విజయదశమికి పార్టీ పేరు! రజనీతో డీఎంకేలో టెన్షన్ ?
posted on Oct 16, 2020 @ 1:19PM
తమిళనాడులో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీలు కొత్త వ్యూహాలు రచిస్తున్నాయి. కొత్త పార్టీలు, కొత్తగా వచ్చే పార్టీలతో తమిళనాడు రాజకీయం సరికొత్తగా మారుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రజనీ ఎప్పుడెప్పుడు రాజకీయ పార్టీని ప్రకటిస్తారా అని ఆయన అభిమానులు, ప్రజలతో పాటు పొలిటికల్ పార్టీలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. విజయదశమి రోజున ఆయన పార్టీ పేరు ప్రకటిస్తారనే ప్రచారం తమిళనాట జోరుగా సాగుతోంది.
పార్టీ పేరును కేంద్ర ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయడానికి రజనీకాంత్ సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. రజనీ సన్నిహితులు వారం రోజులుగా ఢిల్లీలోనే ఉండి పార్టీ రిజిస్ట్రేషన్ చేయడానికిగాను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. 2021 జనవరి నుంచి రజనీకాంత్ పూర్తిగా పార్టీ వ్యవహారాలపైనే ప్రత్యేక దృష్టిసారిస్తారని తెలుస్తోంది.
కరోనా లాక్‌డౌన్ లో పార్టీ ప్రారంభం కోసం కావాల్సిన ప్రచార సామగ్రికి రజనీకాంత్ సన్నాహాలు చేశారని తెలుస్తోంది. గత ఏడు నెలలుగా ఆయన 50 రకాల ప్రచార వీడియోలు రూపొందించారట. తనదైన స్టైల్‌లో రాజకీయాలు, సామాజిక విషయాలు, తన పార్టీ లక్ష్యాలు, ప్రజలకు తానందించే పథకాల వివరాలు తెలియజేస్తూ ప్రసంగించిన వీడియోలను రికార్డు చేయించారు. పార్టీ పేరును ప్రకటించిన వెంటనే 50 రకాల వీడియోలను వరుసగా సోషల్ మీడియాలో ఆయన విడుదల చేయనున్నారని సన్నిహితులు తెలిపారు. అందులో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయంటున్నారు. విజయదశమి రోజున పార్టీ ప్రకటన తర్వాత తాను మాట్లాడిన వీడియో రజనీ విడుదల చేస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు,
2017 డిసెంబర్ 31న రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు బాషా. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత నుంచి రజనీ పార్టీ పేరు ప్రకటిస్తారని కోట్లాదిమంది ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఆరు నెలలే మిగిలివున్నా రజనీ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటన రాలేదు. రాజకీయాల్లోకి వస్తానని రజనీ ప్రకటించి రెండేళ్లు గడచిపోయాయి. గత మార్చిలో మీడియాతో మాట్లాడిన రజనీ తాను ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననని, పార్టీలో యువకులకు ప్రాధాన్యం ఇస్తానని, పదవులు అధికంగా వుండవని, సేవచేసే వారికే ఇస్తామని ప్రకటించారు. సీఎం పదవికి పోటీ చేయనన్న రజనీ ప్రకటన ఆయన అభిమానులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. రజనీ మక్కల్ మండ్రాల నేతలు ఆయనతో పలు మార్లు చర్చించి తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి పదవికి పోటీ చేయననే నిర్ణయాన్ని రజనీ మార్చుకుంటారని అందరూ భావిస్తున్నారు.
