యువనేతకే పగ్గాలు! ఇంచార్జ్ తో సిగ్నల్.. రేవంత్ రూట్!
posted on Sep 12, 2020 @ 12:37PM
కాంగ్రెస్ పార్టీ జాతీయ కమిటీలో జరిగిన మార్పులు తెలంగాణ హస్తం పార్టీలో కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులుగా సీనియర్లను కాదని తొలిసారి యువ నేతలకు ఎక్కువ అవకాశం ఇచ్చింది హైకమాండ్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా తమిళనాడుకు చెందిన 45 ఏండ్ల మణికం ఠాగూర్ ను నియమించింది. ప్రస్తుతం ఠాగూర్ తమిళనాడులోని విరుదునగర్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. తెలంగాణకు ఇంచార్జ్ గా యువకుడు రావడం ఇదే తొలిసారంటున్నారు.
కొత్త ఇంచార్జి నియామకంతో తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై చర్చ జరుగుతోంది. ఇంచార్జ్ గా యువ నాయకుడు వచ్చారు కాబట్టి పీసీసీ పగ్గాలు కూడా యువనేతకే ఇస్తారనే ప్రచారం గాంధీభవన్ లో జరుగుతోంది. తెలంగాణ పీసీసీ రేసులో ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తాను కూడా పీసీసీ రేసులో ఉన్నానని ప్రకటించారు. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కూడా పార్టీ సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ప్రస్తుతం యువ నేతలకు ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ సహా చాలా రాష్ట్రాలకు యువకులను ఇంచార్జీలుగా నియమించింది. అట్లాగే తెలంగాణ పీసీసీ కూడా యువనేతకే వస్తుందని ఖాయంగా చెబుతున్నారు.
కొత్త ఇంచార్జ్ ఠాగూర్ ఎంపీగా ఉన్నారు. ఆయనతో మన ఎంపీలకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న రేవంత్ రెడ్డితో ఠాగూర్ కు ఫ్రెండి షిప్ ఉందంటున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ను ధీటుగా రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ ఎంపీల్లో ఉందంటున్నారు. లోక్ సభలోనూ పలువురు ఎంపీలు ఈ విషయంలో రేవంత్ ను అభినందించినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ ఉందనే అభిప్రాయం హైకమాండ్ కు ఉందంట. ఇలా ఏ రకంగా చూసినా తెలంగాణ పీసీసీ పగ్గాలు యువకుడైన రేవంత్ రెడ్డిపై వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి పీసీసీ నాయకత్వ మార్పుపై ప్రచారం జరుగుతోంది. కాని ఛేంజ్ మాత్రం జరగలేదు. అయితే త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ ఎన్నికల తర్వాతే కొత్త పీసీసీని నియమిస్తారని అనుకుంటున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లోనూ సత్తా చాటి .. పీసీసీ రేసులో తనకు పోటీ లేకుండా చూసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, తన లోక్ సభ పరిధిలోకి వచ్చే గ్రేటర్ లోని 48 డివిజన్లలో మెజార్టీ సీట్లు సాధించేలా ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది.