తెలుగువన్ ఎండీపై కేసుని కోర్టు కొట్టివేయడం అరాచకవాదులకు చెంపపెట్టు
posted on Sep 12, 2020 @ 1:11PM
సీఎం వైఎస్ జగన్ దగ్గర మార్కుల కోసం కొంత మంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేత నారా లోకేష్ విమర్శించారు. ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా అభ్యంతరకర వార్త ప్రసారం చేశారని ఆరోపిస్తూ తెలుగు వన్ సంస్థపై సీఐడీ అధికారులు అక్రమకేసు పెట్టగా.. దానిని హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో సీఐడీ పోలీసులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సీఐడీ పోలీసులు ప్రభుత్వానికి సాధనంగా మారి.. ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలో ట్విట్టర్ వేదికగా స్పందించిన లోకేష్.. అధికార పార్టీ తీరుని, అధికారుల తీరుని తప్పుబట్టారు.
"మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అని హై కోర్టు వ్యాఖ్యానించింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది. జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, "ఖాకిస్టోక్రసీ" ప్రదర్శిస్తున్నారు కొంత మంది అధికారులు." అని లోకేష్ వ్యాఖ్యానించారు.
"గతంలో కూడా ఇలానే చేసి కొంత మంది అధికారులు జగన్ రెడ్డి గారితో కలిసి ఊచలు లెక్కపెట్టారు. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని హరించడానికి కూడా వెనకాడటం లేదు. కనీసం నోటీసు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారు." అని మండిపడ్డారు.
"వాస్తవాలను ప్రసారం చేశారన్న అక్కసుతో teluguone.com ఎండీ రవిశంకర్ గారిపై అక్రమ కేసు పెట్టి వేధించారు. ఈ కేసుని కోర్టు కొట్టివెయ్యడం అరాచకవాదులకు చెంపపెట్టు. పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవడానికి అందరూ కలిసి పోరాడాలి." అని లోకేష్ పేర్కొన్నారు.