విజయసాయికి నాలుగు తగిలిస్తే ఆ కుట్ర బయటపడుతుంది
posted on Sep 11, 2020 @ 7:23PM
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో రధం దగ్ధం చేసిన ఘటన రాష్ట్రంలో తీవ్ర అలజడి రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన పై వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ "రథం దగ్ధం వ్యవహారంలో చంద్రబాబు హస్తముంది. హైదరాబాద్‌లో ఉంటూ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ఆయన కుట్ర చేస్తున్నారు. ఈ ఘటనలో గుంటూరు, హైదరాబాద్ వ్యక్తుల ప్రమేయాన్ని ఏపీ పోలీసులు గుర్తించారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగాయని ప్రచారం చేయాలనుకుంటున్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు కోరాం. త్వరలోనే ఈ వ్యవహారంలో చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుంది.'' అని విజయసాయిరెడ్డి అన్నారు.
అయితే తాజాగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి డైరెక్షన్‌లో ఏపీలో హిందూత్వంపై వ్యవస్థీకృతమైన దాడి జరుగుతోందని ట్విట్టర్ వేదికగా సెన్సషనల్ కామెంట్స్ చేశారు. "వివేకా గారు చనిపోతే ముందు గుండెపోటు అన్న దొంగ బ్యాచ్ తరువాత బాబాయ్ ని చంద్రబాబు, లోకేష్ చంపేసారు. దీని పై సీబీఐ వెయ్యాలి అని చిల్లర హడావిడి చేసారు. తీరా అధికారంలోకి వచ్చాక బాబాయ్ ని లేపేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే అనే విషయం బయటపడకుండా సీబీఐ విచారణ అడ్డుకోవడానికి కుట్ర పన్నారు. అధికారంలో ఉండి దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నాడు విజయసాయిరెడ్డి. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి డైరెక్షన్ లో ఆర్గనైజ్డ్ గా హిందుత్వం పై దాడి జరుగుతోంది. తిరుమల కొండపై అన్యమత ప్రచారం, దేవతా విగ్రహాలు ధ్వంసం, 60 వేలకోట్ల విలువైన మాన్సాస్ భూములు మింగడం, అంతర్వేది లో రథం తగలబెట్టడం అందులో భాగమే. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టిన జగన్ రెడ్డి మతాల మధ్య కూడా చిచ్చుపెడుతున్నాడు. రధాన్ని కాల్చింది పిచ్చోడు, తేనెటీగలన్న సాయిరెడ్డి ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ పై విషం కక్కుతున్నాడు. సాయిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి నాలుగు తగిలిస్తే లోటస్ పాండ్ వేదికగా హిందుత్వం పై జరుగుతున్న కుట్ర బయటపడుతుంది." అంటూ సంచలన ట్వీట్లు చేశారు.