గులాం నబీ ఆజాద్ కు కరోనా పాజిటివ్
posted on Oct 16, 2020 @ 5:06PM
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ అజాద్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, ప్రస్తుతం హోం క్యారంటైన్ లో ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. కొన్ని రోజులుగా తనతో సన్నిహితంగా మెలిగిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ఆయన కోరారు. అయితే, ఆజాద్ కు ఎలాంటి లక్షణాలు లేకుండానే పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కొత్తగా 63,371 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 73,70,469 కి చేరింది. కరోనా కారణంగా మరో 895 మంది మరణించగా.. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,12,161 కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,04,528 యాక్టివ్ కేసులు ఉన్నాయి.