మంత్రి కొడాలి నాని వ్యాఖ్యల పై తాడేపల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు
posted on Sep 11, 2020 @ 5:36PM
ఏపీ పౌర సరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని కొద్దీ రోజుల క్రితం వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, గన్నవరం ఎమ్మెల్యే వంశీ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయమై దేవినేని ఉమ తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఒక బాధ్యత గల మంత్రి అయి ఉండి తనను లారితో యాక్సిడెంట్ చేసి చంపేస్తా అని బెదిరించారని అయన పేర్కొన్నారు. మంత్రి పదవిలో ఉన్న నాని తమను తమ పార్టీ అధినేత చంద్రబాబును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారని అయన పేర్కొన్నారు. ఇదే కేసులో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ, వసంత కృష్ణప్రసాద్ లపై కూడా అయన ఫిర్యాదు చేశారు.
సీఎం జగన్ మెప్పు పొందటానికే మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. అమరావతి రైతులు, దళితులను, న్యాయ విభాగంలో ఉన్నవారిని వైసిపి నాయకులు తిడితే కేసులు ఉండవని ఉమా అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులే వైకాపా నాయకులకు వత్తాసు పలుకుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడలో టీడీపీ నాయకులపై 20 మంది గుండాలు ఇంటిమీద దాడి చేస్తే ఇప్పటివరకు చర్యలు లేవని విమర్శించారు. దీనిపై డీజీపీ సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయాలని అయన డిమాండ్ చేశారు. తాను గతంలోనూ ఎన్నో ప్రభుత్వాలను విమర్శించానని.. అయితే అప్పుడు ఎవరూ తనను బెదిరించలేదని అన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం రోజూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని.. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలా జరగలేదని అయన వాపోయారు. ఇదంతా పూర్తిగా సీఎం జగన్ ప్రోత్సాహంతోనే జరుగుతోందని దేవినేని ఉమ ఆరోపించారు.
టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని చెప్పారు. ప్రశ్నించే వారిపై భౌతికదాడులకు పాల్పడుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో జగన్ అరాచకపాలనపై ప్రజలు తిరగబడతారని అయన అన్నారు.