ప్రతిపక్షాల గళం నొక్కే ప్రయత్నం
posted on Sep 5, 2020 @ 6:22PM
మీడియా పాయింట్ ఎత్తేయడం పై విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా ఏ పార్టీకి లేదు. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ రెండంకెలకే పరిమితం కాగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, బిసీల పార్టీగా ఉన్న టిడిపీ ఒక్కస్థానానికే పరిమితం అయ్యాయి. ప్రధాన ప్రతిపక్షం హోదా ఏ పార్టీకి లేకపోవడంతో అధికార పార్టీ తన ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రాష్ట్ర అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కడానికి అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. శాసన సభలో అధికార పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఆ కొద్ది మంది సభ్యులకు కూడా సమావేశాలలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో చాలాసార్లు వారి తమ గోడునంతా మీడియా పాయింట్ వద్ద మీడియాతో పంచుకుంటారు. ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఈ సారి కరోనా సాకుగా చూపిస్తూ అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ను రద్దు చేశారు. దాంతో ప్రతిపక్ష నేతలు తమ గళం వినిపించే అవకాశం లేకుండా పోయింది. సభలో మాట్లాడినప్పుడల్లా మైక్ కట్ చేయడం చేసే అధికార పార్టీ ఈ సమావేశాల్లో ఏకంగా మీడియాకు ప్రతిపక్షాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తోంది అని ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు విమర్శిస్తున్నారు.
అసెంబ్లీ సభా సమావేశాలు నిర్వహించడానికి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కార్యక్రమాలు నిర్వహించడానికి అడ్డురాని కరోనా నిబంధనలు మీడియా పాయింట్ విషయంలోనే అడ్డు వస్తున్నాయని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత భరించలేని ప్రభుత్వం గతంలో ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు తమ గళం వినిపించే వేదికైన ధర్నాచౌక్ ను ఎత్తేసింది. ప్రశ్నించే గళానికి వేదిక లేకుండా చేసింది. అయితే కొన్ని పౌర సంఘాలు హైకోర్టుకు వెళ్లడంతో ధర్నాచౌక్ ను తిరిగి అనుమతి వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీ లో ప్రతిపక్షాలు తమ గళం వినిపించడానికి ఉన్న ఏకైక వేదిక మీడియా పాయింట్ ను ఎత్తేయడం ప్రతి పక్షాల గొంతులు నొక్కే కుట్రలో భాగమే అని మండిపడుతున్నారు. మీడియా పాయింట్ లేకుండా చేయడం ద్వారా ప్రతిపక్షం మీడియా ముందు తమ గోడు వెళ్లబోసుకున్న అవకాశం లేకుండా చేయవచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఉందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలకు కరోనా నిబంధనలను అమలు చేసినట్లు మీడియా పాయింట్ వద్ద కూడా కరోనా నిబంధనలను అమలు చేస్తే సరి పోయే దానికి మీడియా పాయింట్ ను చేయాల్సిన అవసరం లేదని సీనియర్ నేతలు అంటున్నారు. ప్రభుత్వం పథకం ప్రకారం కావాలనే ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపణలు వస్తున్నాయి.