనీకాంత్ మాత్రమే విపక్ష నాయకులపై విమర్శలు చేయకుండా రాజకీయాలు చేయగలరు. అందునే నేను ఆయన దారిలో నడవాలని నిర్ణయించుకున్నా. నాకు సహాయం చేసిన వారిని నేను విమర్శించలేను’ అని లారెన్స్ ట్వీట్ చేశారు.
లారెన్స్ చేసిన ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ పార్టీపై తమిళనాడులో మళ్లీ చర్చలు మొదలైయ్యాయి. రాజకీయాలకు దూరంగా ఉండే లారెన్స్.. ఉన్నట్టుండి రజనీకాంత్ పార్టీ ప్రకటన అనంతరం ఆయన పార్టీలో చేరతానని చెప్పడం చూస్తుంటే.. త్వరలోనే రజనీకాంత్ పార్టీ ప్రకటన ఖచ్చితంగా ఉంటుందని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.