ఎన్టీఆర్ పాఠ్యాంశం.. కేసీఆర్ డేర్ .. బాబు ఢీలా! జగన్ నిర్ణయం...
posted on Sep 6, 2020 @ 11:08AM
రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ సీఎం కేసీఆర్ దిట్ట. పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఎత్తులు వేస్తూ ముందుకు పోతుంటారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఆయన ఎప్పటికప్పుడు కార్యాచరణ మారుస్తూ వెళ్లారు. తనకు నచ్చిన ఆలోచనలు, వ్యూహాలు వెంటనే అమలు చేస్తుంటారు. ముఖ్యమంత్రిగానూ ఆయన తాను అనుకున్నది చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇబ్బంది అవుతుందని తెలిసినా కొన్ని విషయాల్లో ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గరు. సమగ్ర సర్వే, కాళేశ్వరం ప్రాజెక్టు, భూముల సర్వే.. ఇలా అన్నివిషయాల్లో విపక్షాలు ఎన్ని ఆరోపణలు, విమర్శలు చేసినా కేసీఆర్.. ఎవరిని పట్టించుకోకుండా తాను అనుకున్నది చేస్తూ పోయారు. తాజాగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని 10వ తరగతి సాంఘిక శాస్త్రంలో చేర్చారు కేసీఆర్. సాంఘిక శాస్త్రంలో 268వ పేజీలో ఎన్టీఆర్ పాఠ్యాంశాన్ని ముద్రించారు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుంచి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి అవమానం జరిగిందని భావించిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని... పేదలకు రూ.2కే కిలో బియ్యం,మధ్యాహ్నం భోజన పథకం,మధ్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని ఎన్టీఆర్ జీవిత చరిత్రకు సంబంధించిన విశేషాలను పాఠ్యాంశంలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ విదేశాలకు వెళ్లినప్పుడు జరిగిన నాదెండ్ల భాస్కరరావు తిరుగుబాటు ఎపిసోడ్‌ను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించారు.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ నిర్ణయాన్ని టీడీపీ నేతలు స్వాగతిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే,టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన తండ్రి ఎన్టీఆర్ జీవితాన్ని పాఠ్య పుస్తకాల్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
కేసీఆర్ నిర్ణయంతో చంద్రబాబు వ్యవహారశైలిపైనా ప్రచారం జరుగుతోంది. టీడీపీ వ్యవస్థాపకుడు, తన మామైన ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యంశంగా చేర్చాలని చంద్రబాబు ఆలోచన చేయలేకపోయారనే వాదన వస్తోంది. అయితే చంద్రబాబు ఏ నిర్ణయాన్ని డేర్ గా తీసుకోలేరని, ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశంగా మారిస్తే విపక్షాలు వ్యతిరేకిస్తాయని ఆయన ఆలోచించి ఉండవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న విషయంలోనూ చంద్రబాబు విఫలమయ్యారని ఆయన వ్యతిరేకులు విమర్శిస్తుంటారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. చంద్రబాబు ఆ డిమాండ్ ను కూడా నేరవెర్చలేదు. ప్రస్తుత సీఎం జగన్ మాత్రం జిల్లాల పునర్విభజనకు సిద్ధమవుతున్నారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబుకు ఇబ్బందే. ఎన్టీఆర్ పేరును ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు వాడుకున్నారని ఆయన వ్యతిరేకులు మరింత ప్రచారం చేసే అవకాశం ఉంది.
మొత్తానికి పదో తరగతి పాఠ్యాంశంలో ఎన్టీఆర్ జీవిత చరిత్రను చేర్చిన తెలంగాణ సీఎం కేసీఆర్.. అన్నగారి అభిమానులతో పాటు టీడీపీ కార్యకర్తల ప్రశంసలు అందుకుంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. అయితే ఎన్టీఆర్ పాఠ్యాంశంపై తెలంగాణలోని ఇతర రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తిగా మారింది. తెలంగాణ ఉద్యమ సంఘాల నుంచి వ్యతిరేకత రావచ్చని భావిస్తున్నారు. మొత్తానికి రాజకీయాల్లో కేసీఆర్ రూటే సెపరేటు కదూ..