ఇక తమిళనాడు వ్యాప్తంగా ఇటీవల రజనీకాంత్ సర్వే చేయించారని తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు రజనీ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 12 శాతం ఓటు బ్యాంక్ లభిస్తుందని ఆ సర్వేలో తేలిందని చెబుతున్నారు. అన్నాడీఎంకే, డీఎంకే వ్యతిరేక ఓట్లు, తటస్థుల ఓట్లు, అభిమానులు, మక్కల్ మండ్రాల ద్వారా లభించే ఓట్లే అధికంగా వున్నాయి. ఈ ఓటు బ్యాంక్‌తో రజనీ పార్టీ అధికారంలోకి రాలేకపోవచ్చునని సర్వే నిర్వహించిన సంస్థలు చెబుతున్నాయి. అదనంగా మరో 20 శాతం ఓట్లను సంపాదించుకున్నప్పుడే అధికారం సాధ్యమని తెలిపాయి. దీంతో తన ఓటు బ్యాంక్ పెంచుకునే దిశగా త్వరలో సంచలనాత్మకమైన ప్రజా సంక్షేమ పధకాలకు సంబంధించిన ప్రకటన రజనీకాంత్ చేయనున్నారని తెలుస్తోంది.
రజనీ పార్టీ పేరును ప్రకటించగానే ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్, నటుడు లారెన్స్ ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. లారెన్స్‌తోపాటు తమిళురువి మణియన్, కాంగ్రెస్ నేత కరాటే త్యాగరాజన్, మాజీ మంత్రి ఏసీ షణ్ముగం, సినీ నిర్మాతలు, నటీనటులు, అన్నాడీఎంకే, డీఎంకే ల నేతలు కూడా రజనీ పార్టీలో చేరటానికి రెడీగా వున్నారు. ఇప్పటికే రజనీ మక్కల్ మండ్రాల నాయకుల్లో పలువురిని రజనీకాంత్ మార్చారు. పార్టీ పెడితే ఏయే ప్రముఖులు పార్టీలో చేరేందుకు సిద్ధంగా వున్నారనే వివరాలను రజనీ ఇప్పటికే సేకరించారు. ఆ దిశగానే పార్టీలో చేరబోతున్నవారి వద్ద రజనీ తరచూ చర్చలు జరుపుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో గత నెల రోజులుగా రజనీ మక్కల్ మండ్రాల జిల్లా శాఖల నాయకులతో చర్చలు జరిపి బూత్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటివరకూ వెయ్యికి పైగా బూత్ కమిటీలను రజనీ ఏర్పాటు చేశారట.
మరోవైపు రజనీ రాజకీయ పార్టీ స్థాపనపై తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీలో తీవ్ర ఆందోళన నెలకొంది. దీనిపై తమిళనాట ఓ వార్త వైరల్ అవుతోంది. రాజకీయ ప్రవేశం చేయవద్దని రజనీకాంత్‌పై డీఎంకే తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. డీఎంకే పెద్దలు రజనీకి అత్యంత సన్నిహితుడైన ఓ ప్రముఖుడిని ఆయన వద్దకు దూతగా పంపినట్లు సమాచారం. రజనీ ఆరోగ్య పరిస్థితులు, రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దృష్ట్యా రాజకీయాల్లోకి రావద్దంటూ ఆ దూత ఆయనకు తెలిపినట్లు చెబుతున్నారు.అయితే ఇదంతా వట్టి పుకార్లేనని డీఎంకే సీనియర్లు నేతలు ఖండించారు. రజనీ రాజకీయ ప్రవేశం చేయాలని ఆయన అభిమానులతో పాటు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఒక వేళ రజనీని రాజకీయాల్లోకి రావద్దంటూ డీఎంకే చెప్పినా ఆయన ఆ మాటను ఆమోదిస్తారా అని డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. రజనీ రాజకీయాల్లోకి వచ్చినా రాకపోయినా డీఎంకేకు ఎలాంటి నష్టం జరగదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
మొత్తానికి విజయ దశమి సమీపిస్తుండటంతో రజనీకాంత్ అడుగులపై తమిళనాడులో ఆసక్తి పెరుగుతోంది. బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లేనని.. కచ్చితంగా రజనీ రాజకీయ పార్టీ ప్రకటిస్తారని ఆయన అభిమానులు ధీమాగా ఉన్నారు. అదే జరిగితే తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయని అనలిస్టులు చెబుతున్నారు. మరీ దసరా రోజున రాజనీకాంత్ ఏం చేస్తారో చూడాలి మరీ...