టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు? చాడాతో కేసీఆర్ లంచ్.. కాంగ్రెస్ కు షాకే..
posted on Sep 12, 2020 9:25AM
సిద్ధిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ స్థానానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతిచ్చే అవకాశం ఉంది. సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డితో సీఎం కేసీఆర్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ చాడాను కోరినట్లు సమాచారం. అయితే మద్దతుపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చాడా చెప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం అసెంబ్లీకి వెళ్లిన చాడా వెంకట్ రెడ్డి మధ్యాహ్న సమయంలో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఇద్దరు కలిసి లంచ్ చేశారు. వర్తమాన రాజకీయాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్పాయి. అయితే దుబ్బాక ఉప ఎన్నికపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
గతంలోనూ పలు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ సపోర్ట్ చేసింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో గత సంవత్సరం అక్టోబర్ లో జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు మొదట సీపీఐ మద్దతు ఇచ్చింది. ఆ సమయంలోనే జరిగిన ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వ తీరుపై విపక్షాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. అధికార పార్టీకి మద్దతివ్వడంపై కార్మిక సంఘాల నుంచి ఒత్తిడి పెరగడంతో తర్వాత మద్దతు ఉపసంహరించుకుంది సీపీఐ. అయినా హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలో సీపీఐ కార్యకర్తలంతా లోపాయకారిగా కారు పార్టీకే మద్దతు ఇచ్చారని ఫలితాల్లో తేలింది. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల రాజీనామాలతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ సీపీఐ పార్టీ గులాబీ అభ్యర్థులగా అండగా నిలిచింది. 2009 ఎన్నికల్లో టీడీపీ, వామపక్షాలతో కలిసి టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. 2004లో కాంగ్రెస్, వామపక్షాలు, టీఆర్ఎస్ కూటమిగా పోటీ చేశాయి.
దుబ్బాక ఉపఎన్నికను బీజేపీ, కాంగ్రెస్ లు సవాల్ గా తీసుకున్నాయి. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావిస్తున్న విపక్షాలు.. దాన్ని క్యాష్ చేసుకుని దుబ్బాకలో జెండా ఎగరేయాలని ప్లాన్ చేస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రచారంలో దూకుడుగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్.. ఈసారి గట్టిగా పోరాడితే విజయం ఖాయమనే ధీమాలో ఉంది. వామపక్షాలను కలుపుకుని అధికారపార్టీకి ఝలక్ ఇవ్వాలని భావించింది. అయితే కాంగ్రెస్ ప్లాన్ ముందే పసిగట్టిన కేసీఆర్.. సీపీఐతో చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. దుబ్బాకలో పార్టీకి సానుకూల పవనాలు లేకపోవడం వల్లే కేసీఆరే స్వయంగా చాడాను తన ఛాంబర్ కు పిలిపించుకుని మాట్లాడారనే ప్రచారం కూడా జరుగుతోంది.
దుబ్బాక ఉపఎన్నికలో మద్దతుపై సీపీఐ తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ స్కీంకు వ్యతిరేకంగా జిల్లాల్లో సీపీఐ ఆందోళనలు చేస్తోంది. గతంలో హుజూర్ నగర్ బైపోల్ లో అధికార పార్టీకి మద్దతిచ్చినప్పుడు ఆరోపణలు ఎదుర్కొంది. దీంతో ఈసారి చాడా టీమ్ ఏం నిర్ణయం తీసుకుంటుందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు ఇస్తే.. ఉప ఎన్నిక షెడ్యూల్ కు ముందే విపక్షాలకు షాకివ్వడంలో కేసీఆర్ ఓ విజయం సాధించినట్లే..