ఖమ్మం మైనర్ బాలిక మృతి
posted on Oct 16, 2020 @ 1:14PM
ఖమ్మం జిల్లాలో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక(13) మృతి చెందింది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక గురువారం రాత్రి కన్నుమూసింది.
ముస్తాఫా నగర్‌లోని ఓ ఇంట్లో పనిచేస్తున్న మైనర్ బాలికపై.. ఆ ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక ప్రతిఘటించడంతో కోపంతో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 70 శాతం కాలిన గాయాలైన ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించి గోప్యంగా చికిత్స అందజేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే బాలికతో పాటు ఆమె తల్లిదండ్రులను చంపేస్తామని నిందితుడి కుటుంబం బెదిరింపులకు పాల్పడటమే కాకుండా.. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు.. మధ్యవర్తుల ద్వారా డబ్బు ఇప్పించేలా బాలిక తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే, బాలిక పరిస్థితి విషమించడంతో ఆ తరువాత హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా.. ఘటన వెలుగులోకి వచ్చింది. కాలిన గాయాలతో 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన బాలిక చివరకు తన ప్రాణాలు విడిచింది.