దుబ్బాకలో రేవంత్ జోరు.. అధికార పార్టీలో గుబులు!!
posted on Oct 17, 2020 @ 1:02PM
కాంగ్రెస్ పార్టీ అనగానే మొదటగా గుర్తొచ్చేది అంతర్గత కుమ్ములాటలు. నాయకుల మధ్య సఖ్యత చాలా తక్కువ. ఎవరికి వారు తామే తోపు, వేరే నాయకుడు చెప్పింది మేమెందుకు వినాలి అన్నట్టు ఉంటుంది నాయకుల తీరు. ఇక తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి సరేసరి. నాయకులు ఎవరికి వారు యమునా తీరే అన్నట్లు ఉంటారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి అధికార పార్టీని డీ కొట్టాల్సింది పోయి.. టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే పనిచేస్తాం లేదంటే మా దారి మేం చూసుకుంటాం అన్నట్టుంటుంది పరిస్థితి. అయితే, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా మాణికం ఠాకూర్ రాకతో ఈ పరిస్థితిలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది. దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించడంతో రాష్ట్ర స్థాయి నాయకులంతా అంతర్గత విభేదాలు పక్కన పెట్టి పార్టీ గెలుపుకోసం ప్రచారంలో మునిగిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రచారంలో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ దుబ్బాకలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. కానీ ఈ ఉపఎన్నిక పోరులో మాత్రం కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగడం, రాష్ట్ర స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొనడంతో.. ఈ సారి కాంగ్రెస్ టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దుబ్బాకలో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తున్న మంత్రి హరీష్ రావు.. దుబ్బాకలో కాంగ్రెస్ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. కానీ ఆయన వ్యాఖ్యలకు భిన్నంగా కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా వేల సంఖ్యలో జనాలు కనిపించారు. ముఖ్యంగా ప్రచారంలో రేవంత్ రెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయన ప్రచారానికి, ప్రసంగాలకి విశేష స్పందన కనిపిస్తోంది. జన ప్రభంజనంతో దుబ్బాక వార్ వన్ సైడ్ అని భ్రమిస్తున్న అధికార పార్టీ నేతలకు గట్టి సంకేతాలు పంపినట్లు అయింది. అధికార పార్టీపై ఆయన పేల్చుతున్న మాటల తూటాలకు చప్పట్ల వర్షం కురుస్తోంది. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట్ నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్దితో దుబ్బాకని పోల్చి చూడండి.. దుబ్బాక అంటే వాళ్లకి ఎంత చిన్న చూపో మీకే తెలుస్తుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలకు దుబ్బాక ప్రజల నుంచి వచ్చిన స్పందన టీఆర్ఎస్ వర్గాలను ఆలోచనలో పడేశాయి.
తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక బ్రాండ్ గా మారిపోయారు. ఆయన అయితేనే కేసీఆర్ ని డీ కొట్టగలరని, ఆయనకు టీపీసీసీ చీఫ్ పదవి అప్పగించాలని కాంగ్రెస్ శ్రేణులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా దుబ్బాకలో రేవంత్ ప్రచారానికి వచ్చిన రెస్పాన్స్ తో.. ఈ డిమాండ్ మరోసారి తెర మీదకు వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ లో ఏ నాయకుడికి ఈ స్థాయిలో జనం నీరాజనం పట్టట్లేదని అర్థమైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే జోష్ లో దుబ్బాకలో కాంగ్రెస్ సత్తా చాటితే రేవంత్ కి మరింత మైలేజ్ రావడం ఖాయమని, అప్పుడు ఇంచార్జ్ మాణికం ఠాకూర్ కూడా పటుబట్టి రేవంత్ కి తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇప్పించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.