ఏపీ దిశా చట్టంలో లోపాలు.. తిప్పి పంపిన కేంద్రం
posted on Oct 16, 2020 @ 1:49PM
ఏపీలో మహిళలపై అత్యాచారాలను నిరోధించేందుకు ఉద్దేశించి జగన్ ప్రభుత్వం పంపిన దిశా చట్టాన్ని కేంద్రం వెనక్కు పంపింది. హైదరాబాద్ నగరంలో దిశ పై హత్యాచారం ఘటన జరిగిన తర్వాత ఒకపక్క ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఏపీ సర్కార్ హడావిడిగా దిశ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదింపజేసుకొని కేంద్రం యొక్క ఆమోదం కోసం పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ దిశ చట్టం పైన కేంద్ర హోంశాఖ, న్యాయ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలకు పంపి అభిప్రాయాన్ని కోరగా… చట్టంలో లోపాలున్నాయని ఆ శాఖలు తెలిపాయి. దీంతో దిశ చట్టంలో మార్పులు చేర్పులు సూచిస్తూ కేంద్రం దీన్ని వెనక్కి పంపినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన దిశా చట్టం అమలులోకి రావాలంటే కేంద్రం ఆమోదంతోపాటు రాష్ట్రపతి కూడా ఆమోదం తెలిపిన తర్వాతే అధికారికంగా ఏపీలో దిశ చట్టం అమలులోకి వస్తుంది. అయితే ఏపీలో దిశా చట్టం ఆధారంగా ఇప్పటికే పలు చోట్ల దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ చట్టం కింద కేసులు కూడా పెట్టగా.. ఇపుడు కేంద్రం దీన్ని వెనక్కు పంపడం గమనార్హం. ఈ దిశ చట్టం ప్రకారం మహిళలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే 21రోజుల్లోగా దోషులకు శిక్ష పడేలా ఏపీ ప్రభుత్వం ఈ దిశ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కేంద్రం ఈ చట్టాన్ని వెనక్కి పంపడంతో.. కేంద్రం సూచించిన మార్పులు చేర్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తిరిగి పంపాల్సి ఉంటుంది.